ఆయనపై అందుకే అంత కక్షా?

దేశ అత్యున్నత న్యాయవ్యవస్థకు, కేంద్ర ప్రభుత్వానికి మధ్య అగ్గి రాజుకుంది. కొలీజియం చేసిన సిఫార్సును వెనక్కు పంపడంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదానికి మూల కారణం ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేఎం జోసెఫ్ పదోన్నతే. జోసెఫ్ పేరును పదోన్నతులతో చేర్చి పంపిన కొలీజియం సిఫార్సును కేంద్ర న్యాయశాఖ వెనక్కు పంపింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఫైలును వెనక్కు పంపడానికి చూపిన కారణాలను కూడా కొలీజియం తప్పుపట్టింది. మరోసారి కెఎం జోసెఫ్ తో పాటు మరికొందరి పేర్లతో కేంద్రానికి పంపాలని కొలీజియం నిర్ణయించడం విశేషం.

కొలీజియం ప్రత్యేకంగా సమావేశమై….

పదోన్నతులపై ప్రత్యేకంగా సమావేశమైన కొలీజియం అసాధారణ నిర్ణయం తీసుకుంది. తాము గత నిర్ణయానికే కట్టుబడి ఉన్నామని తేల్చి చెప్పింది. ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఈ విషయంలో ఏకగ్రీవంగా అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం విశేషం. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని జాస్తి చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్ లు ఈ అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టారు. జస్టిస్ కెఎం జోసెఫ్ కు పదోన్నతి కల్పించాలని కోరుతూ కొలీజియం పంపిన సిఫార్సును కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెనక్కు పంపారు.

ఇవే కారణాలా?

అయితే కేంద్ర ప్రభుత్వం జోసెఫ్ కు పదోన్నతి కల్పించడం విషయంలో కొర్రీలు వేయడానికి అనేక కారణాలున్నాయంటున్నారు. గతంలో జోసెఫ్ ఇచ్చిన తీర్పే కేంద్రం కోపానికి కారణమని చెబుతున్నారు. ఉత్తరాఖండ్ లో గతంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధించింది. అయితే కేంద్రం నిర్ణయాన్ని అప్పట్లో ఉత్తరాఖండ్ హైకోర్టు కొట్టివేసింది. తిరిగి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా హరీశ్ రావత్ కొనసాగాలని తీర్పు చెప్పింది. ఆ సమయంలో తీర్పు చెప్పింది జస్టిస్ కె.ఎం. జోసెఫ్ నేతృత్వంలోని ధర్మాసనమే. ఈ కారణంతోనే కేంద్ర న్యాయశాఖ జోసెఫ్ పదోన్నతికి కొలీజియం చేసిన సిఫార్సును వెనక్కు పంపిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మరోసారి పంపాలని….

ఈ నేపథ్యంలో సమావేశమైన కొలీజియం మరోసారి కెఎం జోసెఫ్ పేరుతో పాటు మరికొందరి పేర్లను ఈ నెల 16న తిరిగి కేంద్రానికి పంపాలని నిర్ణయించింది. ఈసారి కేంద్రం తిరస్కరించే అవకాశం లేదంటున్నారు న్యాయనిపుణులు. అయితే దానిని ఓకే చేయడానికి సమయం తీసుకునే అవకాశముంది. మరి కేంద్ర ప్రభుత్వం ఈసారి ఎలాంటి నిర్ణయం తీసుకుంటోందనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. వెంటనే కొలీజియం సిఫార్సులను ఆమోదిస్తుందా? లేక కాలయాపన చేస్తుందా? అన్నది వేచి చూడాలి. కెఎం జోసెఫ్ పేరుతో ఈ ఏడాది జనవరి 10వ తేదీన కొలీజియం సిఫార్సు చేయగా, ఏప్రిల్ 26న కేంద్ర న్యాయశాఖ దానిని తిప్పి పంపింది. అప్పుడే దాదాపు నాలుగు నెలల సమయం తీసుకుంది. మరి ఇప్పుడు ఎంత సమయం తీసుకుంటుందో.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*