ఆటగాళ్లే….నాయకన్ లు….!

స్వాతంత్ర్య సమరంలో న్యాయవాదులు చురుగ్గా పాల్గొన్నారు. లక్షల రూపాయలు ఆదాయాన్ని గడించే వృత్తికి తాత్కాలికంగా విరామం పలికి పోరాటంలో పాల్గొన్నారు. మహాత్మా గాంధీ, మోతీలాల్ నెహ్రూ, జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తదితర నాయకులు దేశమాత శృంఖలాలను తెంచేందుకు త్యాగాలు చేశారు. స్వాతంత్ర్యానంతరం పాలనలో సయితం న్యాయవాదులు పెద్దయెత్తున పాల్గొన్నారు. కాలక్రమంలో విద్యావంతులు, వృత్తి నిపుణులు రాజకీయాల్లోకి ప్రవేశించారు. తర్వాత రోజుల్లో సినిమా కథానాయకుల శకం మొదలయింది. అమెరికాలో రోనాల్డ్ రీగన్ నుంచి భారత్ లో అన్నాదురై, కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత, నందమూరి తారక రామారావు వంటి నాయకులు చక్రం తిప్పారు. తమిళనాడులో రాజకీయం, కళారంగాలు పాలు, నీళ్లలా కలసి పోతాయి. ఇతర దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఈ సంస్కృతి అక్కడక్కడా కొట్టొచ్చినట్లు కనపడుతోంది.

ఇమ్రాన్ 25 ఏళ్ల కష్టం……

ఇటీవల కాలంలో ఆటగాళ్లు రాజకీయాల్లో పాల్గొనడం అధికమైంది. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ క్రీడాకారులు రాజకీయాలను వృత్తిగా చేసుకుంటున్నారు. అందులో అత్యున్నత స్థాయికి చేరుకుంటున్నారు. తాజాగా ఇమ్రాన్ ఖాన్ ఉదంతమే ఇందుకు నిలువెత్తు నిదర్శనం. రమారమి పాతికేళ్ల క్రితం పార్టీ పెట్టిన ఈ క్రికెట్ ఆల్ రౌండర్ ఇప్పుడు పాక్ అధినేత కావడం గమనార్హం. విజయవంతమైన కెప్టెన్ గా దేశానికి ప్రపంచ కప్ తో సహా పలు ప్రతిష్టాత్మక మైన బహుమతులు అందించడంలో ఇమ్రాన్ పాక్ ప్రధానిగా అందరిదృష్టిని ఆకర్షిస్తున్నారు. లాహోర్ లో జన్మించిన ఈ పాకిస్థాన్ తెహ్రిక్ -ఇ-ఇన్సాఫ్ పార్టీ అధినేత అయిన ఇమ్రాన్ ఖాన్ ఈ స్థాయికి రావడానికి నిరంతరం పోరాడారు. అంత తేలిగ్గా,రాత్రికి రాత్రి ఆయనకు అధికారం సంక్రమించలేదు. ఒక క్రికెటర్ గా మైదానంలో విజయం కోసం ఎంత శ్రమించాడో, ప్రజాక్షేత్రంలో రాజకీయనాయకుడిగా అంతకంటే మిన్నగా శ్రమించాడు. దాని ఫలితమే అధికార సాధన. జులై 25న జరిగిన ఎన్నికల్లో సంప్రదాయ పార్టీలైన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ, పాకిస్థాన్ ముస్లిం లీగ్ ను మట్టి కరిపించారు. విజయకేతనం ఎగురవేశారు. దేశ రాజకీయాల్లో మొదటి నుంచి ఈ రెండు పార్టీలదే పెత్తనం. మూడో పార్టీ అధకారం సాధించడం ఇదే ప్రధమం.

అజార్ నుంచి ఆజాద్ దాకా…..

ఇమ్రాన్ ఖాన్ కంటే ముందు ఎంతోమంది క్రికెట్ క్రీడాకారులు రాజకీయాల్లోకి వచ్చారు. హైదరాబాదీ అయిన అజారుద్దీన్ ఇందులో ప్రముఖుడు. విజయవంతమైన కెప్టెన్ గా భారత్ కు అనేక బహుమతులు తెచ్చి పెట్టిన టీమిండియా కెప్టెన్ ను మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు చుట్టుముట్టాయి. చివరకు ఆటకు స్వస్తి పలికి రాజకీయ అరంగేట్రం చేశారు. 2004. 2009 లోక్ సభ ఎన్నికల్లో యూపీ లోని మొరదా బాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయకేతనం ఎగురవేశారు. 2014లో ఓడిపోయారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో సొంత రాష్ట్రంలోని హైదరాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో ఎక్కడో ఒక చోట నుంచి పోటీ చేసేందుకు పావులు కదుపుతున్నారు. ఏడు టెస్ట్ లు, 25 వన్డేలు ఆడి 1983 ప్రపంచ కప్ సాధనలో కీలకపాత్ర పోషించిన కీర్తి ఆజాద్ రాజకీయ కుటుంబం నుంచే వచ్చారు. ఆయన తండ్రి భగవత్ జా ఆజాద్ ఒకప్పటి బీహార్ ముఖ్యమంత్రి. ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు. క్రీడారంగానికి స్వస్థి పలికాక కొంతకాలం వ్యాఖ్యాతగా పనిచేశారు. 2014లో బీహార్ లోని ‘దర్బంగా’ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా లోక్ సభకు ఎన్నికయ్యారు. భారతీయ జనతా పార్టీ లోక్ సభకు ఆయన ఎన్నికల కావడంతో వరుసగా ఇది మూడోసారి. నవజ్యోత్ సింగ్ సిద్ధూ సంగతి సరేసరి. భారతీయ జనతా పార్టీతో రాజకీయ అరంగేట్రం చేసిన ఈ మాజీ క్రికెటర్ ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే. పంజాబ్ పర్యాటక మంత్రిగా సేవలందిస్తున్నారు. సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రమైన అమృత్ సర్ నుంచి ఎంపీగా ఎన్నికైన సిద్దూ తర్వాత రోజుల్లో రాజకీయ కారణాల వల్ల కాంగ్రెస్ లో చేరారు. అంతకు ముందు ఆయన 51 టెస్ట్ మ్యాచ్ లు ఆడారు. 134 వన్డేల్లో పరుగుల వరద పారించారు. గతంలో ఆయన ఆవాజ్ ఎ పంజాబ్ పార్టీని కూడా ప్రారంభించారు. తాజాగా ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారానికి హాజరై వివాదాస్పదమయ్యారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాక్ సైన్యాధిపతి జనరల్ బజ్వాను కౌగిలించుకోవడం, ఆక్రమిత కాశ్మీర్ అధ్యక్షుడి పక్కనే కూర్చోవడం వివాదమైంది. పాకిస్థాన్ లోని ప్రముఖ గురుద్వారా ‘‘కర్తాల్ సాహిబ్’’ సందర్శనకు వీసా లేకుండా సిక్కులను అనుమతిస్తామనడంతో తాను ఇమ్రాన్ ఖాన్ ప్రమాణస్వీకారానికి వెళ్లినట్లు సిద్ధూ వెల్లడించారు.

శ్రీలంక కెప్టెన్ గా ఉండి…..

శ్రీలంక కెప్టెన్ గా సంచలనం సృష్టించిన అర్జున్ రణతుంగ ప్రస్తుతం పెట్రోలియం మంత్రిగా క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు. ఈ ద్వీపదేశానికి ప్రపంచ కప్ ను అందించిన ఘనత ఆయనదే. మరో లంక బ్యాట్స్ మెన్ సనత్ జయసూర్య ఎంపీగా ఎన్నికయ్యారు. 2010లో ఎంపీగా ఉంటూనే మైదానంలోకి దిగిన ఘనత ఆయనది. 46టెస్ట్ మ్యాచ్ లు ఆడి, 41 మ్యాచ్ లకు సారథిగా పనిచేసిన మన్సూర్ ఆలీఖాన్ పటౌడీ 1991లో భోపాల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయారు. అంతకు ముందు అసెంబ్లీకి కూడా పోటీ చేసి ఓడిపోయారు. ఆల్ రౌండర్ గా ఎన్నో విజయాలను అందుకున్న మహ్మద్ కైఫ్ ఉత్తర్ ప్రదేశ్ లోని ‘‘పూల్పూర్’’ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయారు. సచిన్ చిన్ననాటి స్నేహితుడు అయిన వినోద్ కాంబ్లీ లోక్ భారతి పార్టీ తరుపున 2009 ఎన్నికల్లో పోటీచేశారు. పుట్టిన రోజున సెంచరీ చేసిన తొలి భారతీయ క్రికెటర్ గా కాంబ్లీ చరిత్ర సృష్ఠించారు. ప్రస్తుతం లోక్ భారతి ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. ఇక క్రికెట్ దిగ్గజం సచిన్ సంగతి సరేసరి. ఆయన పెద్దల సభ సభ్యుడగా సేవలందిస్తున్నారు. చేతన్ చౌహాన్, మనోజ్ ప్రభాకర్, హశన్ తిలక్ రత్నే, పాకిస్థాన్ మాజీ కెప్టెన్ అమీర్ సోహయిల్, పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ సర్పరాజ్ నవాజ్ లు వివిధ పార్టీల్లో చేరారు. కొందరు విజయవంతమయ్యారు. మొత్తం మీద ఆటగాళ్ల ఆఖరి మజిలీకి రాజకీయ రంగం వేదిక కావడం తాజా పరిణామం.

 

-ఎడిటోరియల్ డెస్క్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*