శివసేన చీదరించుకుంటుంది ఎందుకు?

కమలం పార్టీ వెనక్కు తగ్గుతున్నా శివసేన మాత్రం ఆ పార్టీతో పొత్తుకు ఇష్టపడటం లేదు. ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఒక ప్రకటన చేశారు. వచ్చే ఎన్నికల్లో శివసేనతో పొత్తుతోనే బీజేపీ వెళ్లే అవకాశముందని చెప్పారు. కాని శివసేన మాత్రం ఇందుకు అంగీకరించడం లేదు. శివసేన అధినేత ఉద్ధవ్ ధాక్రే చేసిన వ్యాఖ్యలు దీనికి అద్దం పడుతున్నాయి. బీజేపీ అంటేనే కంపరం పుడుతుందని శివసేన అధినేత ఉద్ధవ్ ధాక్రే అభిప్రాయపడ్డారు.

ఆనాటి బీజేపీ కాదని…..

అంతేకాదు బీజేపీ ఆనాటి బీజేపీ కాదని కూడా ఆయన అన్నారు. వాజపేయి హయాంలో ఉన్న బీజేపీకి, ఇప్పటి బీజేపీకి ఎంతో వ్యత్యాసముందన్నారు. అందుకే తాము ఆ పార్టీతో కలసి వెళ్లే ప్రశ్నే లేదని ఉద్ధవ్ తేల్చి చెప్పారు. దీంతో కమలం ఆశలు సన్నగిల్లినట్లేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. గతంలోనే తాము వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి ిదిగుతామని శివసేన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. పలు సందర్భాల్లో బీజేపీని, మోడీని తమ అధికార పత్రిక సామ్నాలో ఎండగట్టారు.హిందుత్వం కోసమే బీజేపీని 25ఏళ్లుగా భరిస్తున్నామని చెప్పారు.

మిత్రులను దూరం చేసుకోవడం…..

అయితే వరుసగా మిత్రులను దూరం చేసుకోవడం ఇష్టం లేని బీజేపీ శివసేనతో సయోధ్యకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇప్పటికే బలమైన మిత్రుడిగా ఉన్న తెలుగుదేశం పార్టీ దూరం కావడం కొంత ఇబ్బందేనని చెప్పొచ్చు. వచ్చే ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీ రాకుంటే మిత్రుల సాయం తప్పక అవసరమవుతుంది. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో ఎవరికి వారు ఒంటరిగా పోటీ చేసినా తమకు నష్టమే తప్ప లాభం ఉండదని భావించిన కమలనాధులు పాతమిత్రుడిని ఎలాగైనా తమతో కలసి నడిచేలా చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు వికటించాయనే చెప్పాలి. శివసేన మాత్రం తాము రాంరాం చెప్పేశామని చెబుతున్నా చివరి నిమిషంలో కలిసే అవకాశాలు కూడా లేకపోలేదంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*