బ్రేకప్ అని తేల్చేసిన శివసేన

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చేస్తున్న సంధి ప్రయత్నాలు బెడిసి కొడుతున్నాయి. ఒకవైపు టీడీపీ ఎన్డీఏ నుంచి తప్పుకోవడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మిత్రులే శత్రువులుగా మారారంటూ కమలనాధులపై సొంత పార్టీలోని నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు శివసేన ఎప్పుడో తాము వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగుతామని చెప్పింది. ఈ నేపథ్యంలో కనీసం శివసేన నయినా దారికి తెచ్చుకోవాలని అమిత్ షా భావిస్తున్నారు.

ఒంటరిగానే పోటీ చేస్తామని…..

ఈ క్రమంలోనే ఆయన శివసేనతో మైత్రిని కొనసాగించాలని బీజేపీ అగ్రనాయకత్వం నిర్ణయించింది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కలసి పోటీ చేద్దామంటూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేకు సందేశం పంపారు. స్నేహపూర్వకంగా మెలుగుదామన్న అమిత్ షా సంధిప్రయత్నాన్ని ఆ పార్టీ తిప్పి కొట్టింది. తాము గతంలో చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నామని, లోక్ సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయబోతున్నామని ఆ పార్టీ సీనియర్ నేత సుభాష్ దేశాయ్ చెప్పేశారు.

ప్రేమ సందేశం పంపిన షా…..

బీజేపీ ఆవిర్భావ దినోత్సవం రోజున అమిత్ షా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ముంబైలో ఆయన మాట్లాడుతూ తాము నిజాయితీతో చెబుతున్నామని, వచ్చే ఎన్నికల్లో బీజేపీతోనే శివసేన ఉండాలని కోరుకుంటున్నామని చెప్పారు. అయితే అమిత్ షా ప్రేమ సందేశాన్ని శివసేన నేతలు తిరస్కరించారు. శివసేన సీనియర్ నేత సుభాష్ దేశాయ్ మాట్లాడుతూ నిన్న మొన్నటి వరకూ బీజేపీ ప్రభుత్వం అని మాట్లాడిన వారు…ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అంటున్నారని, దీన్ని బట్టి వాళ్ల బలం ఏంటో వారికి తెలిసొచ్చిందని ఆయన ఎద్దేవా చేశారు. మొత్తం మీద శివసేనను అయినా దగ్గరకు తీసుకోవాలన్న అమిత్ షా ప్రయత్నం ఫలించేట్లు లేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*