ఆపరేషన్ ఆకర్ష్… వికర్ష్ అయిందే….?

తెలుగుదేశం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ను ఆపలేదు. వైసీపీ ఎమ్మెల్యేలకు ఇంకా గాలం వేస్తూనే ఉన్నారు. ఇప్పటికే 23 మంది ఎమ్మెల్యేలను వైసీపీ నుంచి టీడీపీలోకి చేర్చుకున్న సంగతి తెలిసిందే. అయితే ప్రత్యేక హోదాపై జగన్ కు పెరుగుతున్న ఇమేజ్, పాదయాత్రతో పార్టీకి వస్తున్న ఊపును తగ్గించడానికి టీడీపీ మరోసారి ఆపరేషన్ ఆకర్ష్ కు తెరతీసినట్లు చెబుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా వైసీపీ ఎమ్మెల్యేయే పేర్కొనడం విశేషం. వైసీపీ అధినేత జగన్ గత నాలుగు నెలల నుంచి ప్రజాసంకల్ప పాదయాత్ర చేస్తున్నారు. ఈ పాదయాత్ర ఇప్పటికే ఏడు జిల్లాలు పూర్తి చేసుకుంది.

పాదయాత్ర సందర్భంగా…..

అయితే పాదయాత్ర సందర్భంగా కొందరు టీడీపీ నేతలు వైసీపీలో చేరుతుండటం సైకిల్ పార్టీని కలవరపరుస్తోంది. టీడీపీ లో ఉన్న సీనియర్ నేతలు సయితం పార్టీని వీడి వెళతారన్న ప్రచారం పసుపు పార్టీ నేతలకు నిద్ర పట్టనివ్వడం లేదు. దీంతో వైసీపీ నుంచి కొందరి ఎమ్మెల్యేలను చేర్చుకుంటే కొంత పరువును నిలబెట్టుకోవచ్చన్న ఆలోచనలో అధిష్టానం ఉంది. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలలో కొందరికి గాలం వేసి వారిని చేర్చుకుంటే జగన్ ఇమేజ్ ను తగ్గించడమే కాకుండా నెలన్నరగా పార్టీకి జరుగుతున్న నష్టాన్ని పూడ్చుకోవచ్చన్నది వారి ఆలోచన.

చేరికలు ఆగిపోవడంతో…..

జగన్ పాదయాత్ర ప్రారంభమయిన తర్వాత ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ పార్టీని వీడారు. అందులో పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఉన్నారు. వీరితో పాటు కర్నూలు ఎంపీ బుట్టా రేణుక కూడా వైసీపీని వీడి టీడీపీలో చేరిపోయారు. ఆ తర్వాత చేరికలు ఆగిపోయాయి. రాజ్యసభ ఎన్నికల సందర్భంగా కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీలో చేరతారన్న టాక్ వచ్చింది. అయితే ఎవరూ వైసీపీని వీడలేదు. దీంతోపాటు వైసీపీలో చేరికలు మొదలయ్యాయి. ఈ పరిస్థితుల్లో కొంతమంది వైసీపీ ఎమ్మెల్యేలనయినా చేర్చుకోవాలని టీడీపీ అధిష్టానం భావిస్తోంది.

రివర్స్ అయిన సాలూరు ఎమ్మెల్యే….

కాని టీడీపీ చేసిన ఆపరేషన్ ఆకర్ష్ కు ఎమ్మెల్యేలు పడటం లేదు. అంతేకాకుండా తమను ప్రలోభ పెడుతున్నారంటూ ఏకంగా ఎమ్మెల్యేలు మీడియా ముందుకు రావడం విశేషం. సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర తనను టీడీపీలో చేరాలంటూ ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపించడం గమనార్హం. తనను కొందరు టీడీపీ నేతలు కలిశారని, రెండు రోజుల క్రితం కూడా తన వద్దకు వచ్చి పార్టీలో చేరాలంటూ వత్తిడి తెచ్చారని చెప్పారు. తనను కొనుగోలు చేయాలని ఇంటి చుట్టూ కొందరు టీడీపీ నేతలు తిరుగుతున్నారని చెప్పారు. తాను చెప్పినదాంట్లో అసత్యముందని టీడీపీ నేతలు ఖండితస్తే బోసుబొమ్మ జంక్షన్ లో ఈ విషయాలన్నింటినీ బహిరంగంగా వివరిస్తానని సవాల్ విసిరారు. ఇలా టీడీపీ మాత్రం నష్ట నివారణకు మళ్లీ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరతీసినట్లే కనపడుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*