ఎవరి వ్యూహం వారిదే….!!!

stallin-alagiri-dmk-tamilnadu-

తమిళనాడులో రాజకీయాలు రసకందాయంలో పడనున్నాయి. ముఖ్యంగా సర్వేలు, అంచనాల్లో అందరికంటే ముందున్న డీఎంకే అధినేత స్టాలిన్ కు ఈ ఎన్నిక అగ్ని పరీక్షగా మారనుంది. స్టాలిన్ ఇప్పటికే డీఎంకే అధ్యక్ష్య బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో డీఎంకే ఘన విజయం సాధించేందుకు ఆయన అప్పుడే పొత్తుల ప్రక్రియను కూడా ప్రారంభించారు. లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటాలని తహతహలాడుతున్న స్టాలిన్ కు తిరువారూర్ ఎన్నిక ఇప్పుడు సవాల్ గా మారనుంది.

తిరువారూర్ ఎన్నికతో….

డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మరణంతో ఖాళీ ఏర్పడిన తిరువారూర్ స్థానానికి ఎన్నికల సంఘం షెడ్యూల్ ను ప్రకటించింది. ఈ నెల 28వ తేదీన తిరువారూర్ ఎన్నిక జరగనుంది. తమిళనాడులో మొత్తం 20 అసెంబ్లీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అన్నాడీఎంకే ఎమ్మెల్యే ఎ.కె.బోస్ మరణంతో తిరుప్పరకుండ్రం స్థానంతో పాటు దినకరన్ వర్గంలో చేరిన 18 మంది ఎమ్మెల్యేల పై అనర్హత పడటంతో ఖాళీలు ఏర్పడ్డాయి. అయితే వివిధ సాంకేతిక కారణాలతో ఎన్నికల సంఘ: 19 అసెంబ్లీ నియోకవర్గాలను పక్కన పెట్టి కరుణానిధి ప్రాతినిధ్యం వహించిన తిరువారూర్ స్థానానికే ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించింది.

సిట్టింగ్ స్థానం కావడంతో….

తిరువారూర్ స్థానం ప్రతిపక్ష డీఎంకే సిట్టింగ్ స్థానం కావడంతో స్టాలిన్ ఇక్కడ ఖచ్చితంగా గెలవాల్సి ఉంది. కరుణానిధి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం కావడం, ఆయన మరణంతో ఈస్థానం సులువుగా డీఎంకే ఖాతాలో పడే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆ అవకాశాలను కఠినం చేసేందుకు భారతీయ జనతా పార్టీ పావులు కదుపుతోంది. ఇటీవల చెన్నైలో కరుణానిధి విగ్రహావిష్కరణ సభలో రాహుల్ ను భావిప్రధానిగా స్టాలిన్ పేర్కొనడాన్ని బీజేపీ తీవ్రంగా తీసుకుంది. అదను చూసి స్టాలిన్ ను దెబ్బకొట్టాలని యోచిస్తుంది.

ఆళగిరి రంగంలోకి దిగితే….

ఈ పరిస్థితుల్లో తిరువారూర్ స్థానానికి ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో స్టాలిన్ సోదరుడు ఆళగిరికి కమలం పార్టీ గాలం వేసింది. ఆళగిరి తొలుత డీఎంకేలో చేరాలనుకున్నా స్టాలిన్ తో పాటు కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. మధురై ప్రాంతంలో మంచి పట్టున్న ఆళగిరిని తిరువారూర్ నుంచి పోటీకి దింపి స్టాలిన్ ను దెబ్బతీయాలన్న వ్యూహంలో ఉన్నారు. ఆళగిరి కూడా తన సత్తా ఏందో స్టాలిన్ కు చూపాలనుకుంటున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆళగిరి బీజేపీలో చేరేందుకు అక్కడి నుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరి కరుణానిధి కుటుంబ సభ్యులు ఆళగిరికి నచ్చ జెపుతారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*