సోనియా వాయిస్ ఏదీ….?

sonia-gandhi-indian-national-congress

కుమారుడి భవిష్యత్ తేల్చే ఎన్నికలివి. పార్టీని బతికించే ఎలక్షన్స్ ఇవి. అటువంటి కీలక సమయంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ దూరంగా ఉన్నారు. రాయబరేలిలో పోటీ చేయడం తప్పించి, ప్రచారంలో ఆమె పాల్గొనడం లేదు. కాంగ్రెస్ పార్టీకి దశాబ్దాల పాటు శాసించిన సోనియాగాంధీ ఈ ఎన్నికల వేళ ప్రచారానికి దూరంగా ఉండటం కాంగ్రెస్ అభిమానులను కలవరపరుస్తోంది. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సోనియా గాంధీ హైదరాబాద్ లో జరిగిన బహిరంగ సభకు హాజరయ్యారు. అయితే ఈ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో మాత్రం సోనియా ఎక్కడా కన్పించడం లేదు.

ఆరోగ్యం సహకరించకే….

సోనియా గాంధీ గత కొంతకాలంగా అస్వస్థతతో ఉన్నారు. దాదాపు ఏడాదిన్నర క్రితం పార్టీ అధ్యక్ష బాధ్యతలను కూడా తనయుడు రాహుల్ గాంధీకి అప్పగించారు. తాను అవసరమైన సలహాలను మాత్రమే ఇస్తున్నారు. కొద్దికాలం క్రితం జరిగిన మధ్యప్రదేశ్,రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ ల ఎన్నికల ప్రచారానికి కూడా సోనియా వెళ్లలేదు. ఎన్నికల అనంతరం అక్కడి ప్రభుత్వ ఏర్పాటు విషయంలో సోనియా జోక్యం ఉందని చెబుతారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా కమల్ నాధ్, రాజస్థాన్ ముఖ్యమంత్రిగా అశోక్ గెహ్లాట్ లను నియమించడంలో సోనియా కీలక పాత్ర పోషించారంటారు.

కీలక పాత్ర పోషిస్తారనుకున్నా…..

ఇక లోక్ సభ ఎన్నికల వేళ సోనియాగాంధీ కీలక పాత్ర పోషిస్తారని భావించారు. కానీ అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ ఆమె పట్టించుకోలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టెన్ జన్ పథ్ కే పరిమితమయ్యారంటున్నారు. అలాగే ఎన్నికలకు ముందుగానే కూటమి ఏర్పాటు చేయాలని సోనియాగాంధీ గట్టిగా భావించారు. అప్పుడే మోదీని ఓడించడం సాధ్యమవుతుంని భావించారు. అయితే యూపీలో బీఎస్పీ, ఎస్పీలు వేరుకుంపటి పెట్టుకోవడంతో మనస్థాపానికి గురయ్యారని తెలిసింది. గతంలో ఎన్నికలకు ముందే కూటమి ఏర్పాటు చేయాలని సోనియా గాంధీ విందు సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. కానీ ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు.

ఇప్పుడు రాకుంటే….?

చివరకు రాహుల్ గాంధీ నిర్ణయాలనే సోనియా సమర్థించాల్సి వచ్చింది. ప్రచారం మొత్తం రాహుల్, ప్రియాంకలకు వదిలిపెట్టారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లో ఎస్పీ, బీఎస్పీ, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీలతో కలసి నడవాలని పార్టీ సీనియర్ నేతలకు సోనియా గట్టిగానే చెప్పినా ఫలించలేదు. దీంతో ఆమె రాయబరేలి నియోజకవర్గానికే పరిమితమయ్యారు. ఇప్పటికే ఐదేళ్లు అధికారానికి దూరంగా ఉండటంతో హస్తం పార్టీ ఆర్థికంగా, క్యాడర్ పరంగా ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించకపోతే కాంగ్రెస్ పార్టీకి మనుగడ లేకుండా పోతుందన్న భయం ఆమెలో ఉన్నప్పటికీ ఆరోగ్యం సహకరించకే ప్రచారం లో పాల్గొనలేదన్నది పార్టీ వర్గాల నుంచి విన్పిస్తున్న అభిప్రాయం. మొత్తం మీద దశాబ్దాల పాటు పార్టీని శాసించిన సోనియా వాయిస్ ఈ ఎన్నికల్లో విన్పించకుండా పోయింది.

Ravi Batchali
About Ravi Batchali 18039 Articles
With twenty five years of  experience in Print / Electronic & Social Media, had an illustrious career in leading daily news papers. Very creative and a tenacious reporter of the news with a reputation for impeccable ethics. His passion for Community Journalism and his work as a staff reporter was widely acclaimed. An excellent storyteller who treats news, features and other events with equal priority.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*