స్టాలిన్ స్ట్రాంగ్ అవుతున్నాడే….!

డీఎంకే అధ్యక్ష పదవిని చేపట్టాక స్టాలిన్ కొంత కటువుగానే వ్యవరిస్తున్నారు. దూకుడుగానే ఉండాలన్నది స్టాలిన్ నిర్ణయంగా కన్పిస్తోంది. కరుణానిధి అనుకూలించిన వైఖరినే అవలంబిస్తూ మరోవైపు జయలలిత లాగా ఫాస్ట్ డెసిషన్స్ తీసుకుంటూ వెళ్లాలన్నది స్టాలిన్ వ్యూహంగా ఉంది. కరుణానిధి మరణంతో కుటుంబ విభేదాలు వీధిన పడకుండా స్టాలిన్ కొంత సంయమనంతో వ్యవహరించారన్నది పార్టీ వర్గాల అభిప్రాయం. కరుణానిధి మరణం తర్వాత కుటుంబంలో చీలికలు తప్పవని అందరూ ఊహించారు. ముఖ్యంగా ఆళగిరి విషయంలో ఎక్కువగా కథనాలు కూడా వచ్చాయి. అయినా స్టాలిన్ మాత్రం ఆళగిరిని తప్ప కుటుంబాన్నంతటినీ తనవైపునకు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఆళగిరిని కుటుంబంలో ఒంటరి వాడిని చేశారు.

కుటుంబం మొత్తాన్ని…..

తన సోదరి సెల్వి కొంత ఆళగిరికి అనుకూలంగా ఉన్నప్పటికీ ఆమె మనసు మార్చి, ఆళగిరికి అవకాశమిస్తే భవిష్యత్తులో ఎదురయ్యే ఇబ్బందులన్నీ పూసగుచ్చి చెప్పడంతో సెల్వికూడా మౌనం వహించినట్లు చెబుతున్నారు. ఇక మరో సోదరి కనిమొళి, మారన్ బ్రదర్స్ కూడా స్టాలిన్ వెంటే నడిచారు. తాను డీఎంకే అధ్యక్షుడిగా ఎన్నికవ్వడంతో పాడు కీలకమైన కోశాధికారి పదవిలోనూ తనకు అత్యంత సన్నిహితుడైన దురై మురుగన్ నియమించుకున్నారు. ఈ నేపథ్యంలో ఆళగిరి తనను ఇక ఏమీచేయలేడని, పార్టీ తన చేతుల్లోకి వచ్చిందని స్టాలిన్ భావిస్తున్నారు.

ఆళగిరికి చెక్ పెడుతూనే….

ఆళగిరి ఈ నెల 5వ తేదీన జరిగే ర్యాలీ సక్సెస్ అవ్వదని స్టాలిన్ ధీమాగా ఉన్నారు. కరుణానిధి సమాధి వరకూ ర్యాలీ చేపడుతున్నా, ఎవరూ డీఎంకే నేతలు వెళ్ల కూడదని స్టాలిన్ హుకుం జారీ చేశారు. 5వ తేదీ తర్వాత ఆళగిరి అలజడి పూర్తిగా తగ్గిపోతుందని స్టాలిన్ భావిస్తున్నారు. ఆళగిరి వెంట పాత నేతలు కూడా వెళ్లకుండా ముందు జాగ్రత్తలు పడుతున్నారు. గతంలో డీఎంకే నుంచి బహిష్కరణకు గురైన నేతలను తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. అందరం కలసి వెళితేనే అధికారంలోకి రాగలమన్న ఆలోచనతో పాతనేతలను కూడా కలుపుకుని వెళ్లాలని స్టాలిన్ నిర్ణయించుకున్నారు.

బహిష్కృత నేతలను…..

ఇందులో భాగంగా కరుణానిధి జీవించి ఉన్నప్పుడు బహిష్కరణకు గురైన నేతలు కురుప్పుస్వామి పాండ్యన్, ముల్లైవేందన్ లను తిరిగి పార్టీలోకి చేరుకున్నారు. ముల్లైవేందన్ గతంలో కరుణానిధి మంత్రివర్గంలో మంత్రివర్గ సభ్యులుగా ఉన్నారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నందున అప్పట్లో కరుణానిధి ఆయనను పార్టీ నుంచి బహిష్కరించారు. పాండ్యన్ కూడా డీఎంకే నుంచి బహిష్కరణకు గురై అన్నాడీఎంకేలో చేరారు. జయలలిత మరణం తర్వాత ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చారు. దీంతో ఆయనకు కూడా స్టాలిన్ పార్టీ కండువా కప్పేశారు. బహిష్కృత నేతలందరినీ పార్టీలోకి ఆహ్వానిస్తున్న స్టాలిన్ ఆళగిరి విషయంలో మాత్రం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నెల 5వ తేదీ తర్వాత ఎలాంటి నిర్ణయమైనా తీసుకుంటారోనన్న చర్చ పార్టీలో జరుగుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*