ఏందబ్బాయా…ఇదేం పని…?

నెల్లూరు నుంచి ఎమ్మెల్సీగా ఉన్న మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి తీరుపై జిల్లాలోనేకాకుండా.. పార్టీలోనూ చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఆయ‌న ప్ర‌జ‌ల్లో గెలిచి చాలా ఏళ్లే అయిపోయింది. అయితే.. ఇప్ప‌టికీ ఆయ‌న త‌న తీరును మార్చుకోలేక పోతున్నారు. పార్టీని అంటి పెట్టుకుని ఏళ్ల‌కు ఏళ్లు ఉన్నారే కానీ, పార్టీకి ఆయ‌న చేసిన సేవ మాత్రం ఏమీ క‌నిపించ‌డం లేదు. పార్టీని బ‌లోపేతం చేసేందుకు ఆయ‌న ఒక్క‌టంటే ఒక్క వ్యూహాన్ని కూడా అమ‌లు చేయ‌లేదు. పైగా ప‌స‌లేని విమ‌ర్శ‌ల‌తో పొద్దు పుచ్చుతూ.. పార్టీని భ్ర‌ష్టు ప‌ట్టిస్తున్నార‌నే విమ‌ర్శ‌ల‌ను మాత్రం ఆయ‌న ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో ఎన్నిక‌ల‌కు స‌మయం ముంచుకు వ‌స్తున్న నేప‌థ్యంలో అన్ని జిల్లాల ప‌రిస్థితినీ చంద్ర‌బాబు తెలుసుకుంటున్నారు.

నారాయణకూ హెచ్చరికలు….

ఈ క్ర‌మంలోనే నెల్లూరుపైనా ఆయ‌న దృష్టి పెట్టారు. ఇక్క‌డ నుంచి ఇద్ద‌రు మంత్రులు చంద్ర‌బాబు కేబినెట్‌లో చ‌క్రం తిప్పుతున్నారు. వీరిలో కీల‌కంగా ఉన్న నారాయ‌ణ‌కు చంద్ర‌బాబు ఇప్ప‌టికే నెల్లూరు సిటీ నియ‌జ‌క‌వ‌ర్గం టికెట్‌ను ఆఫ‌ర్ చేశారు. ఆయ‌న ఈ నియోజ‌క‌వ‌ర్గం త‌ప్ప‌.. మిగిలిన జిల్లాతో త‌న‌కు ఏం ప‌ని అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ విష‌యం తెలిసిన చంద్ర‌బాబు.. నారాయ‌ణ‌ను హెచ్చ‌రించార‌ని తెలిసింది. మీరు పోటీ చేసే నియోజ‌క‌వ‌ర్గంతోపాటు.. జిల్లాపైనా ఓ క‌న్నేసి ఉంచాల‌ని, అభివృద్ధిని స‌మీక్షించాల‌ని ఆదేశించారు. ఇక‌, సోమిరెడ్డి విష‌యానికి వ‌స్తే.. ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న కుమారుడిని రంగంలోకి దింపాల‌ని చూస్తున్నారు. అయితే, త‌న‌కే దిక్కులేదు.. ఇక త‌న‌కుమారుడుకి చోటెక్క‌డ అనే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

వరుసగా నాలుగు సార్లుగా…

ఎందుకంటే ఓ సీనియ‌ర్ లీడ‌ర్‌గా ఉన్న ఆయ‌న గ‌త నాలుగు ఎన్నిక‌ల్లోనూ వ‌రుస‌గా ఓడిపోతూ వ‌స్తున్నారు. అయినా చంద్ర‌బాబు ఆయ‌న‌కు గ‌త ఎన్నిక‌ల్లో నాలుగోసారి ఓడాక ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేశారు. ఆయ‌న ఒంటెత్తు పోక‌డ‌ల‌తో జిల్లాలో చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ నాశ‌నం అవుతోంద‌ని పార్టీ నాయ‌కులే గ‌గ్గోలు పెడుతున్న ప‌రిస్థితి. ఇదిలావుంటే, నిత్యం జగన్‌పై విమర్శలు, ఆరోపణలు చేసే మంత్రి సోమిరెడ్డి, ఇదే జిల్లాకు చెందిన విజయసాయిరెడ్డి చంద్రబాబుపై ఆరోపణలు, విమర్శలు పదే పదే చేస్తోన్నా..దాన్ని ఖండించడం కానీ…ఎదురు విమర్శలు చేయకపోవడం కానీ, చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి.

వైసీపీ ఎమ్మెల్యేతో సాన్నిహిత్యంగా….

మ‌రోప‌క్క‌, వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో సోమిరెడ్డికి ఉన్న సాన్నిహిత్యాన్ని కూడా ఇక్క‌డి టీడీపీ నాయ‌కులు ప్ర‌శ్నిస్తున్నారు. ఒకవైపు టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం…కేంద్రంలో బాబు చక్రం తిప్పుతారు…అని పదే పదే చెబుతోన్న సోమిరెడ్డి.. నెల్లూరులోని కొన్ని నియోజకవర్గాల్లో గ్రూపులను ప్రోత్సహించడంపైనా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇక‌, ఈ విషయాలు తెలిసిన చంద్రబాబు ఇటీవల కాలంలో సోమిరెడ్డిని ప‌క్క‌న పెడుతున్నారు. అయినా కూడా సోమిరెడ్డి మాత్రం త‌న పంథాను మార్చుకోవ‌డం లేదు. దీంతో సోమిరెడ్డి తీరు మార‌దా? అనే ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి చంద్రబాబు ఎలాంటి చర్యలకు దిగుతారో చూడాల్సి ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*