సర్జికల్ స్ట్రైక్స్ అందుకేలాగుంది…..!

తెలంగాణ రాష్ట్రసమితి అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు శంఖారావం పూరించారు. ప్రతిపక్షాలపై సర్జికల్ స్ట్రైక్ చేశారు. వారు ఆయుధాలు సమకూర్చుకుని యుద్దానికి సన్నద్ధం కాకముందే సవాల్ విసిరారు. సమరానికి సై అన్నారు. కాంగ్రెసులో ఇంకా పొత్తులు పొడవలేదు. తెలుగుదేశమూ దీనంగానే ఉంది. భారతీయ జనతాపార్టీ మొక్కుబడి ప్రతిపక్షం. ఎంఐఎం ఎలాగూ మిత్రుడే. సీపీఎం నేతృత్వంలోని బహుజన లెఫ్ట్ ఫ్రంట్, కోదండరామ్ నాయకత్వంలోని తెలంగాణ జనసమితి ఓట్ల చీలికకు ఉపకరించే ఆపద్బాంధవ ప్రత్యర్థులు. ఆయా లెక్కలన్నీ సరిపోలడంతోనే కేసీఆర్ సింహగర్జన చేశారు. సార్వత్రిక ఎన్నికల ముహూర్తం సమీపించేకొద్దీ రాజకీయ అవసరాల కోసం విపక్షాలన్నీ ఒక గూటికి రావచ్చు. అది టీఆర్ఎస్ విజయరథానికి బ్రేకులు వేయవచ్చు. అందుకే ముందస్తు గానం అందుకున్నారు. చివరిక్షణం వరకూ సస్పెన్స్ కొనసాగించి చివరికి తనకు అనుకూలమైన సమయంలో తెరదించేశారు. ఎన్నికలకు వెళ్లరులే అని ఏదో మూలన మిణుకుమిణుకుమంటున్న విపక్షాల ఆశలపై నీళ్లు చిలకరించారు.

కమాన్ ..కాంగ్రెస్…

తన రాజకీయ దురంధరత్వాన్ని కేసీఆర్ చాటిచెప్పారు. ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెసు పార్టీ . అందుకే ముందుగా దానినే టార్గెట్ చేశారు. అవాకులు,చెవాకులతో కాంగ్రెసు పార్టీ తాను చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడుతోందని విరుచుకుపడ్డారు. అసెంబ్లీ రద్దు పాపాన్ని హస్తం పార్టీపై తెలివిగా తోసేశారు. నెహ్రూ నుంచి మొదలుపెట్టి ఇందిర వరకూ ఉతికి ఆరేశారు. సోనియాను కొంతవరకూ క్షమించేశారు. కానీ కాంగ్రెసు నాయకులను మాత్రం కడిగిపారేశారు. మతకల్లోలాలు మొదలు సర్వ అవలక్షణాలకు ఆ పార్టీనాయకులే కారణమంటూ నిందించారు. హస్తం నేతలెప్పుడూ ప్రజల గురించి ఆలోచించిన దాఖలాలే లేవంటూ ద్వజమెత్తారు. మొత్తమ్మీద తన ప్రధాన ప్రత్యర్థిని సరిగ్గానే అంచనా వేయడంతోపాటు బలహీనతలను ఎండగట్టడం ద్వారా టీఆర్ఎస్ ను ఎన్నుకోవాల్సిన అవసరాన్ని అన్యాపదేశంగా గుర్తు చేశారు. కమాన్ కాంగ్రెసు అంటూ ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామని రణన్నినాదం చేశారు.

కమలం కత తెల్వదా…

తెలంగాణ రాష్ట్రసమితికి అనధికార మిత్రపక్షం బీజేపీ. 105 మంది అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు. కానీ బీజేపీ ప్రాతినిధ్య స్థానాలకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కమలం పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న చాలా నియోజకవర్గాలకు మినహాయింపు ఇచ్చారు కేసీఆర్. అక్కడ బలహీనమైన అభ్యర్థులను తర్వాత ప్రకటించవచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. తద్వారా చెప్పకనే తన మనోగతాన్ని వెల్లడించారు. మీడియా ప్రతినిధులు టీఆర్ఎస్ , బీజేపీ సంబంధాలపై ప్రశ్నలు గుప్పించినా చాలా తెలివిగా వాటిని దాటవేశారు. వాళ్ల బలం అందరికీ తెలుసు కదా? అంటూ తేలికగా తీసిపారేస్తున్నట్లుగా ప్రవర్తించారు. వాళ్ల కథ ఎవరికి తెలియదు అంటూనే తీవ్ర విమర్శల జోలికి పోలేదు. భవిష్యత్తులో వ్యూహాత్మక మైత్రి ఉంటుందన్న సంకేతాలు పంపించివేశారు. అందులోనూ ముందస్తు ఎన్నికలు రావాలంటే కేంద్రం కొంతమేరకు సహకరించాల్సి ఉంటుంది. ఇప్పుడు బీజేపీతో వైరం పెట్టుకుని ముందరికాళ్లకు బంధం వేసుకునే తెలివితక్కువ పని కేసీఆర్ చేయరు. అందుకే కమలం పార్టీ ఆయన ఘాటు విమర్శల బాణాల నుంచి తప్పించుకోగలిగింది.

ఆంధ్రా సైకిల్ కి గులామా…

తెలుగుదేశం పార్టీ, కాంగ్రెసు పార్టీ పొత్తు పెట్టుకునే అవకాశాలున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే ఈ రెండు పార్టీల ఓటు బ్యాంకు సంఘటితమవుతుంది. రెడ్డి, ఎస్సీ సామాజిక వర్గాల్లో కాంగ్రెసు పార్టీకి పట్టు ఉంది. వెనకబడిన తరగతుల్లో తెలుగుదేశం పార్టీకి ప్రాబల్యం ఉంది. రాష్ట్రవిభజన తర్వాత టీడీపీ బాగా బలహీన పడింది. కానీ రాజకీయాల్లో ఒకటికి ఒకటి కలిస్తే రెండే కావాలని లేదు. ఇరవై రెండు కూడా కావచ్చు. కాంగ్రెసు,టీడీపీ కలిసి నడిస్తే అదే జరుగుతుందని రాజకీయ వర్గాల అంచనా. అందువల్ల రెండు పార్టీలు బాగా లాభపడతాయి. ‘అసలు ప్రతిపక్షాలు సోదిలో లేవు. తమకు పోటీయే కాదు.’ అన్న భావనలో ఉన్న టీఆర్ఎస్ సైకిల్, హస్తం జత కట్టడాన్ని సహించలేకపోతోంది. అందుకే ఆంధ్రాపార్టీని తెచ్చి మళ్లీ తెలంగాణపై రుద్దుతారా? అంటూ కాంగ్రెసును నిలదీశారు. తద్వారా రెండు రకాల ప్రయోజనాలను కేసీఆర్ ఆశించారు. కాంగ్రెసు, టీడీపీ పొత్తు కట్టకుండా చూడాలనే లక్ష్యం ఒకటైతే, ఒకవేళ వీళ్లు జట్టు కట్టినా ప్రజల్లో పలచనచేయాలనేది మరో లక్ష్యం. మొత్తమ్మీద తన ప్రధాన ప్రత్యర్థులందరినీ ఉద్దేశిస్తూ వ్యూహాత్మక పంథాలో కదులుతున్నారు కేసీఆర్. మరో మూడు నాలుగు నెలల్లోనే అసెంబ్లీ రద్దు నిర్ణయం టీఆర్ఎస్ కు లాభం చేకూర్చిందా? లేక ముందస్తు నిర్ణయం తొందరపాటా? అన్నది తేలిపోనుంది.

 

-ఎడిటోరియల్ డెస్క్