రామయ్యా….వస్తావయ్యా…?

ఎప్పుడైనా…ఏదైనా జరగొచ్చు. కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వానికి ఇది కరెక్ట్ గా సరిపోతుంది. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తికాకముందే రెండుపార్టీల నేతల్లో అసహనం, అసంతృప్తి బయలుదేరాయి. దీనికి సిద్ధరామయ్య కేంద్ర బిందువుగా మారారు. ఐదేళ్ల పాటు కర్ణాటకను పాలించిన సిద్ధరామయ్య జనతాదళ్ (ఎస్) అంటేనే పొసగదు. దేవెగౌడ కుటుంబానికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వటాన్ని సిద్ధరామయ్య తొలినుంచి వ్యతిరేకిస్తూనే ఉన్నారు. దీనికి తోడు కుమారస్వామి కాంగ్రెస్ పార్టీలో తన అనుకూలురైన వారిని కలుపుకుని వెళుతూ తనను దూరం పెడుతున్నారన్న అహసనాన్ని కూడా సిద్ధరామయ్య ప్రదర్శిస్తున్నారు. ఇలా సిద్ధరామయ్య తన వ్యాఖ్యలతోనూ, వ్యవహారశైలితోనూ సంకీర్ణ ప్రభుత్వాన్ని చిక్కుల్లో పడేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు మరోసారి సిద్దరామయ్య ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటుండగా, భారతీయ జనతా పార్టీ మాత్రం సిద్ధరామయ్య తమ పార్టీలోకి వస్తారని ఎదురుతెన్నులు చూస్తోంది.

సిద్ధూ వెంటే…కొందరు…..

సిద్ధరామయ్య ఇప్పటికిప్పుడు తలచుకుంటే కాంగ్రెస్ పార్టీలో చీలిక వస్తుందన్నది అందరికీ తెలిసిందే. సిద్ధూ వెంట దాదాపు ఇరవై మంది వరకూ ఎమ్మెల్యేలు, కొందరు మంత్రులు ఉన్నారు. మంత్రి పదవులు ఆశిస్తున్న వారు, సిద్ధరామయ్య నాయకత్వంపై నమ్మకం ఉన్న వారు ఆయన వెంటే ఉంటూ వస్తున్నారు. సిద్ధరామయ్య లేనిదే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ లేదన్న విషయాన్ని కూడా కొందరు బహిరంగంగానే గుర్తు చేస్తున్నారు. ఐదేళ్ల పాలన అనంతరం కాంగ్రెస్ రెండో అతి పెద్ద పార్టీగా అవరతించిందంటే అందుకు సిద్ధరామయ్యే కారణమని చెబుతున్న వారున్నారు. ముఖ్యమంత్రి కుమారస్వామి, ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర, మంత్రి డీకే శివకుమార్ ల జట్టును వ్యతిరేకించే వారు కూడా లేకపోలేదు.

సిద్ధరామయ్య నిర్ణయంపైనే….

దీంతో సిద్ధరామయ్య ఎప్పుడు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ముఖ్యమంత్రిని మార్చాలన్నదే సిద్ధరామయ్య ఏకైక లక్ష్యంగా కన్పిస్తోంది. ప్రస్తుతానికి సంకీర్ణ ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా సీఎంను ఎలా మార్చాలన్నదానిపైనే సిద్ధూ వ్యూహరచన చేస్తున్నారు. ఇందుకు కాంగ్రెస్ సభ్యుల నుంచి కూడా మద్దతు లభిస్తుండటం విశేషం. ఢిల్లీ పెద్దలు వారిస్తున్నా సిద్ధరామయ్య మాత్రం తన ఆలోచనను వీడకపోగా, రోజురోజుకూ స్పీడ్ పెంచుతూనే ఉన్నారు. సమన్వయ సమితి తీర్మానిస్తే ముఖ్యమంత్రిని మార్చడం పెద్ద కష్టమేమీ కాదంటూ మంత్రి శివశంకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దీనికి అద్దం పడుతున్నాయి. సిద్ధూ వెంట బలమైన నేతలు ఆర్.వి.దేశ్ పాండే. శివశంకర్ రెడ్డి, హెచ్.ఎం.రేవణ్ణ, హెచ్.కె.పాటిల్, ఎస్.ఆర్ పాటిల్ వంటి వారు ఉన్నారు. దీంతో కుమారస్వామిలోనూ ఒకింత కలవరం బయలుదేరింది. సిద్ధరామయ్య యూరప్ పర్యటన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు చేసుకుంటాయంటున్నారు. సిద్ధరామయ్య ముఖ్యమంత్రి కావాలని కాంగ్రెస్ లోనే ఎక్కువ మంది నేతలు కోరుకుంటున్నారు.

బీజేపీ నేతలు ఆశగా…..

ఇదే విషయాన్ని బీజేపీ నేత, కేంద్రమంత్రి అనంతకుమార్ కూడా స్పష్టం చేశారు. త్వరలోనే కర్ణాటక రాజకీయాల్లో ఊహించని మార్పులు సంభవిస్తాయని జోస్యం చెప్పారు. సిద్ధరామయ్య మీతో టచ్ లో ఉన్నారన్న ప్రశ్నకు దానికి బహిరంగంగా చెప్పలేమని దాటవేశారు. సంకీర్ణ ప్రభుత్వంలో అంతర్గత కుమ్ములాటలు ప్రారంభమయ్యాయని, ఎప్పుడైనా ప్రభుత్వం కుప్పకూలే అవకాశముందన్నారు. అయితే బీజేపీ మాత్రం తాజా రాజకీయ పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కేవలం ఎనిమిది మంది సభ్యులు మాత్రమే అవసరం. ఆ సంఖ్యను సంపాదించడం పెద్ద కష్టమేమీ కాదని, అయితే లోక్ సభ ఎన్నికల కారణంగానే ఆపరేషన్ ఆకర్ష్ కు కామా మాత్రమే పెట్టామనిచెబుతున్నారు. కాంగ్రెస్, జేడీఎస్ లు తమంతట తామే ప్రభుత్వాన్నికూల్చివేసుకుంటాయన్న నమ్మకంతో ఉన్నారు. మొత్తం మీద కర్ణాటక రాజకీయాల్లో త్వరలోనే ఊహించిన మార్పులు ఉంటాయన్న ప్రచారం జరుగుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*