నో..సెంటిమెంట్ …..!

తమిళనాడులో సెంటిమెంట్లు ఎక్కువే. కాని రాజకీయ పార్టీలు మాత్రం ఆ సెంటిమెంట్లను పెద్దగా పట్టించుకోవు. ఏదైనా పార్టీ అభ్యర్థి మరణిస్తే అక్కడ జరిగే ఉప ఎన్నికను ఏకగ్రీవం చేయడం ఆనవాయితీగా వస్తుంది. కాని తమిళనాడులో ఆ పరిస్థితి లేదు. తమిళనాడులో మరో రెండు ఉప ఎన్నికలు జరగనున్నాయి. కరుణానిధి, అన్నాడీఎంకే ఎమ్మెల్యే ఏకే బోస్ మరణంతో తిరుప్పరం కుండ్రం, తిరువారూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరుగుతాయి. అయితే ఈ ఎన్నికలు ఏకగ్రీవం చేసే దిశగా ఏ పార్టీ ఆలోచన చేయడం లేదు. రెండు నియోజకవర్గాల్లో అన్ని పార్టీలూ పోటీ చేసే అవకాశమున్నట్లు జరుగుతున్న సంఘటనలను బట్టి అర్థమవుతోంది.

ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో……

తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉంటూ మరణించిన జయలలిత ఆర్కే నగర్ కు ప్రాతినిధ్యం వహించేవారు. అయితే జయలలిత మరణంతో ఆర్కే నగర్ ఉప ఎన్నిక జరిగితే అన్నాడీఎంకే, డీఎంకేతో పాటుగా స్వతంత్ర అభ్యర్థిగా టీటీవీ దినకరన్ పోటీ చేశారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా పెద్ద సంఖ్యలో పోటీ పడ్డారు. చివరకు టీటీవీ దినకరన్ నే విజయం వరించింది. అయితే అన్నాడీఎంకే రెండుగా చీలిపోయిన నేపథ్యంలో ఇక్కడ ఏకగ్రీవ ఎన్నిక సాధ్యం కాలేదని చెబుతున్నా…..ఒక్కటిగా ఉన్నా డీఎంకే పోటీ చేస్తుందన్నది వాస్తవం.

రెండు ఉప ఎన్నికలు……

ఇద్దరు శాసనసభ్యులు మరణంతో ఏర్పడునున్న ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు అన్ని పార్టీలు రెడీ అవుతున్నాయి. ఇందులో డీఎంకేది ఒక సిట్టింగ్ స్థానం కాగా, అన్నాడీంకే స్థానం మరొకటి. ఈ రెండు స్థానాల్లో రెండు పార్టీలూ పోటీ చేయనున్నాయి. వీరితో పాటు టీటీవీ దినకరన్ కూడా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. రెండు శాసనసభ నియోజకవర్గాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని దినకరన్ ప్రకటించారు. ఈ రెండు స్థానాలే కాదని, వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తమిళనాడులోని 39 పార్లమెంటు స్థానాల్లోనూ, పుదుచ్చేరిలోని మరొక స్థానంలోనూ తమ పార్టీ పోటీ చేస్తుందని దినకరన్ ప్రకటించారు.

దినకరన్ పార్టీ పోటీకి…..

టీటీవీ దినకరన్ ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేశారు. ఇటీవల ఆయన అమ్మా మక్కల్ మున్నేట్ర కళగం పార్టీని స్థాపించారు. చిన్నమ్మ శశికళ సలహాలు, సూచనలతో ఆయన పార్టీని నడుపుతున్నారు. జయలలిత మరణం తర్వాత ఒకే ఒక ఉప ఎన్నిక జరగ్గా అందులో శశికళ వర్గానిదే పై చేయి అయింది. దీంతో మరోసారి తమ సత్తా చూపేందుకు దినకరన్ రెడీ అవుతున్నారు. రెండు నియోజకవర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులు బరిలో ఉంటారని చెబుతున్నారు. మొత్తం మీద త్వరలోనే జరగనున్న రెండు అసెంబ్లీ ఉప ఎన్నికలు ఇటు అధికార పక్షం అన్నాడీఎంకే, అటు ప్రతిపక్షం డీఎంకేకు ప్రతిష్టాత్మకమనే చెప్పాల్సి ఉంటుంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*