సిద్ధూ…ఉత్తిత్తికే కదూ….!

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పైచేయి సాధించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇది అనుకూలమైన సమయం కాదని గ్రహించిన సిద్ధరామయ్య భవిష్యత్ తనదేనన్న నమ్మకంతో ఉన్నారు. లోక్ సభ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా మారతాయన్నది విశ్లేషకుల అంచనా. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి ఒకవేళ వచ్చినా….రాకున్నా రాష్ట్రంలో రాజకీయ మార్పు తప్పదన్నది ప్రతి ఒక్కరూ ఊహస్తున్నదే. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సిద్ధరామయ్య మరోసారి ముఖ్యమంత్రి అయ్యే ప్రయత్నం చేస్తారు. అదే కాంగ్రెస్ రాకుండా కేంద్రంలో బీజేపీ మరోసారి పవర్ లోకి వస్తే కర్ణాటక సంకీర్ణ సర్కార్ ను కొనసాగనివ్వదన్నది అందరికీ తెలిసిందే.

లోక్ సభ ఎన్నికల తర్వాత…..

ఇప్పటికే యడ్యూరప్ప అనేక సందర్భాల్లో ఈ అంశాలను ప్రస్తావించారు. తమతో కాంగ్రెస్ నేతలు టచ్ లో ఉన్నారని ఆయన చెబుతన్నారు. తమ ప్రమేయం లేకుండా వారిలో వారికి పడక సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోతుందని యడ్డీ జోస్యం చెబుతూనే ఉన్నారు. తమ పార్టీతో దాదాపు 20 మంది నేతలు టచ్ లో ఉండి పార్టీలోకి వస్తామని చెబుతున్నప్పటికీ కేంద్ర నాయకత్వం ఆదేశాల మేరకు చేరికలను రాష్ట్ర పార్టీ ఆపేసిందన్న వార్తలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు అధికారంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలగొట్టి తాము పవర్ లోకి వస్తే ఆ ఎఫెక్ట్ లోక్ సభ ఎన్నికలపై పడుతుంది. అందుకే కమలనాధులు కొంత తగ్గి లోక్ సభ ఎన్నికల వరకూ వెయిట్ చేస్తున్నారు.

ఊరడింపు వ్యాఖ్యలేనా?

ఏ విధంగా చూసినా లోక్ సభ ఎన్నికల తర్వాత కర్ణాటక రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటాయన్నది కాదనలేని వాస్తవం. ఇందుకు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా మానసికంగా సిద్ధమయిపోయారు. ఈ పరిస్థితుల్లో సిద్ధరామయ్య చెబుతున్న మాటలు ఉత్తుత్తికేనన్నది పార్టీలో అందరూ చర్చించుకుంటున్న మాట. పార్టీ సమన్వయ సమతి సమావేశం ముగిసిన తర్వాత సిద్ధరామయ్య మాట్లాడుతూ సంకీర్ణ ప్రభుత్వం ఐదేళ్ల పాటు కొనసాగుతుందని చెప్పారు. పాలన భేషుగ్గా ఉందన్నారు. ఈ మాటల వెనక మర్మమేమటని కొందరు కాంగ్రెస్, జేడీఎస్ నేతలు ఆరా తీస్తున్నారు.

పట్టు సాధించడానికేనా?

ఐదేళ్ల పాటు సంకీర్ణ ప్రభుత్వం కొనసాగతుందని సిద్దరామయ్య చెప్పారు కాని, కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పలేదుగా అని అర్థాలు తీసేవాళ్లు కూడా లేకపోలేదు. ఐదేళ్లు నిరాటంకంగా పాలిస్తామంటే లోక్ సభ ఎన్నికల తర్వాత సీఎం ఎవరన్నది కూడా ఇప్పుడు రెండు పార్టీల్లో చర్చనీయాంశమైంది. కుమారస్వామి ఇటీవల ఢిల్లీ వెళ్లి సిద్ధరామయ్యపై ఫిర్యాదు చేశారంటున్నారు. సిద్ధరామయ్య వ్యాఖ్యల ప్రభుత్వంపై పడుతుందని, పార్టీలోనూ అయోమయం నెలకొందని, సిద్ధూను కట్టడి చేయాలనికుమార స్వామి రాహుల్ కు చెప్పినట్లు తెలుస్తోంది. కుమారస్వామి రాహుల్ తో మీట్ అయి వచ్చిన సందర్భంలోనే సిద్దరామయ్య ప్రభుత్వానికి ఏమీ ఢోకాలేదన్న వ్యాఖ్యలు చేశారంటున్నారు. మరోవైపు సిద్ధరామయ్య తన పట్టు సాధించుకుంటున్నారు. గతంలో తాను ముఖ్యమంత్రిగా ప్రవేశపెట్టిన అన్నభాగ్య పథకానికి రేషన్ తగ్గించడాన్ని గతంలో తప్పుపట్టారు. సమన్వయ సమితి ఛైర్మన్ గా దాన్ని మళ్లీ సాధించుకున్నారు. అన్న భాగ్య కింద ఇకపై ఏడు కిలోల బియ్యం ఇవ్వాలని సమన్వయ సమితి సమావేశంలో నిర్ణయించారు. మొత్తం మీద సిద్దూ మాటలకు అర్థాలు వేరులే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*