శివాజీ న‌గ‌ర్‌లో బిగ్ ఫైట్

శివాజీన‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గం. క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరుకు ఈ నియోజ‌క‌వ‌ర్గం అత్యంత కీల‌కం. ఇక్క‌డ గెలిస్తే.. రాజ‌ధానిపై ప‌ట్టు సాధించ‌వ‌చ్చ‌నే ధీమాతో ఉంటారు నాయ‌కులు. అందుకే ఇక్క‌డ పోటీ చేసేందుకు ప్ర‌ధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌, ప్రాంతీయ పార్టీ జేడీఎస్‌లు కీల‌క‌మైన వారికి మాత్ర‌మే టికెట్లు ఇస్తుంటాయి. ఇక‌, గ‌త ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి గెలుపొందిన కాంగ్రెస్ అభ్య‌ర్థి రోష‌న్ బేగ్ అప్ప‌ట్లో సిద్దూ కేబినెట్లో రాష్ట్ర మునిసిప‌ల్ శాఖ మంత్రిగా ఉన్నారు. ప్ర‌జ‌ల్లో మంచి పేరు సాధించిన ఆయ‌న‌కే మ‌ళ్లీ కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. ఇక‌, బీజేపీ కూడా గ‌ట్టి నాయ‌కుడిని రంగంలోకి దింపింది. మాజీ మంత్రి క‌ట్టా సుబ్ర‌మ‌ణ్య నాయుడును ఇక్క‌డ నుంచి బీజేపీ బ‌రిలోకి దింపింది.

ఇద్దరూ ఇక్కడివారే….

గ‌తంలో వీరిద్ద‌రు ఈ నియోజ‌క‌వ‌ర్గానికి ప్రాథినిత్యం వ‌హించిన వారే కావ‌డం విశేషం. నియోజ‌క‌వ‌ర్గంలో అణువ‌ణువు వీరికి తెలుసు. ఒక‌రు ప్ర‌స్తుత మంత్రి, మ‌రొక‌రు మాజీ మంత్రి కావ‌డంతో పోరు హోరాహోరీగా సాగడం ప‌క్కా. విధాన‌సౌధ‌, ముఖ్య‌మంత్రి నివాస కార్యాల‌యం, ప్ర‌భుత్వ కార్యాలాయాల‌న్ని ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఉండ‌డంతో ఓ విధంగా చెప్పాలంటే క‌ర్ణాట‌క స్టేట్ పాల‌న అంతా ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచే కొన‌సాగుతుంది. ఇక్క‌డ మొత్తం 14 మంది అభ్య‌ర్థులు బ‌రిలో ఉన్నారు. వీరిలో కొంద‌రు స్వ‌తంత్రులు కూడా పోటీ చేస్తున్నారు. అయితే, వీరంద‌రిలోకీ ప్ర‌స్తుత మంత్రి, మాజీ మంత్రుల మ‌ధ్యే కీల‌క పోరు సాగ‌నుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ప్రచారంలోనూ ఇద్దరూ….

ఈ ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న ఇద్ద‌రు నాయ‌కులు త‌మ త‌మ వ్యూహాల‌ను అమ‌లు చేస్తున్నారు. బేగ్ ఇప్పుడు ఈ నియోజ‌క‌వ‌ర్గానికి ప్రాతినిధ్యం వ‌హిస్తుందడ‌డంతో ఆయ‌న బీజేపీ అభ్య‌ర్థి క‌న్నా ముందంజ‌లో ప్ర‌చారం చేస్తున్నాడు. ఈ నియోజ‌క‌వర్గంలోని ఆరు వార్డుల్లో హిందూ ఓట్లు ఎక్కువ‌గా ఉన్నాయి. ఇది బీజేపీ అభ్య‌ర్థికి క‌లిసిరానుంది. ఇక‌, దీనికితోడు విధాన స‌భ‌కు కూత వేటు దూరంలో.. ఈ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలోకి వ‌చ్చే .. ఎంఆర్ ఎస్ పాళ్య మురికి వాడలో ఏపీ నుంచి వ‌ల‌స వ‌చ్చిన వెయ్యి తెలుగు కుటుంబాలు ఉన్నాయి. సుమారు వీరివి 5 వేల ఓట్లు దాకా ఉంటాయ‌ని అంటున్నారు. దీంతో ఇక్క‌డ వీరి ఓట్ల‌ను త‌మ ఖాతాల్లో వేసుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్‌లు పోటా పోటీగా ముందుకు సాగుతున్నాయి.

ఎవరు గెలిచినా….

ఇక‌, ఇప్పుడు అభ్య‌ర్థులు త‌మ త‌మ సామాజిక వ‌ర్గాల‌ను కూడా ఆస‌రా చేసుకుంటూ.. ప్ర‌చారం సాగిస్తున్నారు. అదే స‌మ‌యంలో కొన్ని ప్రాంతాలు ఇప్ప‌టికీ మురికి వాడ‌లుగానే ఉండ‌డంపై ప్ర‌త్య‌ర్థి అక్క‌డి ప్ర‌జ‌ల‌ను త‌న వైపు తిప్పుకొనేందుకు ప్ర‌య‌త్నిస్తుండ‌గా.. తాము నిధులు మంజూరు చేశామ‌ని, అధికారులు, కాంట్రాక్ట‌ర్ల నిర్వాకం వ‌ల్లే ప‌నులు స‌క్ర‌మంగా జ‌ర‌గ‌డం లేద‌ని, ఈ సారి గెలిపిస్తే.. మ‌ళ్లీ సేవ చేస్తాన‌ని బేగ్ చెబుతున్నారు. మ‌రోప‌క్క ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త‌ను త‌న‌కు అనుకూలంగా బీజేపీ అభ్య‌ర్థి తిప్పుకొంటున్నారు. దీంతో ఇరు ప‌క్షాల మ‌థ్య పోటీ ర‌సవ‌త్త‌రంగా సాగుతోంది. దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ ఇద్ద‌రు అభ్య‌ర్థుల్లో ఎవ‌రు గెలిచినా మెజారిటీ మాత్రం నామ‌మాత్రంగానే ఉంటుంద‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*