గెలిచినా…ఓడినా…సిద్ధూయే హీరో…!

కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా, ఓడినా సిద్ధరామయ్యే హీరో అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఎన్నికల ప్రచారం మొత్తం సిద్ధరామయ్య వర్సెస్ మోడీగానే సాగింది. సిద్ధరామయ్యకు కర్ణాటకలో మంచి పేరుంది. ఎటువంటి అవినీతి ఆరోపణలు ఆయన ఎదుర్కొనలేదు. అంతేకాకుండా సంక్షేమ కార్యక్రమాలపైనే ఆయన ఎక్కువగాదృష్టి పెట్టారు. గత రెండు సంవత్సరాల నుంచి కర్ణాటకలో సిద్ధరామయ్య తీసుకున్న నిర్ణయాలు తమను గెలుపు బాట పట్టిస్తాయని కాంగ్రెస్ నేతలు విశ్వసిస్తున్నారు.సిద్ధరామయ్య ఒక్కరే ఒంటిచేత్తో కమలదళాన్ని ఎదుర్కొన్నారు.

వైఎస్ గుర్తుకు వస్తారు….

సిద్ధరామయ్యను చూస్తే ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గుర్తుకురాక మానరు. వైఎస్ తొలి నుంచి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ చివరకు ముఖ్యమంత్రి అయ్యారు. అయితే సిద్ధరామయ్య మాత్రం జనతాదళ్ ఎస్ నుంచి వచ్చి ముఖ్యమంత్రి కాగలిగారు. ఇదొక్కటే వీరిద్దరి మధ్య తేడా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి అయ్యాక వెనుదిరిగి చూడలేదు. పార్టీలో తన ప్రత్యర్థులను సమర్థవంతంగా అణిచివేయగలిగారు. టెన్ జన్ పథ్ లో గ్రిప్ సంపాదించుకోగలిగారు. ప్రత్యర్థి పార్టీలను కూడా వైఎస్ ముప్పుతిప్పలు పెట్టారు. రైతులకు ఉచిత విద్యుత్తు, ఫీజు రీఎంబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీ వంటి వాటితో వైఎస్ ప్రజాభిమానం పొందగలిగారు. అందుకే రెండోసారి కూడా కాంగ్రెస్ ను ఒంటిచేత్తో అధికారంలోకి తేగలిగారు.

ప్రత్యర్థులకు ముకుతాడు వేసి….

వైఎస్ తరహాలోనే సిద్ధరామయ్య కూడా పార్టీలో ప్రత్యర్థులకు తొలినాళ్లలోనే ముకుతాడు వేయగలిగారు. తాను తీసుకున్న నిర్ణయాన్ని ఎవరూ తప్పుపట్టని విధంగా ఉండేలా చూసుకునే వారు. అలాగే తనపై హైకమాండ్ కు ఫిర్యాదు చేసే వారిపై కూడా ఒక కన్నేసి ఎప్పటికప్పుడు అసలు విషయాన్ని టెన్ జన్ పథ్ కు చేర్చగలిగేవారు. ఈ పరిస్థితుల కారణంగానే కాంగ్రెస్ హయాంలో ఏ ముఖ్యమంత్రికీ దక్కని అవకాశం సిద్ధరామయ్యకు దక్కింది. ఐదేళ్లు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగాడంటే ఆయన అన్ని రకాలుగా ఇటు హైకమాండ్ ను, ఇటు సొంత పార్టీలో నేతలను తనకు అనుకూలంగా మలచుకున్నట్లేనని చెప్పకతప్పదు. వైఎస్ కూడా ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కొనసాగారు.

మోడీ వర్సెస్ సిద్ధరామయ్యగా మార్చి….

ఇక కర్ణాటక ఎన్నికల ప్రచారానికి వస్తే గుజరాత్ తరహాలో ప్రచారం నిర్వహించాలన్నది కమలనాధుల వ్యూహం. గుజరాత్ లో మోడీ వర్సెస్ రాహుల్ గా ఎన్నికలను అక్కడి బీజేపీ నడిపించింది. మోడీతో పోల్చుకుంటే రాహుల్ అన్నింటిలోనూ తక్కువే కావడంతో కొంత కమలానికి కలిసి వచ్చింది. అందుకే కర్ణాటకలోనూ గుజరాత్ తరహా వ్యూహాన్ని అమలుపరుద్దామని కమలం పార్టీ భావించింది. అందుకే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీలు తమ ప్రచారంలో ఎక్కువగా రాహుల్ పై గురిపెట్టారు. కాని సిద్ధరామయ్య దాన్ని పూర్తిగా తిప్పికొట్టారు. ఎప్పటికప్పుడు ట్వీట్లు చేస్తూ మోడీకి, తనకే యుద్ధమన్న వాతావరణాన్ని సృష్టించడంలో సిద్ధరామయ్య సక్సెస్ అయ్యారంటున్నారు. నిజానికి ఇక్కడ ఎన్నికలు సిద్ధరామయ్య వర్సెస్ యడ్యూరప్పలా జరగలేదు. సిద్ధరామయ్య, మోడీకి మధ్య మాత్రమే జరిగాయని, అయితే ఈ ఎన్నికల్లో సిద్ధరామయ్య గెలిచినా, ఓడినా ఆయన హీరోయేనన్నది కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ కర్ణాటకకు కైవసం చేసుకుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*