ఆ టీడీపీ ఎమ్మెల్యే వైసీపీలోకి జంప్‌…!

ఏపీ అధికార పార్టీ టీడీపీకి గ‌ట్టి షాక్ త‌గ‌నుందా? ఆ పార్టీ ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లాకు చెందిన కొండ‌పి శాస‌న‌సభ స‌భ్యుడు శ్రీ బాల‌వీరాంజ‌నేయ‌స్వామి.. సీఎం చంద్రబాబుకు గ‌ట్టి షాక్ ఇవ్వనున్నారా ? అంటే ప్రకాశం జిల్లా రాజ‌కీయాల్లో అవున‌నే చ‌ర్చ న‌డుస్తోంది. త్వర‌లోనే ఆయ‌న వైసీపీ గూటికి చేరుతున్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో వైసీపీ సీనియర్‌ నాయకుడు జూపూడి ప్రభాకర్‌రావుపై 5440 ఓట్ల తేడాతో గెలుపొందిన బాలవీరాంజనేయస్వామి గెలుపొందిన త‌ర్వాత త‌న ప‌నులు తానే చూసుకుంటున్నాడ‌ని, ప్రజ‌ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌నే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో గెలుపొందిన తరువాత ఆయన నియోజకవర్గంలోని కార్యకర్తలకు, నాయకులకు దూరమయ్యారు. ఎవ‌రినీ ఆయ‌న ప‌ట్టించుకోలేద‌నే వ్యాఖ్యలు కూడా వినిపించాయి. అంతేకాదు, ఎవరైతే.. తన గెలుపు కోసం సహకరించారో.. వారినే.. ఆయన గత నాలుగేళ్లుగా దూరం పెడుతున్నారు.

ఓ వర్గాన్ని పట్టించుకోక పోవడంతో….

స్వంత సొమ్ములు ఖర్చు చేసుకుని పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసిన ఓ వర్గాన్ని స్వామి పట్టించుకోవడం లేదని నేత‌లు బ‌హిరంగంగానే విమ‌ర్శిస్తున్నారు. అదే సమయంలో తనకు ప్రత్యర్థులుగా పనిచేసిన వైసీపీ నేత‌ల‌తో ఆయ‌న అంట‌కాగుతున్నార‌న్న విమ‌ర్శలు టీడీపీ నుంచి ఉన్నాయి. అంతే కాదు.. కొంత మంది టీడీపీ కార్యకర్తలు పార్టీ వదిలి వెళ్లేలా…ఆయన వ్యవహరించారని, పొమ్మనకుండా పొగపెట్టార‌ని కూడా కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. దీంతో…నియోజక వర్గంపై స్వామి పట్టుకోల్పో యిన.. ఆయనకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్‌ ఇచ్చేది లేదని అధిష్టానం పరోక్షంగా చెబుతోందట. దీంతో…టీడీపీలో ఉంటే పార్టీ టిక్కెట్‌ ఇవ్వరని భావించిన ఆయన.. వైసీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట.

జగన్ ను కలిసి……

టీడీపీతో తెగతెంపులు చేసుకోవాలని భావిస్తున్న స్వామి ఇంతకు ముందే వైసీపీ అధినేత జగన్‌ను రహస్యంగా కలిశారని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. త్వరలో టీడీపీని వదలి వైసీపీలో చేరేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకున్నార‌ని తెలుస్తోంది. ఆయనతో పాటు.. ఆయన తమ్ముడు కూడా పార్టీ మారతారని తెలుస్తోంది. వీరు కాకుండా.. . టీడీపీలో అసంతృప్తిగా ఉన్న సీనియర్‌ నాయకుడు, ఎమ్మెల్సీ ఒకరు పార్టీ మారతారని ప్రకాశం జిల్లా నాయకులు చెబుతున్నారు. నిజానికి టీడీపీ ఆవిర్భావించిన తరువాత కొండపి నియోజకవర్గంలో కాంగ్రెస్‌, టీడీపీలు సమానంగా ఆదరించారు. ఇక్కడ చెరో మూడుసార్లు ఆ పార్టీలు విజయం సాధించాయి. గత ఎన్నికల్లో వైకాపా, టీడీపీల మధ్య హోరాహోరీగా పోటీ జరిగింది. టీడీపీ తరుఫున స్వామి, వైసీపీ తరుపున జూపూడి పోటీ చేశారు.

అనూహ్య రీతిలో గెలిచి…..

అయితే, ఇక్కడ స్వామి అనూహ్య రీతిలో గెలిచారు. కానీ, ఆయ‌న ఎక్కడా కూడా పార్టీని ప్రజల్లోకి బ‌లంగా తీసుకు వెళ్లిన దాఖ‌లా ఎక్కడా క‌నిపించ‌డం లేదు. పైగా త‌న వ్యాపారాలు, త‌న వ్యవ‌హారాల‌తోనే కాలం వెళ్లదీశారు., ఫ‌లితంగా ఇప్పుడు ఆయ‌నకు అక్కడ ప్రజాబ‌లం స‌న్నగిల్లింది. అంతేకాదు, వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న టికెట్ ఇచ్చినా గెలిచే ఛాన్స్ లేద‌ని ఇప్పటికే టీడీపీ నేత‌లు ఓ నిర్ణయానికి వ‌చ్చారు. దీంతోనే ఆయ‌న‌కు వ్యతిరేకంగా చంద్రబాబుకు ఇప్పటికే ఓ వ‌ర్గం ఫిర్యాదులు కూడా చేసింది. దీంతో స్వామి త‌న దారి తాను చూసుకునేందుకు రెడీ అయ్యార‌ని, ఈ క్రమంలోనే వైసీపీ టికెట్ కోసం ముమ్మరంగా ప్రయ‌త్నాలు చేస్తున్నార‌ని అంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

అస‌లు చిక్కు ఏంటంటే….

కొండ‌పి ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఒంగోలు ఎమ్మెల్యే దామ‌చ‌ర్ల జ‌నార్థన్ సొంత నియోజ‌క‌వ‌ర్గం. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ప్రస్తుతం జ‌నార్థన్ సోద‌రుడి హ‌వానే న‌డుస్తోంది. కొద్ది రోజుల క్రితం వ‌ర‌కు ఒంగోలులో హ‌వా న‌డిపించిన ఆయ‌న ఇప్పుడు కొండ‌పిలో దూసుకు వెళుతున్నారు. ఇంకా చెప్పాలంటే ఇక్కడ అధికార యంత్రాంగం మొత్తం ఆయ‌న కంట్రోల్‌లోనే, క‌నుస‌న్నల్లోనే న‌డుస్తుంద‌న్న టాక్ జిల్లాలో ఓపెన్‌. దీంతో ఇక్కడ ఎమ్మెల్యే స్వామి డ‌మ్మీ అయిపోయాడు. అలాగే గ‌త ఎన్నిక‌ల్లో ఇక్కడ స్వామి గెలుపున‌కు అయిన ఖ‌ర్చంతా దామ‌చ‌ర్ల ఫ్యామిలీయే భ‌రించింది. దామ‌చ‌ర్ల ఫ్యామిలీ పెత్తనం మ‌రీ ఎక్కువైపోవ‌డంతో పాటు టీడీపీకి వెన్నుద‌న్నుగా ఉండే క‌మ్మ సామాజిక‌వ‌ర్గంలో కూడా ఎమ్మెల్యే స్వామికి ప‌ట్టులేదు. ఇక జూపూడి టీడీపీలో చేర‌డంతో ఆయ‌న‌కే బాబు సీటు ఇస్తార‌న్న వార్తలు కూడా వ‌స్తున్నాయి. మ‌రోవైపు జ‌నార్థన్‌తో స్వామికి స‌ఖ్యత లేదు… ఈ కార‌ణాలు అన్ని ఆయ‌న పార్టీ మార‌తార‌న్న వార్తల‌కు బలం చేకూరుస్తున్నాయి. మ‌రి ఎన్నిక‌ల టైంకు కొండ‌పి టీడీపీలో ఎలాంటి ప‌రిణామాలు చోటు చేసుకుంటాయో ? చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*