సోమిరెడ్డి విక్టిమ్స్ ఏకమవుతున్నారే….!

మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని ఢీకొట్టేందుకు శత్రువులు మిత్రులయ్యారు. బద్ధ వ్యతిరేకులే మళ్లీ మిత్రులయ్యారు. నెల్లూరు జిల్లాలో రాజకీయాలు ఊహించని మలుపులు తీసుకుంటున్నాయి. ఇద్దరూ ఒకప్పడు మిత్రులే. అయితే రాజకీయంగా వారు విడిపోయి శత్రువులయ్యారు.కాని ఇప్పుడు సోమిరెడ్డి బాధితులు కావడంతో తిరిగి మిత్రులుగా మారారు. వారే ఆనం రామనారాయణరెడ్డి, కాకాణి గోవర్థన్ రెడ్డి. ఇద్దరూ ఒకప్పుడు మంచి మిత్రులు. ఒకే పార్టీలో ఉండి జిల్లాలో ఒకే బాట నడిచిన వారు. తర్వాత రాజకీయ కారణాలతో వారు విడిపోయారు. కాకాణి గోవర్థన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ లోకి వెళ్లగా, ఆనం రామనారాయణరెడ్డి కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వెళ్లారు.

ఇద్దరూ ఒకప్పుడు…..

చాలారోజుల తర్వాత ఇద్దరూ ఒక్కటయ్యారు. కాకాణి గోవర్థన్ రెడ్డి ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు. సర్వేపల్లి ఎమ్మెల్యేగా ఉన్నారు. మరోవైపు మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి. వీరిద్దరి మధ్య దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి రాజకీయ మైత్రి ఉంది. వీళ్లే కాదు వీళ్ల తండ్రుల నుంచి ఈ అనుబంధం కొనసాగుతూనే వస్తోంది. నాటి ఏసీ సుబ్బారెడ్డి, ఆనం వెంకటరెడ్డికి కాకాణి గోవర్థన్ రెడ్డి తండ్రి కాకాణి రమణా రెడ్డి ముఖ్య అనుచరుడిగా ఉండేవారు. పొదలకూరు మండలం తోడేరుుకు చెందిన కాకాణి ఆనం కుటుంబంలో ఆప్తుడిగా మెలిగారు. దీంతో కాకాణి గోవర్థన్ రెడ్డిని 2007లో ఆనం సోదరులు జడ్పీ ఛైర్మన్ గా చేశారు. ఆ కృతజ్ఞతతోనే ఆనం సోదరుల వెంటే కాకాణి నడిచారు.

వైఎస్ మరణంతో…..

అనంతర కాలంలో రాజకీయ పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించడంతో ఆనం సోదరులు కాంగ్రెస్ లోనే కంటిన్యూ అయ్యారు. కాకాణి గోవర్థన్ రెడ్డి మాత్రం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో ఇద్దరి మధ్య దూరం పెరిగింది. తర్వాత కాకాణి సర్వేపల్లి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆనం సోదరులు మాత్రం టీడీపీలోకి వెళ్లారు. అప్పటి టుంచి వీరి మధ్య రాజకీయ వైరం పెరిగింది. ఇద్దరూ ఒకరినొకరు బహిరంగంగా విమర్శించుకోనప్పటికీ రాజకీయంగా శత్రువులగానే మిగిలారు.

సోమిరెడ్డిని ఢీకొట్టేందుకు…..

అయితే తాజాగా ఆనం వైసీపీలో చేరుతుండటంతో కాకాణి తిరిగి ఆనం ఫ్రెండ్ షిప్ ను కోరుకుంటున్నారు. జిల్లాలోనే బలమైన నేతగా ఉన్న ఆనంరామనారాయణరెడ్డిరాకతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని కాకాణి చెబుతున్నారు. అంతేకాదు ఇద్దరూ సోమిరెడ్డి బాధితులే. సర్వేపల్లి నియోజకవర్గం నుంచి గెలుపొందడంతో కాకాణిపై సోమిరెడ్డి వ్యక్తిగత వైరాన్ని పెంచుకున్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరగనీయకుండా అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. అంతేకాదు కాకాణి సోమిరెడ్డిపై వ్యక్తిగత విమర్శలకు దిగడం, కుంభకోణాలు చేశారని ఆరోపించడంతో న్యాయస్థానాలను ఆశ్రయించారు. అలాగే ఆనం కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వైఖరి కారణంగానే పార్టీ నుంచి వెళ్లిపోయారన్నది ఒక కారణంగా చెబుతారు. దీంతో సోమిరెడ్డిని ఢీకొట్టేందుకు ఇప్పుడు బలమైన నేతలిద్దరూ ఒక్కటయ్యారు. రాజకీయాలంటే అంతేమరి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*