సిద్ధూకు మరో ఛాలెంజ్…!

కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చే లోక్ సభ ఎన్నికలపై దృష్టి పెట్టింది. లోక్ సభ ఎన్నికల వరకూ ఎవరూ రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిర పర్చే ఆలోచన చేయవద్దని స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 102 స్థానాలను సాధించినప్పటికీ రాష్ట్రంలో అధికారంలోకి రాలేకపోయింది. కాంగ్రెస్ సార్వత్రిక ఎన్నికలతో పాటు తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లోనూ విజయం సాధించి 80 స్థానాల వరకూ దక్కించుకుంది. జేడీఎస్ కు 37 స్థానాలను దక్కినా దానికే ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం కర్ణాటక కాంగ్రెస్ నేతలకు మింగుడుపడటంలేదు. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చే ప్రయత్నాలు కొద్దిగా చేశారు.

లోక్ సభ ఎన్నికలపై…..

అయితే సిద్ధరామయ్య చేస్తున్న వ్యాఖ్యలు, పెడుతున్న సమావేశాలపై కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా లోక్ సభ ఎన్నికల వరకూ పార్టీ ఆదేశాలకు వ్యతిరేకంగా ఎటువంటి చర్యలకు పాల్పడవద్దని గట్టిగానే హెచ్చరించింది. దీంతో సిద్ధరామయ్య వెనక్కు తగ్గారు. మరో పదినెలలు ఓపిక పట్టాలని సిద్ధూ తన సన్నిహిత ఎమ్మెల్యేలకు సూచించారు. లోక్ సభఎన్నికలే లక్ష్యంగా ఇప్పుడు జేడీఎస్ తో కలసి పనిచేయాలన్న కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశాలను సిద్ధూప్రస్తుతం తూచా తప్పకుండా పాటిస్తున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై కూడా సిద్ధూ కసరత్తులు చేస్తున్నారు. సిద్ధూ ఎటువంటి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడకుండా ఆయనకు లోక్ సభ ఎంపిక అభ్యర్థుల బాధ్యతను అప్పగించినట్లు గుసగుసలు పార్టీలో విన్పిస్తున్నాయి.

బిజిబిజీగా సిద్ధూ…..

ఇప్పుడు సిద్ధరామయ్య బిజీబిజీగా ఉన్నారు. ఒక పక్క జనతాదళ్ ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య సమన్వయ కర్తగా ఉంటూనే లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధించడంపై ఆయన దృష్టిపెట్టారు. అందులో భాగంగానే ఆయన నిన్న ఇటీవల సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలయిన కాంగ్రెస్ అభ్యర్థులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సిద్ధరామయ్యతో పాటు ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర కూడా పాల్గొన్నారు. శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలయిన అభ్యర్థుల్లో కొందరిని లోక్ సభకు ఎంపిక చేస్తామని ఈ సందర్భంగా సిద్ధరామయ్య ప్రకటించారు. కాంగ్రెస్ శాసనసభ్యుల నియోజకవర్గాల్లో బడ్జెట్ కేటాయింపులు అధికంగా జరగడానికి తన ఒత్తిడే కారణమని తెలిపారు.

నమ్మలేం అంటూనే…..

అంతేకాకుండా జేడీఎస్ తో కలసి నడిస్తే కాంగ్రెస్ పార్టీ బలహీన పడుతుందని, ఒంటరిగానే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవ్వాలని కర్ణాటక కాంగ్రెస్ నేతలు నిర్ణయించారు. గత శాసనసభ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన నియోజకవర్గాలు అనేకం ఉన్నాయని, లోక్ సభ సీట్లలో ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోవడానికి ఇప్పటి నుంచే నియోజకవర్గాల్లో పర్యటించాలని ఆయన కోరారు. జేడీఎస్ ను నమ్మే పరిస్థితి లేదని కూడా సిద్ధరామయ్య అన్నట్లు తెలిసింది. అయితే లోక్ సభ ఎన్నికలు పూర్తయ్యేంతవరకూ ఓపిక పట్టాలని, లోక్ సభ ఎన్నికల తర్వాత రాజకీయ పరిణామాలు మారే అవకాశముందని కూడా ఆయన ఓటమి పాలయిన ఎమ్మెల్యే అభ్యర్ధులతో అన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద సిద్ధూ సైలెంట్ వెనక ఇదీ కథ అన్న ప్రచారం కర్ణాటక కాంగ్రెస్ లో జోరుగా సాగుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*