డోన్ట్ అండర్ ఎస్ట్ మేట్ మి….!

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య క్రమంగా పట్టుపెంచుకునే ప్రయత్నంలో ఉన్నారు. అధిష్టానం వద్ద తానేంటో చెప్పకుండానే తెలిసేటట్లు చేయాలన్నది సిద్ధూ వ్యూహంగా తెలుస్తోంది. కర్ణాటకలో సంకీర్ణ సర్కార్ సజావుగా సాగాలంటే తన ఆశీస్సులు ఉండాలని సిద్దరామయ్య బలంగా ఇటు జేడీఎస్ కు, అటు కాంగ్రెస్ హైకమాండ్ కు సంకేతాలు పంపుతున్నారు. సిద్ధరామయ్య గత ఎన్నికల్లో ఒక నియోజకవర్గంలో ఓడి మరో నియోజకవర్గంలో విజయం సాధించారు. సిద్ధరామయ్యను సంకీర్ణ సర్కార్ లో సమన్వయ కమిటీ ఛైర్మన్ గా నియమించింది. కానీ సిద్దరామయ్య ముఖ్యమంత్రి కుమారస్వామి తీసుకుంటున్న నిర్ణయాలపై తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు.

యూరప్ పర్యటనలో ఉన్నా……

తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న సిద్ధరామయ్యపై ముఖ్యమంత్రి కుమారస్వామి ఇటీవల కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేసినట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే సిద్ధరామయ్య ప్రస్తుతం యూరప్ పర్యటనలో ఉన్నారు. సిద్దరామయ్య యూరప్ పర్యటనకు వెళ్లేముందే ఇక్కడ బెళగావి జిల్లా కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తులు చెలరేగాయి. మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు లక్ష్మీ హెబ్బాళ్కర్ తో మొదలయిన వివాదం చినికి చినికి గాలి వానలా మారింది. లక్ష్మీ హెబ్బాళ్కర్ కు, బెళగావి సోదరులు రమేష్ జార్ఘిహోళి, సతీష్ జార్ఖిహోళిలకు మధ్య సహకార బ్యాంకు ఎన్నికల వివాదం తలెత్తింది. అధిష్టానంలో పెద్దలు లక్ష్మీ హెబ్బాళ్కర్ కు వత్తాసు పలకడంతో జార్ఖిహోళి సోదరులు కొంత అసహనానికి గురయ్యారు.

బెళగావి బ్రదర్స్ బెదిరింపులు…..

సిద్ధరామయ్య యూరప్ పర్యటనకు వెళుతూ వీరితో మాట్లాడి సర్ది చెప్పి పంపారు. అయితే జార్ఖిహోళి సోదరులు యడ్యూరప్ప తో రహస్యంగా సమావేశమయ్యారన్న వార్తలు ఇటు కాంగ్రెస్ కు, ఇటు జేడీఎస్ కు కునుకు రానివ్వడం లేదు. జార్ఖిహోళి సోదరులతో పాటు ఆరుగురు ఎమ్మెల్యేలతో కలసి బీజేపీతో చేరతారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. బెళగావి బ్రదర్స్ బీజేపీ నేత శ్రీరాములతో కూడా ప్రత్యేక సమావేశం నిర్వహించారని తెలియడంతో కాంగ్రెస్ నేతలు దిద్దుబాటు చర్యలకు దిగారు. కాంగ్రెస్ నేతలతో చర్చించేందుకు వారు ఇష్టపడటం లేదు. ముఖ్యంగా మంత్రి డీకే శివకుమార్ వ్యవహారశైలిపై మంత్రి రమేష్ జార్ఖిహోళి మండిపడుతున్నారు.

సిద్ధూ వచ్చిన తర్వాతే……

అయితే మంత్రి రమేష్ జార్ఖిహోళి మాత్రం తాము పార్టీని వీడుతున్నట్లు వస్తున్న వార్తలో నిజంలేదని, అయితే పార్టీపై అసంతృప్తి ఉందని ఆయన చెబుతుండటం విశేషం. ఇప్పటికే బీజేపీ నేతలతో అగ్రిమెంటు కూడా పూర్తయిందని, బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే ఆరుగురికి మంత్రి పదవులు ఇచ్చే విషయమై చర్చలు కూడా జరిపారని చెబుతున్నారు. కాని మంత్రి రమేష్ జార్ఖిహోళి మాత్రం సిద్ధరామయ్య యూరప్ పర్యటన వచ్చిన తర్వాతే తమ నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు. రాష్ట్రకాంగ్రెస్ నేతలు ఈ విషయాన్ని యూరప్ పర్యటనలో ఉన్న సిద్ధరామయ్య దృష్టికి కూడా తీసుకెళ్లారు. తాను వచ్చి సర్దుబాటు చేస్తానని ఆయన హామీ ఇచ్చినట్లు సమాచారం. ఇలా అసంతృప్తిని వెనకనుంచి ప్రోత్సహిస్తూ…తన పరపతిని పెంచుకునేందుకు సిద్ధరామయ్య ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ నేతలు అనుమానిస్తున్నారు. మరి కర్ణాటకలో నిత్య అసంతృప్తికి కారణాలకు మూలాలను పార్టీ హైకమాండ్ గుర్తించాల్సి ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*