సిద్ధూను ఇక పంపించేస్తారా…??

sidharamaiah will goto national politics

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఒకసారి, తిరిగి తననే సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు నిత్యం చేస్తుంటారు. సిద్ధరామయ్యకు నేటికీ జనాదరణ ఉందనేది వాస్తవం. ఐదేళ్లు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా పనిచేసి ఆయన సమర్థత, నిబద్ధతను చూపుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ అధికారంలోకి రాకుండా నిలువరించడంలో సిద్ధరామయ్య పాత్ర కాదనలేం. ఆ ఎన్నికల్లో మోదీ వర్సెస్ సిద్ధరామయ్య గానే కన్నడ ప్రజలు భావించారు. అలాగే తీర్పు కూడా చెప్పారు.

సీఎం కావాలని…..

భారతీయ జనతా పార్టీ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించినప్పటికీ మ్యాజిక్ ఫిగర్ కు చేరుకోలేకపోవడంతో అధికారానికి దూరం కావాల్సి వచ్చింది. అలాగే అప్పటి వరకూ ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కూడా పెద్దగా సీట్లు లభించకపోవడంతో బీజేపీని నిలువరించడానికి తక్కువ స్థానాలు వచ్చినా జనతాదళ్ ఎస్ నేత కుమారస్వామి ముఖ్యమంత్రి కాగలిగారు. ముఖ్యమంత్రి పదవి తృటిలో తప్పిపోయిందని ఇప్పటికీ సిద్ధరామయ్య మధన పడుతూనే ఉన్నారు. ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నా ఓట్ల చీలికతో తాము నష్టపోయామని ఆయన వివరణ ఇచ్చుకుంటూనే ఉన్నారు.

ఉప ఎన్నికల్లో సయితం…..

అయితే కర్ణాటక ముఖ్యమంత్రిగా మరోసారి పనిచేయాలన్నది సిద్ధరామయ్య అభిమతంగా కన్పిస్తోంది. ఇటీవల జరిగిన ఐదు స్థానాల ఉప ఎన్నికల్లో నాలుగింటిలో కాంగ్రెస్, జేడీఎస్ గెలుచుకోవడంతో ఇదే ఫార్ములాతో వచ్చే లోక్ సభ ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. సిద్ధరామయ్యను కూడా ఈసారి లోక్ సభ ఎన్నికల్లో బరిలోకి దింపాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తుంది. ఉప ఎన్నికల్లో విజయంతో కాంగ్రెస్ హైకమాండ్ ఈసారి కూడా అభ్యర్థుల ఎంపిక, ప్రచారం మొత్తం సిద్ధరామయ్యకే అప్పగించనున్నారని చెబుతున్నారు.

కర్ణాటక రాజకీయాలకు…….

సిద్ధరామయ్యను కర్ణాటక రాజకీయాలకు దూరంగా ఉంచి జాతీయ రాజకీయాల్లోకి తీసుకురావాలన్నది ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆలోచనగా ఉంది. కర్ణాటకలో సంకీర్ణ సర్కార్ ఐదేళ్ల పాటు కొనసాగాలంటే సిద్ధూను జాతీయ రాజకీయాల్లోకి తీసుకురావాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే కుమారస్వామి, సిద్ధరామయ్యల మధ్య విభేదాలు తలెత్తడం కూడా ఇందుకు కారణమని చెప్పక తప్పదు. సిద్ధరామయ్యకే లోక్ సభ ఎన్నికల కీలక బాధ్యతలను అప్పగించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం ఆయనను కర్ణాటక రాజకీయాల నుంచి తప్పించడానికేనన్న చర్చ జోరుగా విన్పిస్తోంది. మరి సిద్ధరామయ్య ఆలోచన ఎలా ఉందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*