చౌహాన్ చివరి ప్రయత్నాలు….!!!

సొంత ఇమేజ్ తోనే గెలవాలన్నది ఆయన ప్రయత్నం… తాపత్రయం.. కాని పరిస్థితులు అనుకూలంగా లేవు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలు కూడా ఆయనకు ప్రతిబంధకంగా మారాయి. లేకుంటే నాలుగోసారి సిఎం అయ్యేందుకు రెడీగా ఉండేవారు. ఆయనే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. దాదాపు పదిహేనేళ్లు నుంచి ముఖ్యమంత్రిగా ఉన్న చౌహాన్ నాలుగోసారి సీఎం కుర్చీ ఎక్కేందుకు చేస్తున్న కసరత్తులు ఏ మేరకు ఫలిస్తాయన్నది అనుమానమే.

దూరమైన వర్గాలను…..

ప్రధానంగా ఇన్నాళ్లూ తనకు అనుకూలంగా ఉన్న వర్గాలు దూరమయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే ఇందుకు కారణం. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ చట్ట సవరణలతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇక్కడ అగ్రవర్ణాలను, ఓబీసీలను పార్టీకి దూరం చేస్తుందేమోనన్న అనుమానం బయలుదేరింది. వీరి బలం మధ్యప్రదేశ్ లో మామాలుగా లేదు. అగ్రవర్ణాలు 15 శాతం ఉండగా, ఓబీసీలు 37 శాతం మంది ఉన్నారు. ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన ప్రాధాన్యత కమలం పార్టీ తమకు ఇవ్వడం లేదన్న ఆగ్రహంతో వీరంతా ఉన్నట్లు శివరాజ్ సింగ్ చౌహాన్ పసిగట్టారు.

వీరిని ఎలాగైనా…..

అందుకే వీరిని మంచి చేసుకునేందుకు చౌహాన్ విపరీతంగా శ్రమిస్తున్నారు. అంతా తానే అయి ప్రచారం నిర్వహించుకుంటున్నారు. కాంగ్రెస్ బలం పుంజుకుందని తన ఇంటలిజెన్స్ సర్వేలోనే వెల్లడవ్వడంతో ఆయన వీరిని మచ్చిక చేసుకునేందుకు వివిధ ప్రయత్నాలు చేస్తున్నారు. తాను రైతు కుటుంబం నుంచి వచ్చానని, వారిలాగా (కాంగ్రెస్) రాజకుటుంబం నుంచి రాలేదని, ప్రజలు సమస్యలు తనకు తెలిసినంతగా వారికి తెలియని చౌహాన్ తన ప్రచారంలో ప్రధానంగా చెప్పుకొస్తున్నారు. చివరి నిమిషంలోనైనా అగ్రవర్ణాలు, ఓబీసీలు తనకు బాసటగా నిలుస్తారన్న నమ్మకంతో చౌహాన్ ఉన్నారు.

రైతులు కూడా…..

మరోవైపు రైతులు కూడా చౌహాన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. చౌహాన్ హయాంలోనే రైతులపై కాల్పులు జరిగాయి. ఈ సంఘటన మాత్రమే కాకుండా రైతుల ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కూడా లేకుండా పోయాయి. దీనికి తోడు కాంగ్రెస్ పార్టీ రుణమాఫీని ప్రకటించడం కూడా చౌహాన్ ను ఆందోళనకు గురిచేస్తుంది. రైతు వర్గం దూరమైతే తనకు అధికారం దూరమవుతుందని ఆయన భయపడిపోయి రైతులను కూడా ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. మొత్తం మీద చౌహాన్ కష్టకాలంలోనూ విజయం తనదేనన్న ధీమాతో చివరి ప్రయత్నాలు చేస్తున్నారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*