టైమింగ్ కరెక్ట్ కాదేమో….!!

surveys-in-telangana-elections

తెలంగాణ రాష్ట్రాన్ని సర్వేలు పట్టి కుదిపేస్తున్నాయి. బుధవారం తో ప్రచారానికి ఫుల్ స్టాప్. ఇకపై ఏరకమైన అంచనాలు , జోస్యాలు వెల్లడించే అవకాశం ఉండదు. ప్రచారానికీ తావుండదు. ఈసారి సోషల్ మీడియాపై కూడా నిఘా కొనసాగుతోంది. కొత్తగా పోస్టింగులు పెట్టి అభిప్రాయాలను షేర్ చేయడమూ కష్టసాధ్యమే. ఎవరైనా ఫిర్యాదులు చేస్తే ఇబ్బందుల్లో పడతారు. దీనిని దృష్టిలో పెట్టుకునే ప్రజాభిప్రాయాన్ని తమకు అనుకూలంగా మలచుకోవాలని గడచిన రెండు రోజులుగా తీవ్ర ప్రయత్నాలు సాగుతున్నాయి. ఏదోరకంగా తమపార్టీలకు ఎడ్జ్ ఉందని నిరూపించుకోవడమే లక్ష్యంగా సర్వేలను వండి వారుస్తున్నారు. ఈవిషయంలో అధికార టీఆర్ఎస్ చాలా స్పీడు మీద ఉంది. గడచిన మూడు నెలలుగా నిర్వహించిన సర్వేల్లో సెంచరీ కొట్టబోతున్నామంటూ అధికారపార్టీ హడావిడి చేస్తోంది. చివరి క్షణాల్లో మెయిన్ స్ట్రీమ్ మీడియాను వాడుకోవాలని నిర్ణయించుకుంది. దీనికి ప్రతిగా క్రెడిబుల్ సర్వే వ్యవహర్తను రంగంలోకి దింపి కౌంటర్ చేసింది ప్రజాకూటమి. మొత్తమ్మీద ఈ గందరగోళంలో ప్రజాభిప్రాయం ఎలా ఉందన్నది ఎవరికీ అంతుచిక్కని బ్రహ్మపదార్థంగా మారిపోయింది.

ఆధిక్య సర్వే ఆపసోపాలు…

జాతీయ మీడియా సంస్థలు ఇటీవలి కాలంలో చేసిన చాలా సర్వేల్లో అధికారపార్టీ వైపే మొగ్గు చూపించాయి. అయితే శాంప్లింగ్ సైజు చాలా తక్కువగా ఉండటం వీటిలో ప్రధానలోపం. అందులోనూ నమూనా నియోజకవర్గాలను మాత్రమే తీసుకుని ఫలితాలను అంచనా వేశాయి. ఇంటిలిజెన్సు సర్వేలను సైతం టీఆర్ఎస్ ప్రచారంలోకి తెచ్చింది. సర్కారీ కొలువులో ఉన్న ఉద్యోగులు మదింపు చేయడం వల్ల వీటి క్రెడిబిలిటీపై అనుమానాలున్నాయి. అందులోనూ పోలీసులు ప్రభువును మించిన భక్తి ప్రదర్శిస్తారనే వాదన ఎలాగూ ఉంది. దీంతో మధ్యతరగతి, విద్యావర్గాలు వీటిపైనా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన మీడియా ద్వారా అనుమానాలను పటాపంచలు చేయాలని టీఆర్ఎస్ నిశ్చయించుకుంది. పార్టీకి అనుబంధంగా ప్రింట్ , ఎలక్ట్రానిక్ మీడియాలున్నాయి. అయితే వాటి ద్వారా ప్రసారం, ప్రచురణ చేస్తే ప్రజల్లో పెద్దగా విశ్వసనీయత రాదు. దీంతో నంబర్ ఒన్ స్థానంలో కొనసాగుతున్న టీవీ చానల్ ద్వారా ప్రచారం ముగింపునకు వస్తున్న దశలో సర్వే ప్రసారం చేయించగలిగింది అధికారపార్టీ. 119 సీట్లు ఉన్న తెలంగాణలో ఎంఐఎంకు కచ్చితంగా లభించే స్థానాలు తీసివేస్తే మిగిలినవి 112 మాత్రమే. అందులో 104 స్థానాల వరకూ టీఆర్ఎస్ కు వచ్చే అవకాశం ఉందంటూ సర్వే ప్రకటించేశారు. ప్రజాకూటమి, బీజేపీ, ఇండిపెండెంట్లు, బీఎల్ఎఫ్ వంటి పార్టీలకు అన్నిటికీ కలిపి కేవలం ఎనిమిది స్థానాలే వస్తాయని చెప్పడంతో మళ్లీ సర్వేపై అనుమానాలు మొదలయ్యాయి. అదే ఏ ఎనభై స్థానాలకో టీఆర్ఎస్ ను పరిమితం చేసి ఉంటే విశ్వసనీయత పెరిగి ఉండేది. అత్యుత్సాహానికి పోవడంతో అసలుకే మోసం వచ్చింది.

హస్తానికి అభయం…

మీడియా ద్వారా అధికారపార్టీ ప్రజలను ప్రభావితం చేస్తోందని భావించిన కాంగ్రెసు వెంటనే పావులు కదిపింది. సర్వేల నిర్వహణలో గడచిన పదిసంవత్సరాలుగా క్రెడిబిలిటీ సాధించిన లగడపాటి ఫ్లాష్ టీమ్ ను బరిలోకి దింపింది. మూడు నెలలుగా ఈ టీమ్ తెలంగాణలో తిరుగుతోంది. శాంపిల్ సైజు కూడా ఎక్కువగానే తీసుకుంటోంది. నేషనల్ మీడియా అంచనాలు వేసేటప్పడు 15 నుంచి 20 నియోజకవర్గాలను నమూనాగా తీసుకుని అందులో ఒక్కో నియోజకవర్గం నుంచి 100 నుంచి 150 మంది ఓటర్ల పల్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. దానిని ఓవరాల్ రిజల్టుగా రిఫ్లెక్ట్ చేస్తుంటారు. ఈ క్రమంలో చూస్తే లగడపాటి టీం తీసుకునే శాంప్లింగ్ పరిమాణం ఎక్కువనే చెప్పాలి. వెయ్యి నుంచి 1200 వరకూ ప్రతినియోజకవర్గంలోనూ నమూనా సేకరిస్తారు. అందులోనూ తెలంగాణలోని 100 నియోజకవర్గాలలో క్షేత్రస్థాయిలో సర్వే చేయడం ఈ టీమ్ మాటలకు విశ్వసనీయత తెచ్చిపెడుతుంది. అయితే లగడపాటి ఎన్నికల తర్వాత ఏడో తేదీన ఫలితాలను ప్రకటిస్తానని చెప్పారు. ప్రచారం కూడా ముగియకముందే నాలుగోతేదీన పత్రికా విలేఖరుల సమావేశం పెట్టి అంచనాలు చెప్పేయడం అనుమానాలకు తావిస్తోంది. ఇందులో కాంగ్రెసకు కచ్చితమైన ఎడ్జ్ ఉంటుందని తేల్చేశారాయన. ఖమ్మం, ఆదిలాబాద్, రంగారెడ్డి, నల్గొండల్లో కాంగ్రెసు కూటమి ఆధిక్యం సాధిస్తుందని చెప్పేశారు. వరంగల్లు, నిజామాబాద్, మెదక్ లకే టీఆర్ఎస్ ఆధిక్యాన్ని పరిమితం చేశారు. హైదరాబాదు పాతబస్తీ పరిధిలోని జిల్లాలో ఎంఐఎంకు ఇచ్చేశారు. మిగిలిన రెండు జిల్లాలైన కరీంనగర్, మహబూబ్ నగర్ లలో పోటాపోటీ అని సూచనప్రాయంగా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో స్పష్టం చేసేశారు. లగడపాటి చెప్పే వివరాలను పెద్దగా ఎవరూ సవాల్ చేయరు. కానీ టైమింగు మాత్రం అనుమానాలకు, సందేహాలకు తావిస్తోంది. ఏదో ఒత్తిడికి లోనై ఆయన ముందస్తుగా ఫలితాలను చెప్పే సాహసం చేశారని వినవస్తోంది.

అసలు సమస్య అదే…

లగడపాటి సర్వే కొత్త సమస్యలను తెచ్చిపెట్టింది. స్పెక్యులేషన్ చేసేవాళ్లు నూతన సమీకరణలపై అంచనాలు వేయడం మొదలుపెట్టారు. పదిస్థానాల్లో ఇండిపెండెంట్లు గెలుస్తారు. ఎంఐఎం ఏడు స్థానాలను ఎగరేసుకుపోతుంది. బీజేపీ గతం కంటే ఎక్కువసీట్లు , సుమారు ఏడుస్థానాల వరకూ గెలుచుకునే అవకాశాలున్నట్లు సూచనలిచ్చారు. అంటే 24 సీట్లు ఎటైనా మొగ్గే పరిస్థితి ఉంది. రెండు ప్రధాన పార్టీల మధ్య పోటాపోటీ వాతావరణం ఉన్నప్పుడు ఈ స్థానాలే కీలకమవుతాయి. బీజేపీ, ఎంఐఎం పరస్పరం వ్యతిరేకంగా ప్రతిస్పందిస్తుంటాయి. టీఆర్ఎస్ కు ఆయాస్థానాలు కావాల్సి వస్తే ఎంఐఎం, బీజేపీల్లో ఒకదాని మద్దతు మాత్రమే పొందగలుగుతుంది. అదే కాంగ్రెసు కూటమి కి మద్దతు అవసరమైతే ఎంఐఎం ను మచ్చిక చేసుకోగలుగుతుంది తప్పితే బీజేపీ తో కుదరదు. ఈ పరిస్థితుల్లో టీఆర్ఎస్, ప్రజాకూటములు 50 స్థానాల లోపునకు పరిమితమైతే తెలంగాణ రాజకీయముఖచిత్రం చాలా గందరగోళంగా మారే పరిస్థితి కనిపిస్తోంది.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*