ద‌శాబ్దాల వైరానికి రాంరాం…ఆ రెండు పార్టీల పొత్తు..!

జాతి వైరం అన‌ద‌గిన స్థాయిలో కొన‌సాగిన విభేదాల‌కు జాతీయ పార్టీ కాంగ్రెస్‌, ఏపీ తెలుగువారి ఆత్మ‌గౌరవ పార్టీ టీడీపీ చెల్లు చీటీ చెప్ప‌నున్నాయా? త్వ‌ర‌లోనే ఈ రెండు పార్టీలూ చేతులు క‌ల‌పనున్నాయా? వ‌చ్చే అసెంబ్లీ, లోక్‌స‌భ ఎన్నిక‌ల‌ను దృష్టిలో ఉంచుకుని ఈ రెండు పార్టీలూ ఒక తాటిపైకి చేర‌నున్నాయా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వ‌స్తోంది. విష‌యంలోకి వెళ్తే.. తెలంగాణ‌లో ఇప్పుడు రాజ‌కీయంగా అనూహ్య‌మైన ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. అధికార టీఆర్ ఎస్ ను గ‌ద్దె దింపేందుకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోంది.

వ్యూహాత్మకంగా అడుగులు…..

ఈ క్ర‌మంలో అందివ‌చ్చిన అన్ని అవ‌కాశాల‌నూ వినియోగించుకుంటోంది. వాస్త‌వానికి 2014లో రాష్ట్ర విభ‌జ‌న చేయ‌డానికి ఉన్న ప్ర‌త్యేక‌మైన రీజ‌న్ ల‌లో తెలంగాణ‌లో స్థిర‌ప‌డ‌డం ఒక‌టి. అయితే, ఇప్పుడు టీఆర్ ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్ వ్యూహ ప్ర‌తివ్యూహాలు, ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునే విధానాల ముందు కాంగ్రెస్ తీవ్రంగా ఇబ్బంది ప‌డుతోంది. దీంతో తెలంగాణ కాంగ్రెస్ మ‌రింత వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తూ.. ఇత‌ర పార్టీల నేత‌ల‌ను త‌న పార్టీలోకి చేర్చుకు నేందుకు ఇప్ప‌టికే ద్వారాలు తెరిచింది. వ‌చ్చిన వారిని వ‌చ్చిన‌ట్టు పార్టీలో చేర్చుకుంటున్నారు.

టీడీపీతో పొత్తుకు సై…..

అయిన‌ప్ప‌టికీ.. కేసీఆర్‌ను ఢీకొట్టేందుకు ఈ వ్యూహం ఒక్క‌టి స‌రిపోద‌ని గ్ర‌హించిన నేత‌లు.. తెలంగాణ‌లోని ఆంధ్రుల‌ను ఆక‌ర్షించేలా ఏపీ టీడీపీ మూలాలున్న స్థానాల‌పై దృష్టి పెట్టింది. ఈ క్ర‌మంలో అవ‌స‌ర‌మైతే.. టీడీపీతో పొత్తుకు కూడా సై అంటోంది. జాతి వైరాన్ని సైతం ప‌క్క‌కు పెట్టాల‌ని నిర్ణ‌యించింది. ఇదే విష‌యాన్ని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి స్ప‌ష్టం చేశారు. టీడీపీతో కలసి పనిచేయటానికి తాము రెడీగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో తామిద్దరం కలసి పనిచేస్తే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న 25 సీట్ల మేర ప్రయోజనం పొందవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

మోడీకి దూరమయినందున….

టీడీపీ ప్రస్తుతం మోడీ వైఖ‌రిని నిర‌సిస్తూ.. ఎన్డీయేకు దూరం అయినందున కాంగ్రెస్ తో కలసి వస్తుందని భావిస్తు న్నట్లు మ‌ల్లు పేర్కొన్నారు. అయితే పొత్తుపై అంతిమ నిర్ణయం మాత్రం అధిష్టానానిదే అని తెలిపారు. గత కొన్ని రోజులుగా తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కు చేరువవుతుందని ప్రచారం జరుగుతున్న తరుణంలో మల్లు రవి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకుంది. వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో కూడా టీడీపీ, కాంగ్రెస్ తో జత కడుతుందని ప్రచారం జరుగుతోంది. ఎలాగూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రత్యేక హోదాకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు కనుక..ఈ అస్త్రాన్ని సాకుగా చూపి టీడీపీ కాంగ్రెస్ తో ముందుకు సాగే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఆ ఓటు బ్యాంకు జత కలిస్తే…..

తెలంగాణలో కూడా అదే తరహాలో టీడీపీ ఓటు బ్యాంకు కాంగ్రెస్ కు జత కలిస్తే ఆ పార్టీ ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందని ‘లెక్కలు’ వేసుకుంటున్నారు. ఈ అంశాలపై అంతర్గతంగా చర్చ సాగుతోంది. ఇటీవల సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరితో రహస్య భేటీ జరిపినట్లు అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. ప్రస్తుతం ఏపీలో చంద్రబాబుతో కలసి వచ్చే పార్టీ ఒక్కటి కూడా లేదు. ఏ మాత్రం ఛాన్స్ ఉన్నా…అది కాంగ్రెస్ తోనే. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు రెండు శాతం ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం అది కాస్తా నాలుగు నుంచి ఐదు శాతానికి చేరి ఉంటుందని అంచనా. కాంగ్రెస్ తో పొత్తు వల్ల ఆ మేరకు ప్రయోజనం ఉంటుందనే అభిప్రాయంతో టీడీపీ అధిష్టానం యోచిస్తున్నట్లు సమాచారం. ఈ ఇరు పార్టీల మ‌ధ్య పొత్తు పొడిస్తే.. రాజ‌కీయంగా సంచ‌ల‌న‌మే అవుతుంద‌న‌డంలో సందేహం లేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*