బావ సెంటిమెంట్‌ బావ‌మ‌రిదికీ వ‌ర్తిస్తుందా!

వారిద్ద‌రూ బంధువులు! మేన‌ల్లుడు మేన‌మామ‌.. అంతేగాక బావ బావ‌మ‌రుదులు!! ఒక‌రు అధికార ప‌క్షంలో ఉంటే.. మ‌రొక‌రు ప్ర‌తిప‌క్షంలో ఉన్నారు! ఇంకో ఆస‌క్తిక‌ర విష‌య‌మేంటంటే.. ఇద్ద‌రూ ఒకే నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలోకి దిగారు. వచ్చే ఎన్నిక‌ల్లోనూ వీరిద్ద‌రే త‌ల‌ప‌డ‌తారనే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి! ఇందులో మేన‌మామ సెంటిమెంట్ మేన‌ల్లుడికి కూడా వర్తిస్తుందా ? లేదా మేన‌ల్లుడు ఆ సెంటిమెంట్ చిత్తు చేస్తాడా ? అన్న చ‌ర్చ‌లు ఇప్పుడు న‌డుస్తున్నాయి.

సెంటిమెంట్ గెలుస్తుందా?

తెలుగు నేల‌పై అన్నింట్లోనూ సెంటిమెంట్లే. ఇక రాజ‌కీయాల్లో సెంటిమెంట్లకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంద‌నే విష‌యం తెలిసిందే! మ‌రీ ముఖ్యంగా కొన్ని ప‌ద‌వులు నిర్వ‌హించిన వారు మ‌ళ్లీ.. రాజ‌కీయాల్లో గెలుపొందిన దాఖ‌లాలు క‌నిపించ‌లేదు. ఇప్పుడు వీరిద్ద‌రి విష‌యంలోనూ ఇదే సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అవుతుందేమోన‌ని అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. మేన‌మామ‌కు ఎదురైన సెంటిమెంట్‌.. మేన‌ల్లుడు కూడా వ‌ర్తిస్తుందా? అనే ప్ర‌శ్న వినిపిస్తోంది!!

కూన పరిస్థితి ఏంటి?

శ్రీకాకుళం జిల్లా ఆముదాల‌వ‌ల‌స నుంచి టీడీపీ త‌ర‌పున తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీ విప్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న కూన రవికుమార్‌ మళ్లీ ఎన్నికల్లో విజయం సాధించి సంచలనం సృష్టిస్తారా? ఓడిపోయి..సెంటిమెంట్‌ను నిజం చేస్తారా? అనే సందేహాలు టీడీపీ నాయ‌కుల్లో అధిక‌మ‌వుతున్నాయి. ఆమ‌దాల‌వ‌ల‌స నియోజ‌క‌వ‌ర్గం నుంచి గెలుపొందిన ఆయ‌న‌.. సీనియ‌ర్ నాయ‌కుడు త‌మ్మినేని సీతారామ్‌పై 5వేల ఓట్ల‌తో విజ‌యం సాధించారు.

దగ్గర బంధువులైనా….

విచిత్రమేమిటంటే కోన రవికుమార్‌.. తమ్మినేని కి మేనల్లుడే కాదు. .స్వయానా ఆయన భార్యకు తమ్ముడు. అతి దగ్గరి బంధువులైన వీరిద్దరూ కల‌సిమెలసి రాజకీయాలు నడవగా ప్రస్తుతం వీరిద్దరూ విరోధులుగా ఉన్నారు. 1983, 85ల్లో ఆమదాలవలస ఎమ్మెల్యేగా విజయం సాధించిన మాజీ మంత్రి తమ్మినేని సీతారాం నాలుగున్నరేళ్లకు పైగా అసెంబ్లీ విప్‌ పదవి నిర్వహించి 1989లో ఓడిపోయారు. అసెంబ్లీ విప్‌ పదవి నిర్వహించారు కనుకే ఆయన ఓడిపోయార‌నే అభిప్రాయం ఇప్పుడు అప్పుడు అంద‌రిలోనూ నెల‌కొంది.

ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి…..

అయితే తెలుగు రాజ‌కీయాల్లో విప్ ప‌ద‌వి నిర్వ‌హించిన వారు ఆ త‌ర్వాత ఎన్నిక‌ల్లో ఓడిపోవ‌డంతో ఇదో బ్యాడ్ సెంటిమెంట్‌గా ముద్ర‌ప‌డిపోయింది. 1989లో సీతారం ఓడిపోవ‌డంతో ఆయనకు ఆ పదవి కలసి రాలేదని ఆయన అనుచరులు బాధ‌ప‌డేవారు. కానీ 1989లో ఓడిపోయినా 1991లో జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ సీనియర్‌ రాజకీయవేత్త కీ.శే.బొడ్డేపల్లి రాజగోపాల్‌పై విజయం సాధించి తమ్మినేని సంచలనం సృష్టించారు. కాంగ్రెస్‌ వ్యతిరేక రాజకీయ నాయకునిగా పేరున్న తమ్మినేని 2009 ఎన్నికలకు ముందు ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయగా ఘోరంగా ఓడిపోయారు.

వైసీపీ గాలి వీస్తుందని…..

2009 ఎన్నికల్లో ఆయన మూడోస్థానానికి పరిమిత మయ్యారు. 2014లో టీడీపీ అభ్యర్థిగా కూన ర‌వికుమార్ పోటీచేయ‌గా వైసీపీ అభ్యర్థిగా మేనమామ తమ్మినేని రంగంలోకి దిగారు. మేన‌మామ‌పై మేన‌ల్లుడు ఐదువేల తేడాతో గెలుపొందారు. తాను అసెంబ్లీ విప్‌గా ఓడిపోయానని తన ప్రత్యర్థి మేనల్లుడు రవికుమార్‌ విప్‌గా ఉన్నారని ఆయన‌ కూడా తనలానే ఓడిపోతారనే నమ్మకం తమ్మినేనిలో వ్య‌క్త‌మ‌వుతోంద‌ట‌. ప్ర‌స్తుతం ప్ర‌భుత్వ అవినీతితో పాటు.. వైసీపీ గాలి కూడా త‌న విజ‌యానికి తోడ‌వుతుంద‌ని ఆయ‌న భావిస్తున్నార‌ట‌. వీటికి తోడు ఈ సెంటిమెంట్ కూడా త‌న‌కు క‌ల‌సి వ‌స్తుంద‌ని న‌మ్ముతున్నార‌ట‌. తమ్మినేనికి ఎదురైన సెంటిమెంట్‌ను రవికుమార్ బీట్ చేస్తారో లేదో వేచిచూడాల్సిందే!!

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*