ఆయన వస్తేనే ప్రాబ్లమా?

అన్నాడీఎంకేలాగానే ఇప్పుడు అయ్యా డీఎంకేలా మరొకటి తయారవుతుందా? డీఎంకే అధినేత కరుణానిధి మరణంతో వారసత్వ పోరు మొదలయింది. కరుణానిధి కుమారులు ఆళగిరి, స్టాలిన్ ల మధ్య ఆధిపత్య పోరు ప్రారంభమైంది. ఈరోజు అన్నా అరివాలయంలో సమావేశమైన పార్టీ కార్యవర్గ సమావేశంలో ఆళగిరి విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఆళగిరిని పార్టీలో తిరిగి చేర్చుకుంటేనే సమస్యలు ఎక్కువగా ఉంటాయని స్టాలిన్ తో పాటు మరికొందరు సీనియర్ నేతలు భావిస్తున్నారు. అవసరమైతే దక్షిణ తమిళనాడుకే పరిమితం చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. మంగళవారం జరిగిన సమావేశం కేవలం కరుణానిధి మృతి సంతాపానికే పరిమితం కావడం విశేషం.

రాయబారాలు విఫలం….

కరుణ మృతి తర్వాత అన్నాడీఎంకేలా డీఎంకే తయారు కాకూడదని కరుణ కుటుంబ సభ్యులు భావించారు. ఈ మేరకు స్టాలిన్, ఆళగిరితో రాయబారాలు జరిపారు. ముఖ్యంగా కరుణ కూతురు సెల్వి ఇందులో ముఖ్య పాత్ర పోషించారు. కాని ఆళగిరి తనకు ప్రధాన కార్యదర్శి పదవి కాని, కోశాధికారి పదవి కాని ఇవ్వాలని పట్టుబడుతున్నారు. అంతేకాదు తన కుమారుడు దురై దయానిధికి మురుస్సోలి ట్రస్ట్ లోనియమించాలని కూడా ఆళగిరి మరో డిమాండ్. ఈ డిమాండ్లన్నింటినీ స్టాలిన్ వద్దకు చేరవేశారు కుటుంబ సభ్యులు. అయితే స్టాలిన్ సీనియర్ నేతలతో సమావేశమై ఆళగిరి డిమాండ్లపై చర్చలు జరిపారు.

అంగీకరించని సీనియర్లు…..

ఆళగిరి కుమారుడికి మురుస్సోలి ట్రస్ట్ లో నియమించేందుకు స్టాలిన్ అంగీకరించినట్లు చెబుతున్నారు. కాని ఆళగిరికి మాత్రం ప్రధానకార్యదర్శి గాని, కోశాధికారి పదవి కాని ఇచ్చేందుకు సముఖంగా లేరు. ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శిగా కరుణానిధికి అత్యంత విశ్వసనీయుడైన అన్బళగన్ ఉన్నారు. ఆయనను తప్పించడం సరికాదని, అలాగే కోశాధికారి పదవి కూడా ఇవ్వలేమని స్టాలిన్ తెగేసి చెప్పినట్లు తెలిసింది. అయితే పార్టీ దక్షిణ ప్రాంత విభాగంలో పనిచేస్తానంటే తనకు ఎటువంటి అభ్యంతరం లేదని ఆయన చెప్పారంటున్నారు.

భవిష్యత్తులో ఇబ్బందులేనని…..

అందుకే ఈరోజు జరిగిన సమావేశంలో స్టాలిన్ ఆళగిరి ప్రస్తావన లేకుండా జాగ్రత్త పడ్డారు. పార్టీలో ఉంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని భావించిన స్టాలిన్ ఆళగిరితో తెగదెంపులకే సిద్ధమయ్యారని తెలుస్తోంది. అయితే కుటుంబ సభ్యుల వత్తిడి కారణంగా కొంత ఆలోచనలో పడినా సీనియర్ నేతలెవ్వరూ ఆళగిరి రాకను స్వాగతించడం లేదు. ప్రస్తుతం ఆళగిరి పార్టీలో లేరని, ఆయన గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని డీఎంకే వర్గాలు అంటున్నాయి. పార్టీ పదవి ఇవ్వకుంటే ఖచ్చితంగా ఆళగిరి పార్టీలో చీలిక తెచ్చే ప్రయత్నంచేస్తారని, అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే జిల్లా నేతలకు స్టాలిన్ నుంచి ఆదేశాలు వెళ్లినట్లు తెలుస్తోంది. మొత్తం మీద డీఎంకేలో వారసత్వ పోరు కొద్దిరోజుల్లోనే వీధికెక్కతుందన్న ప్రచారం జరుగుతోంది.

.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*