అలవి కాని ‘‘హోదా’’ తో గోదాలోకి….??

special-status-how-it-is-possible

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధ్యమేనా? నిజంగానే కేంద్రంలో 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తారా? ఇదే చర్చ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మొత్తం జరుగుతుంది. ఇటీవల తెలంగాణలో పర్యటించిన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ సయితం తాము అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. రాహుల్ గాంధీ ఒక అడుగు ముందుకేసి తాము పవర్ లోకి వచ్చిన వెంటనే తొలి సంతకం ప్రత్యేక హోదా ఫైల్ పైనే ఉంటుందని చెప్పారు. ఇక ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సయితం కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా ఇస్తానని హామీ ఇవ్వబట్టే దానితో కలుస్తున్నానని ఇటీవల పలు సభలు, సమావేశాల్లో చెబుతూ వస్తున్నారు.

పొరుగు రాష్ట్రాల ప్రభావం….

అయితే రాజకీయ పండితులు మాత్రం ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే అవకాశమే లేదంటున్నారు. ఆంధ్రప్రదేశ్ కు పొరుగున ఉన్న రాష్ట్రాలేవీ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే ఊరుకోవన్నది దాదాపుగా ఇప్పటికే స్పష్టమైంది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి పొరుగున ఉన్న తెలంగాణ అభ్యంతరం చెబుతుంది. పరిశ్రమలు తమ రాష్ట్రానికి రావన్న ఆందోళన అన్ని రాష్ట్రాల్లో వ్యక్తమవ్వడమే ఇందుకు కారణం. పక్కనే ఉన్న ఒడిశా రాష్ట్రం కూడా ఎప్పటి నుంచో ప్రత్యేక హోదా కోరుతోంది. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ పలుమార్లు తమ రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాలంటూ కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తులు చేయడమేకాకుండా, ఒడిశాలో కూడా దీనిపై ఆందోళనలు జరుగుతున్నాయి. దీంతో ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేందుకు తొలిగా అడ్డుకునేది నవీన్ పట్నాయక్. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి ఒకవేళ వచ్చినా అది కూటమి ప్రభుత్వంగానే ఏర్పడనుంది.

కర్ణాటక, తమిళనాడుల్లో….

ఇక కర్ణాటకలో ఇప్పటికే సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంది. అక్కడ జనతాదళ్ ఎస్,కాంగ్రెస్ పార్టీలు కలసి ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే ఆ ప్రభావం తమ రాష్ట్రంపై ఉంటుందన్న ఆందోళన ఆ పార్టీనేతల్లో ఇప్పటికే ఉంది. వీరప్ప మొయిలీ వంటి కాంగ్రెస్ నేతలు ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే అంశాన్ని విభేదిస్తూ వస్తున్నారు. కుమారస్వామి కూడా సరైన సమయంలో తన నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. ఇక పొరుగున ఉన్న మరో రాష్ట్రం తమిళనాడు. పార్లమెంటు సభ్యుల సంఖ్యాపరంగా చూసుకున్నా ఇది బలమైన రాష్ట్రం. ఇక్కడ డీఎంకే ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ఖచ్చితంగా అడ్డుకుంటుందన్నది విశ్లేషకుల అంచనా. ఒకవేళ లోక్ సభ ఎన్నికల్లో డీఎంకేకు అధిక స్థానాలు వస్తే  ఆ పార్టీ అధినేత స్టాలిన్ ప్రత్యేక హోదాపై పేచీ పెట్టరన్న గ్యారంటీ ఏమీలేదు.

మమత సయితం…..

ఇక త్వరలో ఏర్పడనున్న బీజేపీయేతర కూటమిలో బలంగా ఉన్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ సయితం ప్రత్యేక హోదాను వ్యతిరేకించే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. తమకు కూడా ప్రత్యేక హోదా కావాలని గట్టిగా కోరుతున్నారు. ఇక మాయవతి సంగతి చెప్పనవసరంలేదు. చివరినిమిషంలోనైనా మాయావతి అడ్డం తిరగుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. పూర్తి మెజారిటీ ఉన్న మోదీ సర్కార్ ఇవ్వలేని ప్రత్యేక హోదా కిచిడీ ప్రభుత్వం ఇస్తుందన్న నమ్మకం లేదనేది విశ్లేషకుల భావన. కేవలం ఎన్నికల్లో గెలుపొందడానికే అన్ని పార్టీలూ ప్రత్యేక హోదాను తెరమీదకు తెస్తున్నాయన్నది వాస్తవం. ప్రజలను మభ్యపెట్టడం మానుకుని ఇకనైనా వాస్తవ విషయాలు ప్రజలకు తెలియజెప్పి ఎన్నికలకు వెళితే బాగుంటుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*