నన్ను టచ్ చేస్తే అంతే….!

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సొంత పార్టీ ప్రత్యర్థులపై కసి తీర్చుకోవడానికి సిద్ధమయినట్లుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో తలెత్తిన అసమ్మతిని తొలగించేందుకు సిద్ధరామయ్య నడుంబిగించారు. అసమ్మతి నేతలకు లీడర్లుగా వ్యవహరించే జార్ఖిహోళి సోదరులు సిద్ధరామయ్యకు అత్యంత సన్నిహితులే. గత పక్షం రోజుల నుంచి వారు సంకీర్ణ ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తున్నారు. దాదాపు 15 మంది ఎమ్మెల్యేలతో క్యాంపు రాజకీయాలకు సిద్ధమయ్యారు. ఈ తరుణంలో సిద్ధరామయ్య రంగప్రవేశం చేర్చి వారి అసంతృప్తిని చల్లార్చేందుకు ప్రయత్నాలు చేశారు. ఈ ప్రయత్నాలు కొంత వరకూ ఫలప్రదమయ్యాయి.

పరమేశ్వర్ కు చెక్ పెట్టేందుకే…..

అయితే గతంలో పీసీీసీ చీఫ్ గా వ్యవహరించి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పరమేశ్వర్ ను సిద్ధూ టార్గెట్ చేసినట్లు కన్పిస్తోంది. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడ్డాక ఉపముఖ్యమంత్రి పరమేశ్వర్, మంత్రి డీకే శివకుమార్ లు ముఖ్యమంత్రి కుమారస్వామి వర్గంలో చేరిపోయారు. సిద్ధూ సూచనలు పరిగణనలోకి తీసుకోకపోవడం, అధికారుల బదిలీల విషయంలో సిద్ధరామయ్య చేసిన అభ్యంతరాలను కుమారస్వామితో పాటు పరమేశ్వర్ , డీకే శివకుమార్ లు పరిగణనలోకి తీసుకోలేదు. దీనిపై సిద్దరామయ్య మనస్తాపానికి గురయ్యారు.

బెళగావి బ్రదర్స్ డిమాండ్స్ వింటే…..

అయితే రమేష్ జార్ఖిహోళి, సతీష్ జార్ఖిహోళి సోదరులు అసమ్మతి నేతలతో జట్టుకట్టి పీక్ స్టేజీకి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు. దీంతో సిద్ధరామయ్య ఎంటర్ అయి వారికి నచ్చ జెప్పే ప్రయత్నం చేశారు. అయితే అసమ్మతి పెరుగుతున్న నేపథ్యంలో బెళగావి బ్రదర్స్ తో ముఖ్యమంత్రి కుమారస్వామి భేటీ అయ్యారు. అయితే కుమారస్వామికి వీరు పెట్టిన డిమాండ్లు చూసి మతిపోయింది. తమ సోదరుల్లో ఒకరికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని, డీకే శివకుమార్ బెళగావి రాజకీయాల్లో జోక్యం ఉండకూడదని, బెళగావి ప్రాంతం నుంచి తమ వర్గంలోని వారికి మంత్రి పదవి ఇవ్వాలన్నది వారి ప్రధాన డిమాండ్లు. అయితే ఇవి కుమారస్వామి చేతుల్లో లేవు. కాంగ్రెస్ అధిష్టానం తీసుకోవాల్సిన నిర్ణయాలు.

సిద్ధూ వారి వెనక….?

ఉపముఖ్యమంత్రి పరమేశ్వర్ కు చెక్ పెట్టడానికే సిద్ధరామయ్య వారిచేత ఈ డిమాండ్లు పెట్టించారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. కుమారస్వామి ఈ డిమాండ్ల పై వారికి ఎటువంటి హమీ ఇవ్వకపోయినప్పటికీ, ఈ విషయాలను పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళతామని చెప్పారు. అంతేకాదు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ఉప ఎన్నికల్లో తట్టుకోవడం కష్టమంటూ బ్రెయిన్ వాష్ చేశారు. జార్ఖిహోళి బ్రదర్స్ డిమాండ్ వెనక సిద్ధరామయ్య ఉన్నారని పరమేశ్వర్ వర్గం అనుమానిస్తోంది. మొత్తం మీద సిద్ధరామయ్య సంకీర్ణ ప్రభుత్వంలో కింగ్ గా మారేందుకు ప్రయత్నిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*