స్టాలిన్…దూరమయిపోతున్నారా?

తమిళనాడు రాజకీయాల్లోనూ వారసత్వం కొనసాగుతోంది. డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి అనారోగ్యం పాలవ్వడం, ఆయన కుర్చీకే పరిమితం కావడంతో పార్టీ బాధ్యతలన్నింటినీ కరుణానిధి కుమారుడు స్టాలిన్ మాత్రమే చూస్తున్నారు. ప్రతిపక్ష నేతగా ఆయన బలం పెంచుకుంటున్నారు. కరుణానిధి కూడా పూర్తి పగ్గాలను స్టాలిన్ కే అప్పగించారు. మరో కుమారుడు ఆళగిరిని దూరం పెట్టారు. ఇప్పుడు పార్టీ మొత్తం స్టాలిన్ చేతుల మీదుగానే నడుస్తోంది. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో గాని, ఆ తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా స్టాలిన్ నాయకత్వంలోనే డీఎంకే వెళుతుంది.

అన్నీ తానే అయి….

అభ్యర్థుల ప్రకటన నుంచి ప్రచారం కార్యక్రమాలను మొత్తం స్టాలిన్ దగ్గరుండి చూసుకుంటున్నారు. జయలలిత మరణం తర్వాత స్టాలిన్ ప్రతిపక్ష పాత్రను విశిష్టంగా పోషిస్తున్నారన్న ప్రశంసలను అందుకుంటున్నారు. తూత్తుకూడి సంఘటన కావచ్చు, జల్లికట్టు సమస్య కావచ్చు…. గవర్నర్ పాలనలో వేలు పెట్టడం పైనా స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే పోరాటాలు చేసింది. ప్రజాసమస్యలపై ఆందోళనలు చేసి జనానికి చేరువయ్యింది. వచ్చేఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్ పార్టీలు కలసి పోటీ చేస్తాయన్నది ఇప్పటి వరకూ ఉన్న పరిస్థితి.

కమల్ కలవడాన్ని…..

మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ మక్కల్ నీది మయ్యమ్ అధ్యక్షుడు, సినీనటుడు కమల్ హాసన్ ను కలవడం డీఎంకే లో చర్చనీయాంశంగా మారింది. డీఎంకేకు తమిళనాడులోని అన్ని నియోజకవర్గాల్లో పటిష్టమైన యంత్రాంగం ఉంది. ప్రతి నియోజకవర్గానికి లీడర్లున్నారు. కమల్ పార్టీతో పొత్తు పెట్టుకుని వెళ్లడం కరెక్ట్ కాదన్నది స్టాలిన్ అభిప్రాయంగా విన్పిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను కమల్, రజనీలు చీల్చుకుంటే తాము లబ్ది పొందవచ్చన్నది స్టాలిన్ వ్యూహంగా కన్పిస్తోంది. అయితే కాంగ్రెస్ ఆలోచన వేరే విధంగా ఉంది.

తాజా పరిణామాలతో….

ఇటు కమల్ హాసన్ తో పాటు అవసరమైతే రజనీని కలుపుకుని వెళ్లాలని రాహుల్ భావిస్తున్నట్లు తమిళనాడులో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. కమల్ హాసన్ తో సోనియా, రాహుల్ భేటీ తర్వాత తాజాగా తమిళ దర్శకుడు పా రంజిత్ కలవడాన్ని కూడా డీఎంకే నిశితంగా గమనిస్తోంది. తమిళ దర్శకుడు పా రంజిత్ దళిత కాన్సెప్ట్స్ తో అనేక సినిమాలు తీశారు. రజనీకాంత్ నటించిన కాలా, కబాలి లకు దర్శకత్వం వహించారు. గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతిచ్చిన జిగ్నేశ్ మేవాని వీరిద్దరి కలియికలో ప్రధాన పాత్ర పోషించినట్లు చెబుతున్నారు. తమిళనాడులోని దళిత ఓటు బ్యాంకును కొల్లగొట్టాలంటే ద్రవిడ పార్టీలను దూరంగా పెట్టాలని రాహుల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పా రంజిత్ ద్వారా రజనీని కూడా తమ కూటమిలోకి ఆహ్వానించాలన్న ఉద్దేశ్యంతో రాహుల్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో స్టాలిన్ కాంగ్రెస్ తో కలసి వెళతారా? లేక మరోదారిచూసుకుంటారా? అన్నది ఆసక్తిగా మారింది. రాహుల్ వేస్తున్న అడుగులు స్టాలిన్ కు ఆగ్రహం తెప్పిస్తున్నాయంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*