సీఎం సిద్ధ “రామ్” య్యే టార్గెట్‌ …!

క‌న్నడ‌ రాష్ట్రంలో ఎలాగైనా గెలవాల‌న్న ఒత్తిడిలో ఉన్న బీజేపీ ఆఖ‌రికి సీఎం సిద్ధరామ‌య్యపై విష ప్రచారానికి దిగిందా..? బెంగ‌ళూరులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యద‌ర్శి, ఆర్ఎస్ఎస్ నేత రామ్ మాధ‌వ్ అడుగుపెట్టిన త‌ర్వాత అనూహ్యంగా సోష‌ల్ మీడియాలో ఇంటెలిజెన్స్ పేర‌ వైర‌ల్ అవుతున్న నివేదికలో నిజ‌మెంత? రామ్ మాధ‌వ్ రావ‌డం రావ‌డంతోనే ఆర్ఎస్ఎస్ కార్యక‌ర్తల‌తో, ఆ త‌ర్వాత బీజేపీ కీల‌క‌నేత‌ల‌తో స‌మావేశ‌మైన ఫ‌లిత‌మే ఈ ఇంటెలిజెన్స్ నివేదిక‌నా..? ఇప్పుడు క‌న్నడ‌నాట అనేక ప్రశ్నలు ఉత్పన్నమ‌వుతున్నాయి.

ఎన్నికలు కొట్టిన పిండి…..

ప్రధాన‌మంత్రి న‌రేంద్రమోడీకి, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు రామ్ మాధ‌వ్ అత్యంత స‌న్నిహితుడు. ప‌లు రాష్ట్రాల్లో పార్టీ విజ‌యం సాధించ‌డంలో ఆయ‌న కీల‌క‌పాత్ర పోషించారు. మేజారిటీ రాకున్నా ప్రభుత్వాల‌ను ఎలా ఏర్పాటు చేయాలో ఆయ‌న‌కు తెలిసినంత‌గా మ‌రెవ‌రికీ తెలియ‌దని అంటుంటారు. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ జెండా ఎగ‌ర‌డంలో రామ్ మాధ‌వ్ ఎత్తులు, వ్యూహాలే చాలా వ‌ర‌కు కార‌ణం.

రామ్ మాధవ్ అడుగుపెట్టగానే….

ప్రస్తుతం క‌న్నడ‌ నాట క‌ష్టాల్లో ఉన్న బీజేపీని గ‌ట్టెక్కించ‌డానికి ఆయ‌న బెంగ‌ళూరులో అడుగుపెట్టారు. ఆయ‌న వ‌చ్చిన రెండు రోజుల్లోనే సిద్ధరామ‌య్యను టార్గెట్ చేస్తూ వ్యూహ ర‌చ‌న చేస్తున్నట్లు స‌మాచారం.ఈ క్రమంలోనే ఇంటెలిజెన్స్ వ‌ర్గాల పేర ఓ నివేదిక చ‌క్కర్లు కొట్టడం గ‌మ‌నార్హం. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే… చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పోటీ చేస్తే గెలవటం అసాధ్యమంటూ ఇంటెలిజెన్స్‌ విభాగం పేరుతోనున్న ఓ పత్రం వైరల్‌ కావడం సంచలనం రేపుతోంది. అయితే ఇది నకలీ నివేదిక అని ముఖ్యమంత్రి కార్యాలయం ఖండించింది.

దర్యాప్తుకు ఆదేశించిన సర్కార్….

దీనిపై దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్‌ డీఐజీకి సూచించినట్లు అధికార వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. కాగా, అలాంటి నివేదిక ఏదీ ఇంటెలిజెన్స్‌ వర్గాలు తమ కార్యాలయానికి ఇవ్వలేదని సీఎం కార్యాలయం అధికారులు తెలిపారు. తమ విభాగం కన్నడలో మాత్రమే ఇస్తుందని, అయితే నివేదిక ఆంగ్లంలో ఉన్నందున అది నకిలీదని నిఘా అధికారులు ఖండించారు. ఇక్కడే అంద‌రికీ బీజేపీ నేత‌ల‌పై అనుమానం క‌లుగుతోంది.

కన్నడలో కాకుండా ఆంగ్లంలో….

నివేదిక‌ను క‌న్నడ‌లో గాకుండా ఆగ్లంలో త‌యారు చేసి దొరికిపోయార‌నే ప్రచారం కూడా జ‌రుగుతోంది. అయితే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చాముండేశ్వరి (వరుణ), బసవకల్యాణ, గంగావతి, శివాజీనగర నియోజకవర్గాల్లో పోటీ చేస్తే ఏలా ఉంటుందనే విషయంపై ఇంటెలిజెన్స్‌ వర్గాల చేత గోప్యంగా సర్వే చేయించానీ… నాలుగు చోట్ల కూడా ఓడిపోతారంటూ నివేదిక శుక్రవారం రాత్రి నుండి సామాజిక మాధ్యమాలలో వైరల్‌ అవుతోంది. సిద్ధరామ‌య్యను టార్గెట్‌గా చేసుకుని ఎలా ప్రచారం చేయాల‌న్న పాఠాలు రామ్‌మాధ‌వ్ అక్కడ బీజేపీ నాయ‌కుల‌కు బాగా నూరిపోస్తున్నార‌ని… ఈ క్రమంలోనే ఇలాంటి విష ప్రచారం జ‌రుగుతోంద‌ని క‌న్నడ కాంగ్రెస్ నాయ‌కులు కొట్టి ప‌డేస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*