సీనియర్లకు….సారీతో సరిపెట్టేస్తారా?

సాధారణంగా ఎక్కడైనా పార్టీ అధిష్టానానికి వీర విధేయులుగా ఉండి, పార్టీ క్రమశిక్షణను పాటిస్తూ సీనియర్ నేతలయిన వారికే మంత్రివర్గంలో చోటు లభిస్తుంది. ఏ రాష్ట్రంలోనైనా, ఏ పార్టీలోనైనా ఇవే ప్రాధాన్యతలుగా గుర్తించి హైకమాండ్ వారిని కేబెనెట్ లోకి తీసుకుంటుంది. కాని కర్ణాటక కాంగ్రెస్ లో ఇప్పుడు వింత పరిస్థితి నెలకొంది.విధేయతను పక్కన పెట్టేయండి…. జారిపోకుండా చూడటమే….క్రైటీరియా. అసంతృప్తితో ఏ ఒక్కరూ పార్టీ నుంచి వెళ్లిపోకూడదు. జారి పోతారనుకున్న వారికే పదవులు ఇవ్వండి. విధేయులు ఎటూ పార్టీని విడిచి వెళ్లరు. కర్ణాటక కాంగ్రెస్ నేతలు ఇప్పుడు అవలంబిస్తున్న తీరు ముక్కున వేలేసుకునేలా చేస్తుంది.

వారం రోజుల్లోనే……

ఈనెల రెండో వారంలో మంత్రి వర్గ విస్తరణ జరగుతుందన్న ఊహాగానాలు విన్పిస్తున్నాయి. ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా ఈ నెల 10న లేదా 12వ తేదీన మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని చెప్పారు. దీంతో ఆశావహులందరూ కొందరు హస్తినకు క్యూకట్టగా వారి అనుచరగణం మాత్రం కర్ణాటక అగ్రనేతల ఇళ్ల ముందు బలప్రదర్శనలకు దిగుతోంది. ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పీసీసీ చీఫ్ దినేశ్ గుండూరావు, ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర్ లను కలసి తమ నేతకు ఈసారి మంత్రివర్గంలో చోటు కల్పించాలని కోరుతున్నారు.

వారికే వదిలేసిన……

కాని కాంగ్రెస్ అధిష్టానం మాత్రం మంత్రి వర్గ విస్తరణ తర్వాత ఎలాంటి అసంతృప్తులు లేకుండా చూడాల్సిన బాధ్యతను రాష్ట్ర కాంగ్రెస్ నేతలకే వదిలిపెట్టింది. కర్ణాటక నుంచి వచ్చిన జాబితానే తాము ఖరారు చేస్తామని, ఆ తర్వాత జరిగే పరిణామాలకు కూడా మీరే బాధ్యత వహించాలంటూ సిద్ధరామయ్య, పరమేశ్వర్, గుండూరావులపైనే పెట్టింది. దీంతో వారు కసరత్తుల ప్రారంభించారు. విధేయులుగా ఉన్న వాళ్లు తమ సీనియారిటీని చూసైనా పదవులు వాటంతట అవే వస్తాయని అనుకుంటుండగా పరిస్థితి అందుకు భిన్నంగా కన్పిస్తోంది. మంత్రి పదవి ఇవ్వకుంటే జెండా పీకేస్తామన్న వారికే ఈ విస్తరణలో ఎక్కువ అవకాశాలున్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది.

రాహుల్ తో సీనియర్లకు……

దీంతో సిద్ధరామయ్య ఢిల్లీ లో ఉండి పెద్దలతో మంతనాలు జరుపుతున్నారు. సీనియర్లను హైకమాండ్ మాత్రమే పిలిచి బుజ్జగిస్తే బాగుంటుందని ఆయన పార్టీ పెద్దలకు సూచిస్తున్నారు. రామలింగారెడ్డి, హెచ్.కె. పాటిల్, కృష్టప్పలు సీనియర్ నేతలే కాకుండా పార్టీకి వీరవిధేయులు. వీరిని మంత్రివర్గంలోకి తీసుకోకపోయినా పెద్దగా ప్రమాదముండదని, వారు పార్టీని వీడరని భావిస్తున్నారు. అందుకోసం వీరితో నేరుగా రాహుల్ గాంధీ మాట్లాడితే బాగుంటుందని సూచిస్తున్నారు. దీంతో పాటు మొత్తం ఆరు మంత్రి పదవులను భర్తీ చేయాల్సి ఉండగా కేవలం నాలుగు మాత్రమే ఈ విడత భర్తీ చేయాలని, మిగిలిన రెండింటిని అసంతృప్తుల కోసం అట్టిపెట్టి ఉంచాలన్న వ్యూహంలో అధిష్టానం ఉంది. సంకీర్ణ సర్కార్ ఉన్నందునే విధేయులకు ఈసారి చోటుకల్పించలేకపోతున్నారని, అసమ్మతి వాదులకే ప్రాధాన్యత ఇవ్వనున్నారని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*