రెండు పార్టీలకు గాంధీనే దిక్కు …

లోక్ సభ వర్షాకాల సమావేశాలు ఎపి నేతల హడావుడితో వేడి వేడిగా సాగనున్నాయి. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం ఇప్పటికే వైసిపి ఎంపీలు రాజీనామా చేసి వాటిని ఆమోదింప చేసుకున్నారు. ఇక పార్లమెంట్లో ఏమి చేసినా తమకే మైలేజ్ అని భావించిన టిడిపికి షాక్ ఇవ్వబోతున్నారు వైసిపి మాజీ ఎంపీలు. ప్రజల్లో తమ పోరుబాట వదల్లేదని సంకేతాలు పంపేందుకు పార్లమెంట్ ఆవరణలో వున్న మహాత్మా గాంధీ విగ్రహం ముందు సెషన్స్ నడిచినంతకాలం ఆందోళన చేపట్టాలని ఆ పార్టీ నిర్ణయించింది. టిడిపి ఎంపీలు పార్లమెంట్లో పోరాటానికి సమాయత్తం అయితే వైసిపి గాంధీ ముందు చేపట్టనున్న నిరసన వ్యూహంపై తెలుగుదేశం పార్టీ సైతం తన ఆందోళనలో మార్పులు చేసుకుంది.

టిడిపి రెండు రకాల నిరసనలకు రెడీ …

వైసిపి కి ఏ మాత్రం మైలేజ్ దక్కరాదన్న స్కెచ్ తో గాంధీ విగ్రహం ముందు టిడిపి సైతం ఆందోళన చేపట్టాలని నిర్ణయించింది. లోక్ సభకు వెళ్ళేముందు వాయిదా పడ్డాకా ఏపీకి న్యాయం చేయాలంటూ పెద్దఎత్తున నిరసనలు తెలిపేందుకు పసుపుదళం సిద్ధమైపోయింది. ఈ నేపథ్యంలో ఇక ఢిల్లీ లో ఎపి రాజకీయం అంతా పార్లమెంట్ సంగతి ఎలా వున్నా గాంధీ చుట్టూనే తిరిగేలా కనిపిస్తుంది. మరోపక్క టిడిపి ఎంపి కేశినేని నాని అవిశ్వాసానికి మరోసారి నోటిస్ ఇచ్చేశారు. కేంద్ర సర్కార్ తో అమితుమికి మేము పూర్తి సిద్ధమన్న వ్యూహంతో దూకుడుగా ముందుకు వెళుతుంది టిడిపి. దాంతో రసవత్తర రాజకీయం ఇకపై హస్తినలోని పార్లమెంట్ లోపలా బయటా ఎపి ప్రజలు వీక్షించనున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*