కాంగ్రెస్ ఓటమికి కారణాలెన్నో…?

కర్ణాటకలో కాంగ్రెస్ ఓటమికి కారణాలు అనేకం. ఈ దక్షిణాది రాష్ట్రంలో హస్తం పార్టీ వైఫల్యం చూశాక ‘కర్ణు’డి చావుకి కారణాల అనేకం అన్న సామెత గుర్తుకురాక మానదు. జాతీయస్థాయిలో నాయకత్వం ప్రభావమంతగా లేకపోవడం, రాష్ట్రస్థాయి నాయకుల మధ్య లుకలుకలు, అవినీతి, అసమర్థపాలన, ప్రభుత్వ వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ కొంసముంచాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వ్యవహారశైలి కూడా ఒక కారణమని చెప్పక తప్పదు.

సరైన నాయకత్వం లేక…..

2014 లోక్ సభ ఎన్నికల అనంతరం జాతీయస్థాయిలో నాయకత్వం నిర్వీర్యమైంది. పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యం నింపే నాయకుడు కరువయ్యాడు. గత నాలుగేళ్లలో పార్టీ ఒక రకంగా నాయకత్వలేమి చవిచూసింది. అధినేత్రి సోనియా అనారోగ్యం, రాహుల్ గాంధీ పరిపక్వతలేమి కారణంగా సమర్థనాయకత్వం లోపించింది. కష్టకాలంలో పార్టీని ముందుండి నడిపించాల్సిన నాయకుడు కరువయ్యాడు. దీనికితోడు 2014 లోక్ సభ ఎన్నికల అనంతరం జరిగిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోవరుస పరాజయాలు పార్టీని కుంగదీశాయి. ఒక్క పంజాబ్ తప్ప మరే రాఫ్ట్రంలోనూ హస్తం పార్టీ విజయం సాధించలేకపోయింది. మణిపూర్, మేఘాలయ, గోవా, ఉత్తరాఖండ్, అసోం, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో అధికారం కోల్పోయింది. అరుణాచల్ ప్రదేశ్ లో జరిగిన రాజకీయక్రీడలో విఫలం కావడంతో పొంత ప్రభుత్వాన్ని కోల్పోవలసి వచ్చింది. రాహుల్ గాంధీ పగ్గాలు చేపట్టిన తర్వాత కూడా పరిస్థితిలో పెద్దగా మార్పు రాలేదు. ఆయన ఏఐసీసీ అధ్యక్షుడయ్యాకే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో పరాజయాన్ని ఎదుర్కొంది. ఏ రకంగానూ రాహుల్ మోడీకి దీటైన నాయకుడు కాదన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమైంది. కర్ణాటక ఎన్నికల్లోనూ ఈ పరిస్థితి ప్రతిబింబించింది. రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించి, ప్రచారం చేసినప్పటికీ మోదీ ధాటికి నిలబడలేకపోయారు.

సమన్వయం ఎక్కడ….?

రాష్ట్రస్థాయి నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం కూడా ఓటమికి మరో కారణం. పీసీసీ అధ్యక్షుడు పరమేశ్వరన్, లోక్ సభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే, మాజీ ముఖ్యమంత్రి వీరప్ప మొయిలీ, మాజీ కేంద్రమంత్రి, గవర్నర్ మార్గరేట్ ఆల్వా తదితర సీనియర్ నాయకులు సీఎం పీఠంపై కన్నేశారు. గత అయిదేళ్లుగా సిద్ధరామయ్యను సాగనంపడానికి వారు అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ విజయవంతం కాలేకపోయారు. ఈసారి గెలిస్తే మళ్లీ సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అవతారన్న భయంతో వారు మనస్ఫూర్తిగా పనిచేయలేదు. వీరప్ప మొయిలీ కుమారుడికి పార్టీ టిక్కెట్ నిరాకరించడంతో ఆయన నామమాత్రంగా ప్రచారంలో పాల్గొన్నాడు. మార్గరేట్ ఆల్వా కుమారుడికి సైతం పార్టీ రిక్తహస్తం చూపడంతో ఆమె పరిస్థితి కూడా అంతే.

సిద్ధూ తప్పలు కూడా…..

ఇక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయడం పార్టీ శ్రేణులకు తప్పుడు సంకేతాలను పంపించింది. విపక్షం చేతికి ఆయుధం ఇచ్చినట్లయింది. కుమారుడి కోసం సొంత నియోజకవర్గం వరుణను త్యాగం చేసిన సిద్ధరామయ్య పాత నియోజకవర్గం చాముండేశ్వరి స్థానం నుంచి అయిష్టంగానే బరిలోకి దిగారు. గతంలో ఆయన ఇక్కడినుంచి అయిదుసార్లు పోటీ చేసినప్పటికీ మారిన పరిస్థితుల్లో విజయం అంత తేలిక కాదని భావించారు. అందుకే మరో నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తానని కోరినప్పటికీ అధిష్ఠానం అంగీకరించలేదు. ఒత్తిడుల అనంతరం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బాగల్ కోట్ జిల్లాలోని బాదామి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. ఇక్కడ ఆయన సామాజిక వర్గీయులు ఎక్కువ. ఓటమిభయంతోనే ముందుజాగ్రత్తగా రెండు నియోజకవర్గాల నుంచి పోటీకి దిగారన్న ప్రచారం ఊపందుకుంది. విపక్షాలు ఇదే అంశాన్ని బాగా ప్రచారం చేశాయి. అంతర్గతంగా పార్టీలో కూడా ప్రచారం జరిగింది. ఎన్నికల ఫలితాల్లో అదేజరిగింది. సిద్ధరామయ్య చాముండేశ్వరి నియోజకవర్గంలోఘోరంగా ఓటమిపాలయ్యారు. బాదామిలో గెలుపొందారు.

ఎన్ని ఫీట్లు చేసినా….

లింగాయత్ లను ప్రత్యేక మతంగా గుర్తించడం, కన్నడ ప్రత్యేక జెండా వంటి అంశాలు తమకు అనుకూలంగా మారతాయని కాంగ్రెస్ భావించింది. కాని ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే లింగాయత్ లు కాంగ్రెస్ వెంట నడవలేదన్నది అర్థమైంది. ఆదినుంచి లింగాయత్ లు బీజేపీ మద్దతుదారులు. వారిని ప్రసన్నం చేపుకోవాలనే ఉద్దేశంతో ప్రత్యేక మత ప్రస్తావన తీసుకువచ్చారు. అది కేంద్రం వద్ద పెండింగ్ లో ఉంది. మొత్తానికి లింగాయత్ లను తన వైపు తిప్పుకోవడంలో విఫలమవ్వడం, రాష్ట్రానికి ప్రత్యేక జెండా నినాదం వల్ల రాజకీయంగా లాభం జరగకపోగా నష్టం వాటిల్లింది. ఈ విషయాన్ని పార్టీ అధిష్ఠానం కూడా మపస్ఫూర్తిగా అంగీకరించలేకపోయింది. సిద్ధరామయ్య సర్కారుపై వచ్చిన అవినీతి ఆరోపణలను విపక్ష బీజేపీ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. ఇది పర్సంటేజీల ప్రభుత్వమని అదేపనిగా ప్రచారం చేసింది. ప్రధాని మోదీ ప్రతీ బహిరంగ సభలోనూ ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఎమ్మెల్యేలు, రాష్ట్రమంత్రులు కోట్లకు పడగలెత్తడం వంటి విపక్షాల ఆరోపణలకు బలానిచ్చాయి. సహజంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకత కూడా సిద్ధరామయ్య సర్కారు కొంప ముంచింది. అన్నభాగ్య, క్షీరభాగ్య వంటి పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినప్పటికీ వాటిని సమర్థంగా అమలు చేయడంలో విఫలం కావడం ఎన్నికల్లో ప్రభావం చూపించింది ఓడిపోయినప్పటికీ పూర్తికాలం పదవిలో కొనసాగిన వ్యక్తిగా సిద్ధరామయ్య సంచలనం సృష్టించారు. గతంలో నిజలింగప్ప, దేవరాజ్ ఆర్స్ తర్వాత ఈ ఘనత సాధించింది సిద్ధరామయ్యే కావడం విశేషం.

-ఎడిటోరియల్ డెస్క్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*