స్టాలిన్ కు కలసి వచ్చేలా ఉందే…?

stallindmktamilandu

తమిళనాడు రాజకీయాలు ఎప్పుడు ఏ టర్న్ తీసుకుంటాయో చెప్పలేం. అన్ని పార్టీల్లో నాయకత్వ లేమి స్పష్టంగా కన్పిస్తోంది. కొద్దోగొప్పో ప్రతిపక్షంలో ఉన్న డీఎంకేనే కొంత మెరుగ్గా కన్పిస్తోంది. స్టాలిన్ నాయకత్వంలో కొంత మెరుగైన ఫలితాలు వచ్చే ఎన్నికల్లో వస్తాయని విశ్లేషకులు సయితం అంచనా వేస్తున్నారు. రాజకీయ శూన్యత ఉండటంతో సినీ హీరోలు కమల్ హాసన్, రజనీకాంత్ ల రాజకీయ ప్రవేశం కూడా స్టాలిన్ కు కలసి వస్తుందన్న విశ్లేషణలూ విన్పిస్తున్నాయి. అధికార అన్నాడీఎంకే పార్టీ ఓట్లను ఇటు దినకరన్, అటు రజనీకాంత్, కమల్ హాసన్ ఖచ్చితంగా చీల్చుకుంటే తమదే విజయమన్న ధీమాలో స్టాలిన్ బ్యాచ్ ఉంది.

ఆ ఓటు బ్యాంకుకు చిల్లుపడి….

రజనీకాంత్ ఇంకా పార్టీని ప్రకటించకపోయినప్పటికీ ఆయనకు రెండు కోట్ల సభ్యత్వాన్ని చేర్చాలన్న లక్ష్యంతో ఉన్నారు. ఇటు దినకరన్ కూడా తన పార్టీకి సంబధించి సభ్యత్వాలు కోటిన్నర దాటిందని ఆర్భాటంగా ప్రకటించుకున్నారు. ఇక తమ సభ్యత్వాలేమీ తగ్గలేదని అధికార అన్నాడీఎంకే నేతలు పళనిస్వామి, పన్నీర్ సెల్వంలు చెబుతోంది. కమల్ హాసన్ మాత్రం మక్కల్ నీది మయ్యమ్ లో సభ్యత్వాలు ఇంకా ప్రారంభించకున్నా కొంత దూకుడుగానే ఉన్నారు. ఈ మూడు పార్టీలూ అన్నాడీఎంకే ఓటు బ్యాంకును చీల్చుకుంటాయన్న తమ అంచనా తప్పదంటున్నారు డీఎంకే నేతలు.

ఒంటరిగా కాకుండా….

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో స్టాలిన్ ఒంటరిగా వెళ్లడం లేదు. కాంగ్రెస్ ఇతర పార్టీలతో కలసి మహాకూటమిగా ఎన్నికలకు వెళ్లనున్నారు. దీనికి సంబంధించిన ప్రయత్నాలు ఇప్పటికే ప్రారంభమయ్యారు. వరుసగా రెండు ఎన్నికల్లో ఓటమితో డీఎంకేకు కొంత సానుభూతి ఉందంటున్నారు. గత లోక్ సభ ఎన్నికల్లోనూ ఒక స్థానాన్ని కూడా డీఎంకే కైవసం చేసుకోలేకపోయింది. దీంతో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కనీసం 30 స్థానాలను సాధించాలన్న లక్ష్యంతో స్టాలిన్ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే తరచూ మిత్రులతో కలసి సమావేశం ఏర్పాటు చేసుకుంటూ వ్యూహరచన చేస్తున్నారు.

ఉద్యమ కార్యాచరణను….

ఇటీవల గజ తుఫాను కు కేంద్రం నుంచి సాయం అనుకున్నంత మేర అందకపోవడం, మెకేదాటు ఆనకట్ట వ్యవహారంలో కర్ణాటక వ్యవహరిస్తున్న తీరును ఎండగడుతూ ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ఇలా ప్రజల్లోకి వెళుతూ మళ్లీ పార్టీకి పునరుజ్జీవం తేవాలని స్టాలిన్ ప్రయత్నిస్తున్నారు. మరోవైపు అధికార అన్నాడీఎంకే పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. కేంద్రంతో సఖ్యతతో ఉన్నా గజ తుపాను సాయం సక్రమంగా అందకపోవడంతో ఆ అపవాదును అధికార పార్టీ భరించాల్సి వస్తోంది. ఇవన్నీ కలసి స్టాలిన్ కు కలసి వచ్చే అంశాలుగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*