ఈసారి గూడెం గుండె గు‘‘బిల్లు’’….!

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా తాడేప‌ల్లిగూడెం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించి వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోరు ర‌స‌వ‌త్త‌రంగా మార‌నుంది. ఇక్క‌డ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పైడికొండ‌ల మాణిక్యాల‌రావుపై పోటీకి ప‌లువురు కీల‌క నాయ‌కులు పోటీ ప‌డుతుండ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌ధానంగా ఇక్క‌డ టీడీపీలో సీనియ‌ర్‌గా ఉన్న య‌ర్రా నారాయ‌ణ‌స్వామి.. ఫ్యామిలీ ఇటీవ‌ల ఆ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. జ‌న‌సేన తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీలో సీనియ‌ర్ మోస్ట్‌గా ఉన్న య‌ర్రా వ‌ర్గం.. అనూహ్య‌మైన నిర్ణ‌యంతో ఇక్క‌డ రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు మార‌నున్నాయి. దివంగ‌త ఎన్టీఆర్ హ‌యాం నుంచి కూడా పార్టీలో చురుగ్గా ఉన్న య‌ర్రా నారాయ‌ణ స్వామి.. అవినీతి ర‌హిత నాయ‌కుడిగా పేరు తెచ్చుకున్నారు.

సొంత పార్టీ అని భావించి…..

అంతేకాదు, పార్టీని త‌న సొంతంగా భావించి మ‌రీ సేవ‌లు అందించారు. అయితే, గ‌త కొన్నాళ్లుగా య‌ర్రాకు పార్టీలో గుర్తింపు త‌గ్గిపోయింది. వ‌య‌సు ప్ర‌భావ‌మే అయి ఉంటే.. ఆయ‌న ఫ్యామిలీని అయినా టీడీపీ ఆద‌రించి ఉండాలి. కానీ, ఏమీ చెప్ప‌కుండా టీడీపీ అధినాయ‌క‌త్వం మౌనం పాటించ‌డంతో య‌ర్రా.. తీవ్ర మ‌న‌స్థాపానికి గుర‌య్యారు. తొలుత ఎన్టీఆర్ వ‌ర్గంగానే ఉన్న‌ప్ప‌టికీ.. మారిన రాజ‌కీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఆయ‌న చంద్ర‌బాబుకు చేరువ అయ్యారు. గ‌తంలో మంత్రిగా కూడా ప‌నిచేశారు. ఇక‌, ఈ పార్టీలో భ‌విష్య‌త్తు లేద‌ని తెలియ‌డంతో య‌ర్రా ఫ్యామిలీ.. తాజాగా జ‌న‌సేనకు జైకొట్టింది. ఈ క్ర‌మంలోనే య‌ర్రా నారాయ‌ణ‌స్వామి త‌నయుడు య‌ర్రా న‌వీన్ తండ్రి కొడుకులు జ‌న‌సేనలో చేరారు.

జనసేన అభ్యర్థిగా…..

వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాడేప‌ల్లిగూడెం జ‌న‌సేన అభ్య‌ర్థిగా న‌వీన్ బ‌రిలో నిల‌వ‌నున్నార‌ని స‌మాచారం. ఇక‌, ఈ మారిన రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌ల నేప‌థ్యంలో తాడేప‌ల్లిగూడెం రాజ‌కీయాలు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ర‌స‌వ‌త్త‌రం కానున్నాయి. ఇక్క‌డ కాపులు ఎక్కువ‌గా ఉండ‌డంతో వీరే నిర్ణాయ‌క శ‌క్తిగా మార‌నున్నారు. బీజేపీ నుంచి ఇప్ప‌టికే సిట్టింగ్ గా ఉన్న పైడికొండ‌ల మాణిక్యాల‌రావుకే మ‌రోసారి టికెట్ ద‌క్కే ఛాన్స్ ఉంది. ఇక‌, వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే కొట్టు స‌త్య‌నారాయ‌ణ బ‌రిలో దిగుతార‌ని అంటున్నా.. ఆయ‌న ఆర్థికంగా వీక్‌గా ఉండ‌డంతో కేంద్ర స‌ర్వీసులకు చెందిన ఓ అధికారిని జ‌గ‌న్ ఇక్క‌డ రంగంలోకి దింపుతారనే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.

టీడీపీ టిక్కెట్ మాత్రం….

ఇక‌, టీడీపీ నుంచి గ‌త ఎన్నిక‌ల్లోనే టికెట్ ఆశించిన‌ జ‌డ్పీ చైర్మ‌న్ ముళ్ల‌పూడి బాపిరాజుకు ద‌క్కుతుంద‌ని అంటున్నా రు. అయితే, ఈయ‌న‌తో పాటు మునిసిప‌ల్ చైర్మ‌న్ బొలిశెట్టి శ్రీనివాస్‌, మాజీ ఎమ్మెల్యే, ప్ర‌స్తుత నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ ఈలి నాని కూడా టికెట్ రేసులో ముందున్నారు. దీంతో ఇక్క‌డ టీడీపీ టికెట్ కోసం ట్ర‌యాంగిల్ ఫైట్ జ‌రుగుతోంది. ఇక బ‌లాబ‌లాల విష‌యానికి వ‌స్తే.. మ‌ళ్లీ ఇక్క‌డ గెలుపు ఎవ‌రికి ద‌క్కుతుందా ? అన్న‌ది మాత్రం ఎన్నిక‌ల వ‌ర‌కు చెప్ప‌లేని ప‌రిస్థితి. 2009లో ప్ర‌జారాజ్యం ఇక్కడ నుంచి గెలిచింది. నాడు జిల్లాలో చిరంజీవి ఓడినా ఇక్క‌డ మాత్రం ప్ర‌జారాజ్యం అభ్య‌ర్థి ఈలి నాని విజ‌యం సాధించారు. నాడు ట్ర‌యాంగిల్ ఫైట్‌లో టీడీపీ మూడో ప్లేస్‌కు ప‌డిపోయింది.

జనసేన గట్టి పోటీ……..

ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ మాజీ మంత్రి పైడికొండ‌ల పోటీ చేసినా బీజేపీ నామ‌మాత్ర‌మే అయ్యే ఛాన్సులు ఉన్నాయి. ప్ర‌స్తుతం ఉన్న పొలిటిక‌ల్ ట్రెండ్‌ను బ‌ట్టి చూస్తే జ‌న‌సేన ఇక్క‌డ గ‌ట్టి పోటీ ఇచ్చే ఛాన్సులు ఉన్నాయి. అంతే కాకుండా జిల్లాలో జ‌న‌సేన గెలిచే తొలిసీటు ఇదే అన్న చ‌ర్చ‌లు కూడా స్టార్ట్ అయ్యాయి. జ‌డ్పీచైర్మ‌న్‌గా ముళ్ల‌పూడి బాపిరాజు చేసిన అభివృద్ధి ప‌నుల‌తో నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ నాలుగేళ్ల‌లో చాలా స్ట్రాంగ్ అయ్యింది. టౌన్‌లో మాత్రం జ‌న‌సేన చాలా బ‌ల‌మైన ప్ర‌భావం చూప‌నుంది. ఇక గూడెం మండ‌లంతో పాటు పెంట‌పాడు మండ‌లాల్లో టీడీపీ బ‌లంగా క‌నిపిస్తోంది. ఏదేమైనా ఇక్క‌డ జ‌న‌సేన నుంచి న‌వీన్ ఎంట్రీతో తాడేప‌ల్లి గూడెం రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మార‌నున్నాయి.