అయిపోయింది….బయటపడ్డారు…!

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి మరోసారి అధికార పీఠాన్ని అందుకోవాలని భావిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడికి అమాత్యులే అడ్డంకిగా మారుతున్నారు. ముఖ్యంగా ఒక జిల్లాలో ఉండే మంత్రులకు ఒకరంటే ఒకరు పడటం లేదు. గ్రూపులను ప్రోత్సహిస్తున్నారు. బహిరంగంగా వ్యాఖ్యలు కూడా చేసుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలు పెడితే ఇటు నెల్లూరు వరకూ అదే పరిస్థితి. నెల్లూరు జిల్లాలో మంత్రులు పొంగులేటి నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలు ఆధిపత్య పోరుతో పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారన్న వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.

ఇద్దరూ బాబుకు సన్నిహితులే…..

మంత్రి నారాయణ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి అత్యంత సన్నిహితుడు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆదుకున్న నారాయణను అధికారంలోకి వచ్చిన వెంటనే ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేశారు. వచ్చే ఎన్నికల్లో నారాయణ నెల్లూరు నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఈమేరకు గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కొందరు నేతలను తనకు అనుకూలంగా మలచుకుంటున్నారు. ఇక సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పార్టీ లో సీనియర్ నేత. పార్టీ పుట్టినప్పటి నుంచి అందులోనే ఉండి కష్టనష్టాల్లో పాలుపంచుకుంటున్నారు. అందుకే అధికారంలోకి రాగానే ఆయనకూ ఎమ్మెల్సీ పదవి ఇచ్చి మంత్రిని చేశారు చంద్రబాబు. పైగా రెడ్డి సామాజిక వర్గం కావడం కూడా సోమిరెడ్డికి ప్లస్ పాయింట్ అయింది.

జడ్పీ సమావేశంలో….

ఇద్దరూ ఎమ్మెల్సీలే కావడంతో నియోజకవర్గాల్లో పట్టు పెంచుకునేందుకు నేతలను మచ్చికచేసుకునేందుకు గతకొన్నాళ్ల నుంచి వ్యూహాలు రచించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ఈ ఇద్దరి మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. వీరి పోరు వీధికెక్కింది. ఇటీవల జరిగిన జడ్పీ సమావేశంలో మరోసారి నేతల సాక్షిగా బట్టబయలయింది. ఈ సమావేశంలో అజెండాలో లేని డ్రెయిన్ల అంశాన్ని ప్రస్తావించారు. నెల్లూరు నగరంలో 16 డ్రెయిన్ల నిర్మాణ పనులు నీటిపారుదల శాఖకు తెలియకుండా ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. అయితే ఈ డ్రెయిన్ల నిర్మాణ బాధ్యతలను మంత్రి నారాయణ పర్యవేక్షిస్తున్నారు. మంత్రి సోమిరెడ్డి ఒక్కసారి డ్రెయిన్ల విషయం ప్రస్తావనకు తేవడంతో అధికారులు కూడా అవాక్కయ్యారు.

నారాయణ ధీటైన జవాబు….

నెల్లూరు అర్బన్ డెవెలెప్ మెంట్ అథారిటీ పై కూడా సోమిరెడ్డి నిప్పులు చెరిగారు. నుడా వల్ల అనేక గ్రామాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఇల్లు కట్టుకోవాలన్నా లక్షల్లో పన్నులు కట్టాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే నుడాను కూడా తొలి నుంచి మంత్రి నారాయణే పర్యవేక్షిస్తున్నారు. ఇలా జడ్పీ వేదికగా సోమిరెడ్డి మంత్రి నారాయణను టార్గెట్ చేసినట్లు కన్పిస్తోందని పార్టీలోనే గుసగుసలు మొదలయ్యాయి. అయితే దీనికి మంత్రి నారాయణ ఘాటుగానే సమాధానమిచ్చారు. అవగాహన లేకుండా మాట్లాడొద్దని పరోక్ష హెచ్చరికలు నారాయణ సోమిరెడ్డికి పంపారు. అనవసర రాద్ధాంతం చేయకుండా అభివృద్దికి సహకరించాలని కోరారు. ఇలా మంత్రులు నారాయణ, సోమిరెడ్డి మధ్య విభేదాలు రచ్చకెక్కడంతో తెలుగు తమ్ముళ్లు జిల్లాలో డీలా పడ్డారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*