“టీ” 20 మ్యాచ్… సిరీస్ ఎవరిదో…?

తమిళనాడు రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేల కేసులో తీర్పు స్పష్టంగా రావడంతో ముఖ్యమంత్రి పళనిస్వామి సర్కార్ ప్రస్తుతానికి గండం నుంచి బయటపడినా ముందు ముందు అనేక సవాళ్లను ఎదుర్కొనాల్సి ఉంటుంది. 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటును మద్రాస్ హైకోర్టు సమర్థించినా అది పళనికి తాత్కాలిక ఊరటమాత్రమేనన్నది విశ్లేషకుల అంచనా. తమిళనాడులో ఉప ఎన్నికలు 20 శాసనసభ నియోజకవర్గాలకు జరగాల్సి ఉంది. ఇవి జరిగితే అందరి భవిష్యత్తు తేలిపోనుంది.

ప్రస్తుతానికి పళనిస్వామి…..

తమిళనాడులో మొత్తం 232 స్థానాలున్నాయి. పళనిస్వామి వర్గంలో 110 మంది ఎమ్మెల్యేలున్నారు. డీఎంకే దాని మిత్ర పక్షాలు కలిపి 97 మంది సభ్యులున్నారు. డీఎంకే 88, కాంగ్రెస్ 8, ఐయూఎంల్ ఒకరు సభ్యులున్నారు. మ్యాజిక్ ఫిగర్ 117 కాగా పళనిస్వామికి 110 మంది మాత్రమే ఉన్నారు. అనర్హత వేటును కోర్టు సమర్థించింది కాబట్టి ఇప్పట్లో బలపరీక్ష జరిగే అవకాశాలు లేవు. ఎందుకంటే ప్రస్తుతమున్న బలాబలాల ప్రకారం పళనిస్వామి సర్కారుకు ఏమాత్రం ఢోకాలేదు. ప్రభుత్వం సాఫీగా సాగిపోవడానికి అవసరమైన సభ్యుల బలం పళనికి ఉంది.

మొత్తం 20 స్థానాలకు…..

అయితే ఏదైనా నియోజకవర్గం ఖాళీ అయితే దానికి ఆరు నెలల్లోగా ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. తమిళనాడులో ఇటీవల మరణించిన కరుణానిధి ప్రాతినిధ్యం వహించిన తిరువారూర్, అన్నాడీఎంకే సభ్యుడు ఎ.కె.బోస్ ప్రాతినిధ్యం వహించిన తిరుపరకుండ్రం నియోజకవర్గంతో పాటు ప్రస్తుతం అనర్హత వేటు పడిన 18 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాలతో కలిపి 20 శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలను నిర్వహించాల్సి ఉంటుంది. ప్రస్తుతం జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఉప ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగే అవకాశముంటుంది. లేకుంటే లోక్ సభ సార్వత్రిక ఎన్నికలతో కలిపి నిర్వహించే వీలుంటుంది. అంటే ఇంకా కొద్ది నెలల్లోనే ఉప ఎన్నికలు తమిళనాడులో తప్పవన్నది ఖాయం.

ఇద్దరికీ పరీక్షే……

ఈ ఉప ఎన్నికలు ఇటు దినకరన్ కు, అటు పళనిస్వామికి సవాలుగా మారనున్నాయి. ఉప ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను అన్నాడీఎంకే పార్టీ కోల్పోయిందంటే ప్రభుత్వం కుప్ప కూలుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. దినకరన్ ఈ నియోజకవర్గాలను చేజార్చుకుంటే ఆయన నాయకత్వంపై అనుమానాలు తలెత్తుతాయి. ఆర్కే నగర్ ఉప ఎన్నికలో భారీ మెజారిటీ సాధించిన దినకరన్ ఈ 18 నియోజకవర్గాల్లో తన అభ్యర్థులను గెలిపించుకోవడం అంత సులువుకాదన్నది విశ్లేషకుల అంచనా. మరోవైపు డీఎంకే అధినేత స్టాలిన్ కూడా ఈ ఉప ఎన్నికల్లో విజయం సాధించేందుకు ప్రయత్నాలు చేస్తారు. ఇలా మరో కొద్ది నెలల్లోనే తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకునే అవకాశముంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*