తుమ్మలకు ఊపిరాడనివ్వకుండా….?

target-tummala-nageswarrao-chandrababunaidu

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ను టార్గెట్ చేసుకుని ఖమ్మం జిల్లాలో ఆయన అనుచరులందరినీ తమ వైపు లాక్కునే ప్రయత్నాలు మొదలు పెట్టారు. చంద్రబాబుకు కూకట్ పల్లిలో హరికృష్ణ కుమార్తె గెలుపు ఎంత ముఖ్యమో… ఖమ్మం నియోజకవర్గంలో నామా నాగేశ్వరరావు గెలుపు కూడా అంతే ముఖ్యం. ఇప్పటికే ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు బడాన్ బేగ్ పార్టీని వీడారు. ఆయన తెలుగుదేశంపార్టీలో చేరుతున్నారు. ఖమ్మం పట్టణంలో దాదాపు 30 వేల ముస్లిం సామాజిక వర్గం ఓట్లు ఉండటంతో టీఆర్ఎస్ కు ఆయన పార్టీ మారడం గట్టి దెబ్బేనంటున్నారు.

మానసికంగా దెబ్బకొట్టేందుకే…..

తెలుగుదేశం పార్టీ నుంచి 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలయిన తుమ్మల నాగేశ్వరరావు తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరి ఎమ్మెల్సీ అయి మంత్రి కూడా అయ్యారు. ఆయన తర్వాత పాలేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ఈ పరిస్థితుల్లో ఎన్నికల సమయంలో తుమ్మలను మానసికంగా దెబ్బతీసేందుకు పెద్దయెత్తున చంద్రబాబు వ్యూహరచన చేస్తున్నట్లు సమాచారం. తుమ్మల అనుచరులను ఒక్కొక్కరిగా పార్టీని వీడేలా చేసి ఎన్నికల వేళ వారిని ఊపిరి సలపనీయకుండా చేయాలన్నది ముఖ్య ఉద్దేశ్యంగా కన్పిస్తోంది.

మరికొందరు టీఆర్ఎస్ ను…..

బడాన్ బేగ్ ను తుమ్మల ఎంత బతిమాలినా వీలుకాలేదు. ఇప్పుడు మరికొందరు తుమ్మల అనుచరులు త్వరలోనే టీఆర్ఎస్ ను వీడి కొందరు కాంగ్రెస్, మరికొందరు టీడీపీలో చేరే అవకాశాలున్నాయని స్పష్టంగా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం డీసీసీబీ ఛైర్మన్ మువ్వా విజయ్ బాబు, జడ్పీ ఛైర్మన్ కవితతో పాటుగా ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, పాలేరులో తుమ్మల అనుచరుడిగా పేరొందిన నూకల నరేష్ రెడ్డి కూడా త్వరలో పార్టీని వీడుతున్నారని తెలుస్తోంది. వీరితో పాటు ఖమ్మం కార్పొరేషన్ లో పది మందికి పైగానే కార్పొరేటర్లు టీఆర్ఎస్ ను వీడే అవకాశం ఉందని సమాచారం. మొత్తం మీద తుమ్మలను వీక్ చేయడానికి పొరుగురాష్ట్రంలో ఉన్న చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాల్సి ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*