లెఫ్ట్ నో అనేసింది…మోడీకి ఇక రైట్ రైట్…!

బీజేపీకి వ్యతిరేకంగా కూటమిని ఏర్పాటు చేద్దామనుకున్న కాంగ్రెస్ పార్టీకి ఆదిలోనే చుక్కెదురయింది. సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి వ్యాఖ్యలతో ఐక్యతకు గండి పడిందనే చెప్పాలి. కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీకి వ్యతిరేకంగా 2019 ఎన్నికల్లో కూటమి ఏర్పాటువుతుందని భావించారు. ఒకవైపు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడులిద్దరూ బీజేపీకి ప్రత్యామ్నాయంగా బలమైన కూటమిని ఏర్పాటు చేయాలని భావించారు. ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఏకంగా చేసి 2019 ఎన్నికల్లో మోడీని ఒంటరి చేయాలని భావించారు.

ససేమిరా అంటున్న సీపీఎం…..

కాని సీపీఎం మాత్రం ఇందుకు ససేమిరా అంటోంది. 2019 ఎన్నికల తర్వాతనే కూటమిని గురించి ఆలోచిస్తామని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫెడరల్ ఫ్రంట్ పై ఎన్నికల అనంతరమే చర్చలు ఉంటాయని చెప్పారు. దీన్ని బట్టి వచ్చే ఎన్నికలలో మోడీ పార్టీని కూటమి ఎదుర్కొనడం లేదని అర్థమైపోయింది. బీజేపీ ని వచ్చే ఎన్నికలలో అందరం కలసి ఐక్యంగా చిత్తుగా ఓడించాలన్న కాంగ్రెస్ ఆశలపై ఏచూరి నీళ్లు చల్లారు. తాము మతతత్వ పార్టీ బీజేపీకి వ్యతిరేకమేనని చెబుతూ అదే సమయంలో బెంగాల్ లో మమత బెనర్జీ ఆధిపత్యాన్ని అంగీకరించబోమని కూడా చెప్పారు.

ఎన్నికల తర్వాతనే…..

ఎన్నికల తర్వాత వచ్చిన ఫలితాలను బట్టి అప్పుడు నిర్ణయం తీసుకుంటామన్నారు సీతారాం ఏచూరి. రెండు రోజులక్రితం కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణస్వీకారానికి హాజరైన నేతలందరూ చేతులు కలిపి ఐక్యతను ప్రదర్శించారు. సీతారాం ఏచూరి, మమత బెనర్జీ కూడా ఒకే వేదికను పంచుకున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి మాయావతి, అఖిలేష్ యాదవ్, చంద్రబాబునాయుడు, తేజస్వీయాదవ్, శరద్ పవార్, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ తదితరులు హాజరుకావడంతో ఎన్నికలకు ముందే బలమైన కూటమి బీజేపీకి వ్యతిరేకంగా ఏర్పడుతుందని భావించారు.

మమత వల్లనేనా?

కాని అది సాధ్యం కాదని తేలిపోయింది. వివిధ రాష్ట్రాల్లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులు కారణంగానే సీపీఎం ఈ నిర్ణయం తీసుకుంది. కేరళలో తమకు ప్రధాన పోటీ కాంగ్రెస్ కావడంత, బెంగాల్ లో మమత బెనర్జీ ప్రధాన శత్రువు కావడంతో ఎన్నికలకు ముందు పొత్తు అవసరం లేదన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. అవయితే రాష్ట్రాల్లో మాత్రం లౌకిక శక్తులతో కలసి మతతత్వ బీజేపీని ఓడించేందుకు కృషి చేస్తామని సీపీఎం చెబుతోంది. మొత్తం మీద కర్ణాటక వేదికగా జాతీయ రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకుంటాయని భావిస్తే, దానికి సీతారాం ఏచూరి ఆదిలోనే గండికొట్టినట్లయింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*