వీరిద్దరికీ….ఆ ఇద్దరూ…!

తమిళనాడులో అధికార అన్నాడీఎంకే భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారనుందా? పళనిస్వామి, పన్నీర్ సెల్వం నాయకత్వంపై నెమ్మదిగా భ్రమలు తొలగిపోతున్నాయా? అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. తమిళనాడులో జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకే నేతలేని పార్టీగా మారింది. పళనిస్వామి, పన్నీర్ సెల్వం ఉన్నా వారు వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపలేరన్న సంగతి అందరికీ తెలిసిందే. అధికారం ఉంది కాబట్టి ఇప్పుడు వారి వెంట నేతలైనా కార్యకర్తలైనా ఉంటున్నారు. ఎన్నికల సమయానికి వారి వెంట ఉండేది ఎవరనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

రెండుగా చీలిపోయి….

జయలలిత మరణం తర్వాత అధికార అన్నాడీఎంకే రెండుగా చీలిపోయింది. పళనిస్వామి, పన్నీర్ సెల్వం ఏకమై శశికళ కుటుంబాన్ని పార్టీ నుంచి బయటకు పంపించివేశారు. శశికళ మేనల్లుడు దినకరన్, సోదరుడు దివాకరన్ వేర్వేరు పార్టీలు పెట్టుకుని ముందుకు వెళుతున్నారు. పార్టీ సభ్యత్వాలను చేర్చడంలో వారు బిజీగా ఉంటున్నారు. జయలలిత మరణం ముందు వరకూ అన్నాడీఎంకే తిరుగులేని పార్టీగా ఉండేది. ఆ పార్టీకి కోటిన్నర మంది సభ్యులున్నారు. అయితే జయ మరణం తర్వాత అన్నాడీఎంకే నేతలు సభ్యత్వాన్ని రెండుకోట్లకు పెంచాలని నిర్ణయించారు. కాని ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న వారిని నిలబెట్టుకోవడమూ ఆ పార్టీకి సవాల్ గా మారింది.

సభ్యులు ఇతర పార్టీల్లోకి…..

ఇటీవల అన్నాడీఎంకే పార్టీ అగ్రనేతలు పళనిస్వామి, పన్నీర్ సెల్వంలు కలసి పార్టీ సభ్యత్వాన్ని రెండు కోట్లకు పెంచాలని నిర్ణయించారు. ఈ మేరకు జిల్లాల వారీగా లక్ష్యాలను కూడా నిర్దేశించారు. కాని అనుకున్న లక్ష్యాన్ని చేరకపోగా, ఉన్న సభ్యులు కూడా ఇతర పార్టీల వైపు వెళుతున్నట్లు సమాచారం అందడంతో వారిలో ఆందోళన ప్రారంభమైంది. ముఖ్యంగా తమిళనాడులో కొత్తగా వచ్చిన రజనీకాంత్ పార్టీ వైపు ఎక్కువ మంది యువత మొగ్గు చూపుతున్నారు. రజనీకాంత్ ఇప్పటికే తన పార్టీ సభ్యత్వాలను చేర్పించే ప్రక్రియను ప్రారంభించారు.

రజనీ, కమల్ ప్రభావం…..

రజనీకాంత పక్కాగా ముందుకు వెళుతున్నారు. ప్రతి వీధిలో పదిమంది సభ్యులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. రజనీ ప్రజా ఫోరం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తోంది. వీరికి రజనీ కొన్ని టార్గెట్లు కూడా పెట్టారు. పార్టీ ప్రకటించేనాటికి కోటిన్నర మంది సభ్యులుండాలని, ఎన్నికల నాటికి అది రెండు కోట్లకు చేరాలన్నది రజనీ లక్ష్యం. దీంతో రజనీ పార్టీ వైపు ఎక్కువమంది అధికార పార్టీకి చెందిన సభ్యులు వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. అలాగే మక్కల్ నీది మయ్యమ్ పార్టీని స్థాపించిన కమల్ హాసన్ కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ పార్టీలోకి కూడా కొందరు అన్నాడీఎంకే సభ్యులు వెళుతున్నారు. దీంతో అన్నాడీఎంకేలో ఆందోళన ప్రారంభమైంది. మొత్తం మీద తమిళనాడులోని అధికార పార్టీ అన్నాడీఎంకే క్యాడర్ ను కమల్, రజనీలు కొల్లగొడుతున్నట్లు కనపడుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*