సిద్ధూ అంతలా ఎలా ఎదిగారబ్బా…?

సిద్ధరామయ్య….నిన్న మొన్నటి దాకా ఈయన పేరు రాష్ట్రానికే పరిమితం. ఇప్పుడు ఒక్కసారిగా ఈ కన్నడ నాయకుడి పేరు జాతీయస్థాయిలో మార్మోగిపోతోంది. ఆంగ్ల పత్రికలు, ఛానెళ్లలో కర్ణాటక ముఖ్యమంత్రి పనితీరు, సామర్థ్యం, రాజకీయ పలుకుబడి, ప్రస్థానంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. లోతైన విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇందుకు కారణం వచ్చే నెలలో జరిగే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

అంతా ఒంటిచేత్తోనే….

ప్రస్తుతం సిద్ధరామయ్య ఒంటి చేత్తో ఎ్నికల వ్యవహారాలను చక్కబెడుతున్నారు. ప్రచారం నుంచి టిక్కట్ల పంపిణీ వరకు, నిధుల పంపిణీ నుంచి సామాజిక వర్గాల విశ్లేషణ వరకూ…ఇలా ప్రతి చిన్న విషయాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ కు ఆయనే పెద్దదిక్కు. పీసీసీ అధ్యక్షుడు పరమేశ్వర ఉన్నప్పటికీ ఆయన ప్రభావం, ప్రచారం పరిమితం. సహజంగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిదే కీలకస్థానం. పీసీసీ అధ్యక్షుడిది రెండో స్థానమే. ఆ మాటకు వస్తే హస్తం పార్టీ ఒక్కటే కాదు అన్ని పార్టీలదీ ఇదే పరిస్థితి. కర్ణాటకకు చెందిన పార్టీ కేంద్ర నాయకుల పాత్ర కూడా పరిమితమే. కేంద్ర మాజీమంత్రులు వీరప్ప మొయిలీ, మార్గరెట్ ఆల్వా, జాఫర్ షరీఫ్, బీకే హరిప్రసాద్ వంటి జాతీయ నాయకుల ప్రభావం పెద్దగా లేదనే చెప్పాలి. వీరిలో మొయిలీ ముఖ్యమంత్రిగా, మార్గరెట్ ఆల్వా రాజస్థాన్ గవర్నర్ గా పనిచేశారు. ఎవరు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ అంతటా సిద్ధరామయ్యదే హవా. రాహుల్ గాంధీ తర్వాత ఆయన మాటే చెలామణి అవుతుంది.

ప్రజాదరణ లేకపోయినా….

ముఖ్యమంత్రిగా 2013 మే 13న బాధ్యతలు చేపట్టిన సిద్ధరామయ్య గొప్ప ప్రజాదరణ నాయకుడేమీ కాదు. సిద్ధాంతపరమైన పట్టింపులేమీ లేవు. పరిస్థితులు, అవసరాలను బట్టి ఆయన రాజకీయం మారుతుంటుంది. సామాజిక వర్గం కూడా రాజకీయ ఎదుగుదలలో కీలకపాత్ర పోషించింది. కాంగ్రెసేతర నాయకుడిగా చాలాకాలం ప్రస్థానం కొనసాగించిన సిద్ధరామయ్య అదే కాంగ్రెస్ పార్టీలో చేరి అయిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగడం విశేషమే. వాస్తవానికి ఆయన రాజకీయ ప్రస్థానం సజావుగా సాగలేదు. ఓటములు, పార్టీ ఫిరాయింపులు కొత్త కాదు. నిజానికి ఓటమితోనే రాజకీయ ప్రవేశం మొదలు పెట్టారు. 1948 ఆగస్టు 12న మైసూరులో జన్మించిన ఆయన న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. కొంతకాలం న్యాయవాదిగా కూడా పనిచేశారు. తొలి రాజకీయ ప్రవేశం ఓటమితోనే ప్రారంభమైంది. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో జనతాదళ్ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాజశేఖరమూర్తి చేతిలో ఓడిపోయారు. అనంతరం జనతాదళ్ రాష్ట్ర సెక్రటరీ జనరల్ గా నియమితులయ్యారు. 1994 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి దేవెగౌడ మంత్రివర్గంలో ఆర్థిక మంత్రిగా నియమితులయ్యారు. 1996లో దేవెగౌడ ప్రధాని కావడంతో జె.హెచ్.పటేల్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన వద్ద సిద్ధారామయ్య ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు.

దేవెగౌడ తో విభేదించి…..

జనతాదళ్ చీలిక సమయంలో దేవెగౌడ సారథ్యంలోని జనతాదళ్ (ఎస్) లో చేరి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. 1999 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. 2004లో కాంగ్రెస్, జనతాదళ్ (ఎస్) సంకీర్ణ ప్రభుత్వంలో మళ్లీ ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు. అప్పుడు ధరమ్ సింగ్ ముఖ్యమంత్రి. దేవెగౌడతో విభేదాల కారణంగా 2005లో పార్టీ సిద్ధరామయ్యను బహిష్కరించింది. దీంతో ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేయాలని కూడా ఆలోచించారు. అయితే ఆచరణలో సాధ్యంకాదని భావించారు. అనంతరం కాంగ్రెస్ లో చేరారు. సోనియా గాంధీ సమక్షంలో బెంగళూరులో జరిగిన భారీ బహిరంగసభలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 2006 డిసెంబరులో జరిగిన చాముండేశ్వరి నియోజకవర్గ ఉప ఎన్నికలో 257 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో గెలిచారు. అప్పట్లో ఆయనను ఓడించేందుకు దేవెగౌడ, ముఖ్యమంత్రి కుమారస్వామి, ఉప ముఖ్యమంత్రి యడ్యూరప్ప తీవ్రంగా ప్రచారం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. 2008 అసెంబ్లీ ఎన్నికల్లో వరుణ స్థానం నుంచి ఎన్నికయ్యారు. 2013 ఎన్నికల్లో విజయం సాధించి చిరకాల వాంఛ అయిన ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. అప్పటి నుంచి ఆయనకు ఎదురులేకుండా పోయింది. ఇద్దరు కుమారుల్లో ఒకరైన రాకేష్ 2016 జులైలో బెల్జియంలో అనారోగ్యానికి గురై మరణించారు. వైద్యుడైన చిన్న కుమారుడు యతీంద్రను ఎన్నికల బరిలో దించుతున్నారు. 2013 ఎన్నికల సమయంలో ఇవే తన ఆఖరు ఎన్నికలని ప్రచారం చేసి విజయం సాధించిన సిద్ధరామయ్య ఇప్పుడు కూడా ఇవే తన చివరి ఎన్నికలని చెబుతుండటం విశేషం.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*