తెలుగు కళల కోట-తెలంగాణ సేవల తోట

తెలంగాణలో పుట్టి పెరిగి అంత దూరం వెళ్లినా ఆ మట్టి వాసనలను పోనివ్వ దలచుకోలేదు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను అగ్రరాజ్యంలోనూ ప్రతిబింబించాలన్నదే ఆ సంస్థ లక్ష్యం. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తెలంగాణ ప్రజలు ఎంత సంబరాలు చేసుకున్నారో….తమకు సొంత రాష్ట్రం ఏర్పడిందని అమెరికాలోని తెలంగాణ ప్రజలు అంతకంటే ఎక్కువగా సంతోషించారు. తెలంగాణ పల్లెలు, అక్కడి సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలు ఇక్కడ జరుపుకుంటూ అమెరికాలోనూ తెలంగాణ నినాదాన్ని విన్పిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అమెరికాలోని తెలంగాణవాసులందరూ కలసి అసోసియేషన్ గా ఏర్పడ్డారు. తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్(TATA) పేరిట ఏర్పడిన ఈ సంస్థ ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తుంది. ఈనెల 31 నుంచి వచ్చే నెల రెండో తేదీ వరకూ డల్లాస్ వేదికగా జరిగే అమెరికన్ తెలుగు కన్వెన్షన్ లో భాగస్వామి అయింది. టాటా అధ్యక్షులు హరనాధ్ పోలిచెర్ల అమెరికాలో వైద్య వృత్తిలో స్థిరపడ్డారు. ఆయన వైద్య వృత్తిని కొనసాగిస్తూనే ఈ అసోసియేషన్ సేవా కార్యక్రమాలను విస్తరిస్తున్నారు. అమెరికా తెలుగు సభల సందర్భంగా హరనాధ్ పోలిచెర్ల ‘‘తెలుగుపోస్ట్’’ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

ప్రశ్న : ఈ సంస్థ ఆవిర్భావం ఎలా జరిగింది?

హరనాధ్ పోలిచర్ల : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ ఉన్న తెలంగాణవాసులందరూ కలసి ఈ సంస్థను ఏర్పాటు చేసుకున్నాం. ఈ సంస్థ ఆవిర్భావానికి ముఖ్య కారకులు పైల మల్లారెడ్డిగారు. ఆయన కృషితోనే ఈ సంస్థ ఆవిర్భవించింది. ఆవిర్భవించి కొద్ది సంవత్సరాలైనా జాతీయ సంస్థగా గుర్తింపు పొందింది. ఈ సంస్థ ఏర్పాటుకు ఎందరో సహకరించారు. విజయపాల్ రెడ్డి, మోహన్ రెడ్డి తదితరుల కృషి ఎంతో ఉంది. ఏ ఒక్కరో కాదు. అందరం కలసి సమిష్టిగా ఈ సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలను చేస్తున్నాము.

ప్రశ్న: సంస్థ ప్రధాన ఉద్దేశ్యం ఏంటి?

హరనాధ్ పోలిచర్ల: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ఇక్కడ బలంగా తీసుకెళుతున్నాం. పిల్లల దగ్గర నుంచి తెలంగాణ సంస్కృతిని నేర్చుకునేలా అనేక కార్యక్రమాలు చేపట్టాం. భాష మీద పట్టు వచ్చేలా కృషి చేస్తున్నాం. తెలంగాణ ఉద్యమ చరిత్రను కూడా తెలియజేస్తున్నాం. భాషను, సంస్కృతి, సంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించేవిధంగా చర్యలు తీసుకుంటున్నాం. దసరా పండగ, బోనాలు, బతుకమ్మ పండగలను ఇక్కడ కూడా చేస్తూ తెలంగాణ సంప్రదాయాలను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాం. కట్టుబాట్లను నేర్పిస్తున్నాము.

ప్రశ్న : అక్కడ మీ సేవలు?

హరనాధ్ పోలిచర్ల: తెలంగాణ బిడ్డలు ఏ ఆపదలో చిక్కుకున్నా వెంటనే స్పందిస్తున్నాం. వారికోసం ప్రత్యేకంగా సెల్ ను ఏర్పాటు చేసి వారి సమస్యలపై సత్వరమే చర్యలు తీసకుంటున్నాం. అమెరికాకు ఎక్కువ మంది వస్తుండటంతో సమస్యలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. అయితే న్యాయపరంగా మాత్రమే తాము వారికి సాయం చేస్తున్నాం. కొందరిని ఆర్థికంగా కూడా ఆదుకుంటున్నాం. సుదూర ప్రాంతానికి వచ్చిన తెలంగాణ బిడ్డలు ఇబ్బందులు పడకూడదనే అనేక కార్యక్రమాలు ఇటీవల కాలంలో చేపట్టాం.

ప్రశ్న : తెలంగాణలో మీ సేవలమాటేంటి?

హరనాధ్ పోలిచర్ల: తెలంగాణ రాష్ట్రంలో అనేక సేవలను అందిస్తున్నాం. ఏడాదికి ఒకసారి అక్కడకు వచ్చి స్వయంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం ఇక్కడ స్థిరపడ్డ తెలంగాణవాసులు కొందరు తమ గ్రామాల్లో స్వచ్ఛందంగా సేవలందిస్తున్నారు. నల్లగొండ సుంకేశుల గ్రామాన్ని దత్తత తీసుకున్నాం. నల్లగొండ జిల్లాలో అనేక గ్రామాలు ఇప్పటికీ తాగునీటి సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఫ్లోరైడ్ సమస్య ఉంది. దీంతో మేం కొన్ని గ్రామాలకు స్వచ్ఛమైన నీరును అందజేస్తున్నాం. అలాగే వరంగల్, హన్మకొండ తదితర ప్రాంతాల్లో ఉచిత మెగా హెల్త్ క్యాంపులను నిర్వహించాం. పేద విద్యార్థులకు స్కాలర్ షిప్ లను ఇస్తున్నాం. మా సంస్థ సభ్యుడైన మోహన్ రెడ్డి నెమలి గ్రామంలో ఉచిత వైద్యశాలను కూడా ఏర్పాటు చేశారు. వికలాంగులు, అనాధల కోసం కూడా అనేక సేవలను వివిధ రూపాల్లో అందిస్తున్నాం. వివిధ స్వచ్ఛంద సంస్థలకు ఆర్థికసాయాన్ని అందచేస్తున్నాం.

ప్రశ్న: అటాతో కలసి…ఇలా?

హరనాధ్ పోలిచర్ల: అవును. ఇది మంచి పరిణామం. ఎక్కడున్నా తెలుగువారంతా ఒక్కటే. అందరం కలిస్తే సమస్యలను మరింత సులువుగా పరిష్కరించుకునే వీలుంటుంది. అమెరికాలో ఉన్న తెలుగు ఆర్గనైజషన్స్ అన్ని కలసి పనిచేయాలని రెండేళ్ల నుంచి అనుకుంటున్నాం. కాని నాటా వారి కార్యక్రమం వారు చేసుకుందామని భావించింది. దీంతో అమెరికన్ తెలుగు అసోసియేషన్, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ కలసి సంయుక్తంగా అమెరికా తెలుగు కన్వెన్షన్ ను నిర్వహిస్తున్నాం. రెండు నెలల నుంచి ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి అనేక మంది కృషి చేస్తున్నారు. అన్ని సంస్థలు కలసి కార్యక్రమాన్ని చేసుకుంటే ఖర్చు కూడా తక్కువవుతుంది. ఖర్చు తక్కువయితే మిగిలిన సొమ్మును సేవారంగానికి వినియోగించాలన్నదే మా అభిమతం.

ప్రశ్న: ఎవరెవరిని ఆహ్వానిస్తున్నారు?

హరనాధ్ పోలిచర్ల: రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయనేతలు హాజరవుతున్నారు. ముఖ్యంగా గ్లోబల్ ఆసుపత్రి ఛైర్మన్ రవీంద్ర నాధ్ టీమ్ ఆఫ్ స్పీకర్ గా వస్తున్నారు. అనేకమంది కవులు,కళాకారులు ఇక్కడకు వచ్చేస్తున్నారు. వారందరినీ ఒకచోట చేర్చడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఆ మూడు రోజులూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం ఉట్టిపడేలా చర్యలు తీసుకుంటున్నాం. తెలంగాణ రుచులను అందుబాటులో ఉంచుతున్నాం. ఈ మూడురోజులు డల్లాస్ లో ఉన్నప్పటికీ తెలంగాణలో ఉన్న అనుభూతిని కల్గించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. తెలుగు కళల కోట-తెలంగాణ సేవల తోట అన్నదే మా నినాదం. దాతలు ఎంతగానో సహకరిస్తున్నారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాలన్నదే మా లక్ష్యం. ఈ వేడుక విజయవంతం అవుతుందని నేను ఆశిస్తున్నాను.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*