
కర్ణాటక రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ముఖ్యమంత్రి కుమారస్వామి వ్యాఖ్యలు, రిసార్ట్స్ రాజకీయాలతో కర్ణాటకలో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ పట్టుదలతో ఉన్నట్లే కన్పిస్తుంది. నిన్న మొన్నటి వరకూ ప్రభుత్వం తనంతట తాను కూలిపోతే రంగంలోకి దిగాలని భావించిన కమలనాధులు కుమారస్వామి వ్యాఖ్యలతో ఇక స్ట్రయిట్ ఫైట్ కు దిగాలని నిర్ణయించుకున్నట్ల కనపడుతోంది. ఇప్పటికే రిసార్ట్స్ బాట పట్టిన కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బుజ్జగించే కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రారంభించింది.
ఇక లాభం లేదంటున్న……
కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ ఇక నేరుగా ఆపరేషన్ ను ప్రారంభించాలని భావిస్తోంది. నిన్న మొన్నటి వరకూ తటపటాయించిన కమలనాధులు కుమారస్వామి వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. ప్రభుత్వాన్ని కూల్చేసేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీపై తిరగబడండని కుమారస్వామి పిలుపునివ్వడం, యడ్యూరప్ప నివాసం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేయడాన్ని కమలం పార్టీ సీరియస్ గా తీసుకుంది. ఒకవైపు దీనిపై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తూనే మరోవైపు రిసార్ట్స్ లో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో బేరసారాలు ప్రారంభించినట్లు వార్తలు గుప్పుమంటున్నాయి.
విస్తరణ జరిపితే……
మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా అప్రమత్తమయింది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జి వేణుగోపాల్ లు చర్చించారు. ఎమ్మెల్యేల్లో ఉన్న అసమ్మతికి గల కారణాలను విశ్లేషించారు. మంత్రివర్గ విస్తరణ జరిపితే అంతా సర్దుకుంటుందని సిద్ధరామయ్య చెబుతున్నారు. అయితే మంత్రి వర్గ విస్తరణ జరిపితే మరో రూపంలో అసమ్మతి రాదన్న గ్యారంటీ ఏంటన్నది కాంగ్రెస్ హైకమాండ్ ప్రశ్న. దీనికి కర్ణాటక కాంగ్రెస్ నేతల వద్ద సమాధానం లేదు. ఆరుగురికి మాత్రమే మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశముంది.
ఆరుగురికే ఛాన్స్…….
కర్ణాటక కాంగ్రెస్ లో దాదాపు 20 మంది వరకూ అసమ్మతి ఎమ్మెల్యేలున్నట్లు అంచనా. అయితే వీరిలో కేవలం ఆరుగురికి మాత్రమే మంత్రి పదవులు దక్కుతాయి. మిగిలిన వారికి కేబినెట్ హోదా కలిగిన పదవి ఇవ్వాలన్నది సిద్ధరామయ్య, వేణుగోపాల్ సూచన. దీనిపై కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించారు. అయితే మంత్రి వర్గ విస్తరణ పై ఎలాంటి సంకేతాలు హైకమాండ్ నుంచి అందలేదు. బీజేపీ ఆపరేషన్ కమలకు విరుగుడుగా తాము కూడా ఆపరేషన్ ను ప్రారంభించాలని నిర్ణయించారు. బీజేపీలోని అసమ్మతి ఎమ్మెల్యేలకు ఎరవేయాలని నిర్ణయించారు. ఇలా కర్ణాటకలో స్ట్రయిల్ ఫైట్ ప్రారంభమయిందనే చెప్పొచ్చు. మరి ఇది ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో వేచి చూడాల్సిందే.
Leave a Reply