కాంగ్రెస్ గెలిచినా.. సిద్దూ డౌటే..!

క‌ర్ణాట‌క ఎన్నిలకు కేవ‌లం రెండు రోజులు గురు, శుక్రవారాలు మాత్రమే స‌మ‌యం ఉంది. శ‌నివారం ఉద‌యం 7 గంట‌ల నుంచి ఒకే విడ‌త‌లో ఇక్కడ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఎన్నిక‌ల‌ను బీజేపీ, కాంగ్రెస్‌లు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకు న్నాయి. ఏ పార్టీకి ఆ పార్టీ ఇక్కడ గెలుపు గుర్రం ఎక్కేందుకు ప‌క్కాగా ముందుకు సాగుతున్నాయి. ప్రస్తుత అధికార పార్టీ కాంగ్రెస్‌, విప‌క్షం బీజేపీల‌లో ఏదో ఒక‌టి వ‌స్తుంద‌ని అనేవారు కొంద‌రైతే.. ఏ పార్టీ రాద‌ని ఇక్క‌డ హంగ్ త‌థ్యమ‌ని చెప్పేవారూ ఉన్నారు. ఇదిలావుంటే, కాంగ్రెస్‌కే అనుకూల ఫ‌లితాలు వ‌చ్చే ఛాన్స్ ఉంద‌ని కూడా తెలుస్తోంది. అయితే, సీఎం సిద్దరామ‌య్య గెలుపు ఎలా ఉంటుంది ? అనే ప్రశ్నలు ఉద‌యిస్తున్నాయి.

రెండు నియోజకవర్గాల్లోనూ….

ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో ఉన్న ప‌రిస్థితిని బ‌ట్టి.. ఆయ‌న గెలుపు అంత ఈజీ కాద‌ని అనేవారు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నారు. వాస్తవానికి ఎన్నిక‌ల మూమెంట్‌లో ఆయ‌న వేసిన అడుగులు కూడా అలానే ఉన్నాయి. సిద్దూ పోటీ చేస్తున్న పోటీ చేస్తున్న చాముండేశ్వరి, బాదామి నియోజకవర్గాలలో ఆయన ఏటికి ఎదురీదాల్సిన పరిస్థితులున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. మాజీ ప్రధాని దేవెగౌడ‌, మాజీ సీఎం కుమార స్వామి నేతృత్వంలోని జేడీఎస్‌ కంచుకోట అయిన చాముండేశ్వరిలో బలంగా ఉన్న వక్కలిగ వర్గం నుంచి సిద్దూ ఎదురీదుతున్నారు.

అంత సులువు కాదు….

సిద్ధూ గ‌తంలో గెలిచిన చాముండేశ్వరిలో ఆయ‌న విజయం నల్లేరుపై నడకేం కాదని నిఘావర్గాలు నివేదించడంతో ఆయ‌న హుటాహుటిన బాగ‌ల్‌కోట్ జిల్లాలోని బాదామి నుంచి కూడా బరిలోకి దిగారు. బీజేపీ వ్యూహాత్మకంగా అక్కడ నాయ‌క్ వ‌ర్గానికి చెందిన మంచి ప‌లుకుబ‌డి ఉన్న శ్రీరాములును బరిలోకి దించడంతో సిద్దూకు రెండు చోట్లా తీవ్ర పోటీ నెల‌కొంది. అంతేకాదు, దాదాపు వ్యతిరేక పవనాలను ఎదుర్కొంటున్నారని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ఇక్కడ జేడీఎస్ కు బీజేపీ…..

చాముండేశ్వరి నియోజకవర్గంలో 2.5 లక్షల ఓట్లు ఉండగా.. 70 వేల మంది వక్కలిగలు ఉన్నారు. జేడీఎస్‌ సిటింగ్‌ ఎమ్మెల్యే జీటీ దేవెగౌడకు వక్కలిగలు ఏకపక్షంగా మద్దతు పలుకుతున్నారు. ఇక బీజేపీ కూడా.. పరోక్షంగా జేడీఎస్ కు మద్దతిచ్చేలా బలహీన అభ్యర్థిని బరిలోకి దింపింది. అటు బాదామిలోనూ బీజేపీ బలపడుతుండడం సిద్దూకు మింగుడు పడని విషయంగా మారింది. బీజేపీ అభ్యర్థి శ్రీరాములు.. నాయక్‌ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లను ఆకట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు.

రాజకీయ సన్యాసం చేస్తానని…

ముఖ్యమంత్రిగా ఉన్న సిద్ధుకు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో మంచి అనుకూల ప‌వ‌నాలు వీస్తున్నాయి. స‌హ‌జంగానే బెంగ‌ళూరు సిటీలో బీజేపీకి కాస్త ఎడ్జ్ ఉంటుంద‌ని అంటున్నారు. అయితే సీఎంగా ఉండి సిద్ధూ పోటీ చేస్తోన్న ఈ రెండు నియోజకవర్గాల్లో గట్టి పోటీ ఉండడంతో.. ఈ ఎన్నికలు సిద్దూకు చావోరేవో అన్నట్లు మారాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఎన్నికల్లో విజయం సాధించకుంటే రాజకీయ సన్యాసం చేస్తాననే ప్రకటన చేశారు సిద్దరామయ్య. ఈ తరహా ప్రకటనలతో ఆయ‌న ప్రత్యర్థులు ఆయ‌న్ను ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఓడించాల‌ని మ‌రింత‌గా కాన్‌సంట్రేష‌న్ చేస్తున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో తెలియాలంటే ఈ నెల 15 వర‌కు వెయిట్ చేయాల్సిందే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*