ముదిరి పాకాన పడిందే….!!

tamilnadu politics in loksabha elections

తమిళనాడులో రాజకీయాలు వేడెక్కాయి. సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలని అన్ని పార్టీలూ తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నాయి. ప్రతిపక్ష డీఎంకే పార్టీకి అనుకూల వాతావరణం ఉందని విశ్లేషణలు వెలువడుతున్న నేపథ్యంలో అధికార అన్నాడీఎంకే కూడా ఎన్నికలకు సమాయత్తమవుతున్నట్లే కన్పిస్తోంది. నిన్న మొన్నటి వరకూ భారతీయ జనతా పార్టీకి దగ్గరగా ఉన్న అధికార అన్నాడీఎంకే ఇప్పుడు దూరం జరిగే కార్యక్రమాన్ని జోరుగా చేస్తోంది. అన్నాడీఎంకే ఓటు బ్యాంకు చీలిపోకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటుంది. ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలు వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను గెలుచుకునే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.

అన్నాడీఎంకే కు ప్రతిష్టాత్మకం….

జయలలిత మరణానంతరం వాస్తవానికి తమిళనాడులో రాజకీయ శూన్యత ఏర్పడింది. పళనిస్వామి, పన్నీర్ సెల్వంలు కలసిపోయినప్పటికీ జయ ఓటు బ్యాంకుపై అనుమానాలు వారిపైనా లేకపోలేదు. జయలలితకున్న సమర్థత, ఛరిష్మా తమకు లేదన్నది వారికి తెలియంది కాదు. అయినా లోక్ సభ ఎన్నికల్లో విజయం సాధిస్తేనే పార్టీకి మనుగడ ఉంటుంది. అందుకోసమే ఇటీవల బీజేపీకి దూరం జరుగుతున్నారు. రాఫెల్, అగ్రవర్ణాల రిజర్వేషన్ల విషయంలో బీజేపీకి వ్యతిరేకంగా అన్నాడీఎంకే ఉభయ సభల్లో మాట్లాడటాన్ని ఆ కోణంలోనే చూడాల్సి ఉంటుంది.

స్టాలిన్ కొత్త ఎత్తుగడ…..

మరోవైపు డీఎంకే అధినేత స్టాలిన్ అన్నాడీఎంకేను బలహీన పర్చాలని అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. జయలలిత మరణం మిస్టరీ ఇంకా వీడలేదు. రాష్ట్ర ప్రజల్లో అమ్మ మరణంపై అనేక అనుమానాలున్నాయి. పళనిస్వామి ప్రభుత్వందీనిపై విచారణకు ఆదేశించినా అది ప్రభుత్వ అనుకూలంగానే ఉంటుందన్న ప్రచారాన్ని డీఎంకే జోరుగా తీసుకెళుతుంది. అంతేకాదు తాము అధికారంలోకి వస్తే జయలలిత మరణంపై మిస్టరీని తొలగిస్తామని సాక్షాత్తూ స్టాలిన్ ప్రకటించడం ప్రాధాన్యత సంతరించకుంది.

కూటములపై దృష్టి…..

ఈ ప్రకటన వెనక అమ్మ అభిమానులు తమవైపునకు తిప్పుకునేందుకే స్టాలిన్ ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తున్నారన్నది వాస్తవం. అన్నడీఎంకేను ఇరుకున పెట్టడానికే జయలలిత మరణాన్ని ఈ ఎన్నికల్లో ప్రధాన అస్త్రంగా స్టాలిన్ ఎంచుకున్నారు. ఇలా డీఎంకే వ్యూహరచన చేస్తుండగా దినకరన్ పార్టీని కలుపుకునే ప్రయత్నాలను అన్నాడీఎంకే చేస్తోంది. కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యమ్ పార్టీ కూడా పొత్తుకుసిద్ధమయింది. కాంగ్రెస్ కూటమిలో చేరే అవకాశాలు కన్పిస్తున్నాయి. మొత్తం మీద తమిళ రాజకీయాలు ఎత్తుకు పైఎత్తులుగా మారి రోజుకో మలుపులు తిరుగుతున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*