అదే…అదే…మేము కోరుకుంటున్నదీ…!

మహారాష్ట్రలో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని శివసేన ఎప్పుడో ప్రకటించింది. ఆ మేరకు కట్టుబడి ఉంటామని కూడా తెలిపింది. దీంతో కమలనాధులు కొంత కంగారు పడిన మాట వాస్తవమే. శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే ఇంటికి వెళ్లి మరీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా మంతనాలు జరిపినా ఫలితం లేకుండా పోయింది. పైగా ప్రధాని నరేంద్రమోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షాలపై మాటల దాడిని శివసేన ప్రారంభించింది. ఇద్దరి వల్ల పార్టీ దిగజారిపోతుందని కూడా తన అధికార పత్రిక సామ్నాలో అనేక సార్లు వ్యాఖ్యానించింది.

శివసేనతో కలసి నడవాలని……

మోదీని తిట్టినందుకు కాదు గాని రాహుల్ ను పొగిడినందుకు అన్నట్లుగా బీజేపీ ఇక శివసేనతో కలసి నడిచేందుకు ఇష్టపడటం లేదు. రాహుల్ పై శివసేన పార్టీ అగ్రనేతలు ఇటీవల కాలంలో ప్రశంసలు కురిపిస్తున్నారు. రాహుల్ లో పరిణితి కన్పిస్తోందని, మోదీ ఇమేజ్ తగ్గుతుందని పదే పదే వ్యాఖ్యానిస్తూ వచ్చారు. దీంతో శివసేన కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతుందేమోనన్న సందేహాలు కూడా తలెత్తాయి. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవర్ మధ్యవర్తిగా శివసేన,కాంగ్రెస్ పార్టీలు వచ్చే ఎన్నికల్లో కలసి పోటీ చేసే అవకాశమున్నట్లు కూడా వార్తలొచ్చాయి.

కూటమి ఏర్పడితే……

శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు మహారాష్ట్రలో మహాకూటమిగా ఏర్పడితే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవని కమలనాధులు ఆందోళనతో ఉన్నారు. అయితే తాజా పరిణామాలు శివసేన కాంగ్రెస్ తో కలసి నడవదన్నది స్పష్టమమయింది. మొన్న జరిగిన భారత్ బంద్ ఈ రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టిందనే చెప్పాలి. భారత్ బంద్ విజయవంతం కాలేదని సామ్నా పత్రికలో శివసేన దుయ్యబట్టింది. తమ మద్దతు తీసుకోక పోవడం వల్లనే బంద్ విజయవంతం కాలేదని కూడా వ్యాఖ్యానించడం విశేషం.

ఉప ఎన్నిక ఫలితం లాగానే….

ఇటీవల మహారాష్ట్రలో జరిగిన ఉప ఎన్నికల్లో పాల్ఘడ్ నియజకవర్గంలో సాధించిన విజయాన్ని ఇటు శివసేన, అటు బీజేపీలు గుర్తుచేసుకుంటున్నాయి. పాల్ఘడ్ ఉప ఎన్నికల్లో శివసేన, బీజేపీ, కాంగ్రెస్ తో సహా మిగిలిన పార్టీలు విడివిడిగా పోటీ చేయడంతో బీజేపీకి విజయం సాధ్యమయింది. ఇప్పుడు కాంగ్రెస్ పై శివసేన చిందులు వేయడంతో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కూడా విపక్షాలు ఓట్ల చీలికతలో తాము విజయపథం వైపు పయనిస్తామని కమలనాధులు ఆశాభావంతో ఉన్నారు. మరి శివసేన చివరకు ఎవరితోనైనా కలుస్తుందా? లేదా తాను చెప్పినట్లు ఒంటరిగానే బరిలోకి దిగుతుందా? అన్నది చూడాల్సి ఉంది.