ఇద్దరూ లేరు…ఏలేది ఎవరు?

మొన్న జయలలిత, నిన్న ముత్తువేల్ కరుణానిధి తరలిరాని లోకాలకు వెళ్లిపోయారు. వారి మహాప్రస్థానం ముగిసింది. దీంతో ద్రవిడ రాజకీయాల్లో స్తబ్దత ఏర్పడింది. శూన్యత ఏర్పడింది. వారిద్దరి మరణంతో ఒక శకం ముగిసింది. ఒక తరం కనుమరుగైంది. ఇక తమిళ తెరపై కొత్త పాత్రధారులు కనపడాల్సి ఉంది. అన్ని పాత్రల్లోనూ కొత్తవారే. ప్రధాన పార్టీలైన అన్నాడీఎంకే, డీఎంకే, జాతీయ పార్టీలైన కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ, ఇంకా రాందాస్, వైగో, విజయ్ కాంత్ వంటి చిన్న పార్టీల పరిస్థితి ఎలా ఉండబోతోంది. కమల్ హాసన్, రజనీకాంత్ ల ప్రభావం ఎలా ఉండబోతోంది…? ఇదే అవకాశంగా తీసుకుని కాంగ్రెస్, బీజేపీలు బలపడే ప్రయత్నం చేస్తాయా? తదితర ప్రశ్నలు ఉత్పన్నమవ్వడం సహజం. అన్నింటికీ మించి వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలను పార్టీలు ఎలా ఎదుర్కొనబోతున్నాయన్న ఆసక్తి నెలకొంది. నిజానికి లోక్ సభ ఎన్నికల నాటికి వివిధ పార్టీల పరిస్థితి, పొత్తులపై స్పష్టత ఏర్పడుతుంది. అదే పరిస్థితి కొంతకాలం కొనసాగుతుంది.

అన్నదమ్ముల పోరు…..

డీఎంకే పరంగా చూస్తే కరుణానిధి వారసత్వాన్ని ఆయన కుటుంబం కొనసాగిస్తుందా? అన్నదమ్ములైన ఆళగిరి, స్టాలిన్ ల మధ్య సయోధ్య కుదురుతుందా? అన్నదమ్ముల్లో ఎవరి వారసత్వాన్ని ప్రజలు అంగీకరిస్తారు? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కరుణానిధి ఉన్నప్పుడే కుమారుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. స్టాలిన్ ను తన రాజకీయ వారసుడిగా ప్రకటించిన కరుణ, ఆళగిరిని పార్టీ నుంచి బహిష్కరించారు. చివరికి పార్టీ దక్షిణాది వ్యవహారాల ఇన్ ఛార్జిగా నియమించి మధురై పంపారు. యూపీఏ హయాంలో కేంద్రమంత్రిగా పనిచేసిన ఆళగిరి తమ్ముడు స్టాలిన్ అంటే విపరీతమైన ధ్వేషం. అసూయ. మూడు నెలల్లోనే స్టాలిన్ చనిపోతారంటూ 2014లో ఆళగిరి బహిరంగంగా వ్యాఖ్యానించారు. దీంతో మనస్థాపం చెందిన కరుణానిధి…పెద్దకుమారుడు ఆళగిరిని పార్టీ నుంచి బహిష్కరించారు. ఏ తండ్రి ఇలాంటి వ్యాఖ్యలను సహించడంటూ అప్పట్లో కరుణానిధి ఆవేదన వ్యక్తం చేశారు. ఆళగిరి తప్ప కనిమొళి, దయానిధి మారన్,కళానిధి మారన్ లు స్టాలిన్ కే మద్దతు పలకడం ఖాయం. స్టాలిన్ నాయకత్వ పటిమపై కొన్ని సందేహాలు లేకపోలేదు. తండ్రికి ఉన్నంత ప్రజాకర్షణ శక్తి ఆయనకు లేదన్న వాదన రాజకీయ వర్గాల్లో ఉంది. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారని, పార్టీని ఏకతాటిపై నడపలేరన్న అపవాదు ఉంది. జయలలిత మరణానంతరం అన్నాడీఎంకేలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులను సద్వనియోగం చేసుకోలేక పోయారన్న అభిప్రాయం ఉంది. బలమైన ప్రతిపక్షంగా ఉన్న డీఎంకే అప్పట్లో అన్నాడీఎంకేలో చీలిక తెచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాల్సి ఉంది. ఆ పాటి వ్యూహరచన, నాయకత్వ పటిమ స్టాలిన్ కు కొరవడ్డాయన్న వాదన లేకపోలేదు. ఏది ఏమైనా కరుణ వారసుడు స్టాలిన్ అన్న విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు.

లీడర్ లేకపోవడంతో……

ఎంజీ రామచంద్రన్, జయలలిత వంటి దిగ్గజాలు సారథ్యం వహించిన అన్నాడీఎంకే పరిస్థితి కూడా అనిశ్చితంగా ఉంది. పార్టీకి సరైన నాయకత్వం లేదు. ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మధ్య సఖ్యత లేదు. ఇద్దరికీ ప్రజాకర్షణ శక్తి శూన్యం. మోదీ సూచనలతో ప్రభుత్వం నడుస్తోంది. అధికారికంగా అన్నాడీఎంకే, బీజేపీ మిత్రపక్షాలు. కేంద్రంలో బీజేపీకి మద్దతు ఇస్తోంది. ఆపార్టీ ఎంపీ తంబిదురై లోక్ సభలో డిప్యూటీ స్పీకర్ గా వ్యవహరిస్తున్నారు. మొన్నటి రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికల్లో బీజేపీకే ఆ పార్టీ అండగా నిలిచింది. అసమ్మతి నేత టీటీవీ దినకరన్ తిరిగి పార్టీలోకి వచ్చే అవకాశాలున్నాయి. మొత్తానికి నాయకత్వం లేమి సమస్యను అన్నాడీఎంకే ఎదుర్కొంటోంది. వచ్చే లోక్ సభ ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి.

జాతీయ పార్టీలైనా…..

ద్రవిడ దిగ్గజాల అస్తమయంతో రాష్ట్రంలో బలపడాలని జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు భావిస్తున్నాయి. ఇప్పటి వరకు తమిళనాడులోవాటి పాత్ర పరిమితమే. ఏదో ఒక ద్రవిడ పార్టీ పక్కన నిలబడటమే తప్ప పెద్దగా ప్రజాబలం లేదు. సిద్ధాంతాల బాదరబందీ లేకుండా ఎటు గాలి అనుకూలంగా ఉంటే అటు వెళ్లడమే వాటికి అలవాటుగా మారింది. ద్రవిడ పార్టీలదీ అదే పరిస్థితి. ఏదో ఒక జాతీయ పార్టీతో అవసరాన్ని బట్టి అంటకాగడమే వాటి పనిగా మారింది. ఇప్పటికిప్పుడు రాష్ట్రంలో జాతీయ పార్టీలు బలపడే పరిస్థితి కనపడటం లేదు. కాంగ్రెస్ కు సరైన నాయకత్వం లేదు. ప్రజాకర్షణ గల నాయకులు, పట్టుమని పది మది ఎమ్మెల్యేలు లేరు. చిదంబరం లాంటి నాయకులు ఢిల్లీ రాజకీయాలకే పరిమితం. ప్రస్తుతానికి డీఎంకేతో కలసి ప్రయాణం చేయడం తప్ప మరో ప్రత్యామ్నాయం దానికి లేదు. బీజేపీ పరిస్థితీ ఇంతకన్నా భిన్నంగా లేదు. హిందుత్వ నినాదాలు ద్రవిడనాడులో పనిచేసే పరిస్థితి లేదు. 2014లో గెలిచిన ఒక్క లోక్ సభ స్థానాన్నీ కాపాడుకోవడం దానికి కష్టమే. అన్నాడీఎంకేతోనే అంటకాగే అవకాశమే కనపడుతుంది. అంతకు మించి ప్రస్తుతానికి మరో ప్రత్యామ్నాయం లేదు.

వీరి ప్రభావం పెద్దగా…..

వైగో, రాందాస్, విజయకాంత్ పార్టీల ప్రాధాన్యం పెద్దగా లేదు. కమల్ హాసన్, రజనీకాంత్ పార్టీలు ఏ మేరకు ప్రభావం చూపుతాయన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది. ద్రవిడ దిగ్గజాల లోటును వారు ఏ మేరకు సద్వినియోగం చేసుకోగలరన్న దానిపైనే వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ద్రవిడ పార్టీలను ఢీకొనే శక్తి వారికి ఉందా? వాటిని అధిగమించి ప్రజలకు చేరువయ్యే ఆకర్షణ శక్తి ఈ ఇద్దరు సినిమా హీరోలకు ఉందా? అన్నది ప్రశ్న. కమల్ హాసన్ పార్టీ పెట్టినా ఇంకా పెద్దగా ప్రజల్లోకి వెళ్లలేదు. ఆయన బీజేపీ వ్యతిరేక రాజకీయాలను నడుపుతారని ప్రస్తుతానికి స్పష్టమవుతోంది. ఇక రజనీకాంత్ ప్రకటనలకే పరిమితమయ్యారు తప్ప ముందడుగు వేయలేదు. ఆయన అస్పష్ట వైఖరితో ప్రజల్లో గందరగోళం నెలకొంది. బీజేపీ ఆయన వైపు మొగ్గు చూపే అకాశం ఉందన్న ప్రచారం ఉంది. 2019 ప్రారంభం నాటికి తమిళ రాజకీయంలో ఒకింత స్పష్టత రాగలదు. అప్పటిదాకా ఊహాగానాలకు, వదంతులకు పరిమితం కాక తప్పదు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*