మామ్ డెత్ మిస్టరీ అలాగే ఉండిపోతుందా…?

అతిలోక సుందరి మరణంపై మిస్టరీ అలానే ఉండిపోయేలా వుంది. ఈ కేసుపై దాఖలైన రెండో రిట్ పిటిషన్ ను సుప్రీం కోర్ట్ కొట్టేసింది. ఆమెది ప్రమాదవశాత్తు జరిగిన మరణం కాదని బీమా సొమ్ము కోసం జరిగిన హత్యగా అనుమానిస్తూ శ్రీదేవి మరణంపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని కేసు దాఖలైంది. ఈ కేసును సునీల్ సింగ్ అనే వ్యక్తి దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు మరోసారి గతంలో ఇచ్చిన విధంగానే కేసును కొట్టేశారు.

సునీల్ సింగ్ లేవనెత్తిన సందేహాలు ఇవే …

బాలీవుడ్ స్టార్ శ్రీదేవి పై 240 కోట్ల రూపాయల బీమా చేయబడి ఉందని పిటిషనర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ బీమా షరతుల ప్రకారం అరబ్ ఎమిరేట్స్ లో మరణిస్తేనే ఆ సొమ్ము శ్రీదేవి కుటుంబానికి దక్కుతుందని తెలిపారు. అదేవిధంగా శ్రీదేవి 5.7 అడుగుల పొడుగు ఉంటారని అంత ఎత్తు వున్న వ్యక్తి టబ్ లో మునిగి చనిపోయే అవకాశాలు చాలా తక్కువ అని పిటిషన్లో వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె మరణంపై పూర్తి స్థాయి దర్యాప్తు అవసరమని కోర్టును అభ్యర్ధించారు. అయితే ఇప్పటికే ఇలాంటి పిటిషన్ ఒక దానిని కోర్టు కొట్టేసింది. తాజాగా రెండో పిటిషన్ తిరస్కరించింది.

బోనీ కపూర్ పై దుబాయిలో …

ఈ ఏడాది ఫిబ్రవరి 26 న దుబాయిలో శ్రీదేవి ప్రమాదవశాత్తు బాత్ టబ్ లో పడి చనిపోయారు. ఒక వివాహ వేడుకకు వెళ్ళి ఇలా అర్ధాంతరంగా ఆమె తనువు చాలించడం అందరికి షాక్ ఇచ్చింది. శ్రీదేవి భర్త బోని కపూర్ ను దుబాయిలో పోలీసులు విచారించడంతో బాటు పూర్తిస్థాయిలో పోస్ట్ మార్టం సైతం చేపట్టారు. ఆమె ఆల్కహాల్ తీసుకుని ఉన్నట్లు విచారణలో తేలింది కూడా. ఇక అక్కడి దర్యాప్తు అన్ని కోణాల్లో పూర్తి అయ్యాక కానీ రెండు రోజుల తరువాతే శ్రీదేవి మృతదేహం భారత్ కు తరలించేందుకు దుబాయిలో అనుమతి లభించింది. శ్రీదేవి భర్త ఆమె మరణానికి ముందు ఇండియా వెళ్లడం తిరిగి ఆకస్మాత్తుగా రావడం ఆ తరువాత ఆమె టబ్ లో చనిపోవడం ఇప్పటికి మిస్టరీగానే ప్రజలు భావిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*