బంగారు తెలంగాణ…ఎంతెంత దూరం..?

జూన్ 2.. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ తీరిన రోజు. ఆరు దశాబ్దాల అలుపెరగని పోరాటం ఫలించిన రోజు. స్వరాష్ట్రం కోసం బలిదానాలు చేసుకున్న యువత కల నెరవేరిన రోజు. పార్టీలు, కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా పోరాడిన సకల జనుల స్వప్నం సాకారమైన రోజు. సరిగ్గా నాలుగేళ్ల క్రితం జూన్ 2 న తెలంగాణ రాష్ట్రం అవతరించింది. ఎన్నో ఆశలు, ఆశయాలు, కలలతో తెలంగాణ సమాజం స్వరాష్ట్రంలోకి అడుగిడింది. మన రాష్ట్రం మనకుంటే.. ఉద్యోగాలు వస్తాయని, భూములకు నీళ్లొస్తాయని, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ప్రజలు భావించారు. అయితే, స్వరాష్ట్రం ఏర్పడి నేటితో నాలుగేళ్లయినందున తెలంగాణ ప్రజల ఆశలు ఎంతవరకు నెరవేరాయి, నాలుగేళ్ల స్వపరిపాలన ఎలా జరగిందో ఒకసారి చూద్దాం.

సుదీర్ఘ ప్రణాళిక, దూరదృష్టితో…

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మొదటి ఎన్నికల్లో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వైపే నిలిచారు ప్రజలు. నాలుగేళ్లుగా అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల జీవితాలను పూర్తిగా మార్చేయకున్నా, ఈ ప్రాంతం బాగుకోసం మాత్రం ప్రయత్నిస్తోంది. సుదీర్ఘ ప్రణాళికతో రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకెళ్తోంది. అయితే, రాష్ట్ర ఏర్పాటుకు ముందు ప్రజలు ఆశించిన విధంగా పాలన లేదని, ప్రజల బతుకులు స్వరాష్ట్రంలో ఏమీ మారలేదని, ఇది ప్రభుత్వ వైఫల్యమనేది ప్రతిపక్షాల వాదన. ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చిన హామీలు కూడా నెరవేరలేదని, ఇందుకు డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి వంటి హామీలే ఉదాహరణ అని విమర్శిస్తున్నాయి ప్రతిపక్షాలు.

నీళ్లు..నిధులు..నియామకాలు..

తెలంగాణ ఉద్యమం నిలబడిందే నీళ్లు..నిధులు..నియామకాలు అనే నినాదంపైనే. అటువంటి ఈ నినాదాన్ని సాకారం చేసే ప్రయత్నాలను నత్తనడకన చేస్తోంది తెరాస ప్రభుత్వం. నీళ్ల విషయంలో సీఎం కేసీఆర్ కి ఉన్న అవగాహన ప్రాజెక్టుల రూపకల్పనలో ఉపయోగపడిందనే చెప్పాలి. కానీ, ఆయన రాష్ట్రం ఏర్పడిన మొదట్లో చెప్పిన అన్ని ప్రాజెక్టులు మాత్రం ముందుకు సాగడం లేదు. కేవలం కాలేశ్వరం ప్రాజెక్టు మాత్రం చరిత్రలో నిలిచిపోయే విధంగా వేగవంతంగా పూర్తవుతోంది. మరీ కేవలం కాలేశ్వరం పూర్తి చేస్తే సరిపోతుందా..? పాలమూరు – రంగారెడ్డి వంటి ప్రాజెక్టులను పట్టించుకోరా అనేది ప్రతిపక్షాల వాదన. ఇక నియామకాల విషయానికి వస్తే యువత ఆశలపై సర్కారు నీళ్లుజల్లిందనే చెప్పాలి. ఆశించిన మేర నియామకాలు చెపట్టలేదు. ఈ విషయంలో ప్రభుత్వం విఫలమైంది. ఇందుకే రాష్ట్రంలో ఎక్కువ అసంతృప్తితో ఉన్నది కూడా యువతే. కొట్లాడి సాధించిన తెలంగాణలో ఉద్యోగాలు రాకపోతే ఎలా..? అనేది వారి బాధ. ఇక నాలుగేళ్లుగా అరకొర నోటిఫికేషన్లు వచ్చినా ఇప్పుడు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

హామీల అమలు ఏమయ్యింది…?

తెరాస ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రధాన హామీలు నెరవేరడం లేదు. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం మెల్లిగా సాగుతోంది. ఇక దళితులకు మూడెకరాల భూమి హామీ అటకెక్కింది. మరో ముఖ్యమైన హామీ కేజీ టూ పీజీ ఉచిత విద్య హామీ గురించి అయితే ప్రస్తావనే తేవడం లేదు. కానీ, ఇదే సందర్భంగా రాష్ట్రంలో విద్యుత్ సమస్యను పరిష్కరించిన ఘనత మాత్రం కచ్చితంగా కేసీఆర్ దేనని చెప్పాలి. ఎన్నికల్లో హామీ ఇవ్వకున్నా.. ప్రస్తుతం చేపట్టిన రైతుబంధు పథకం చరిత్రాత్మకమైంది. రైతులను ఆదుకునేందుకు ఎకరానికి రూ.ఎనిమిది వేలు పెట్టుబడి ఇవ్వడం ద్వారా వారికి ప్రభుత్వం అండగా ఉంటుంది. అయితే, కౌలుదారులకు ఈ పథకం వర్తించకపోవడం, ఎక్కువ భూమి ఉన్న ధనవంతులకు ఎక్కువ డబ్బు ఇవ్వడం, తక్కువ భూమి ఉన్నవారికి తక్కువ డబ్బులు ఇవ్వడం ద్వారా పేదలకు న్యాయం జరగడం లేదనే వాదన కూడా ఉంది. ఇక మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నీరందించే మహత్తర ప్రాజెక్టు కూడా వేగంగా జరుగుతోంది. చెరువుల్లో పూడిక తీసేందుకు చేపట్టిన మిషన్ కాకతీయ పథకం కూడా మంచి ఫలితాలే ఇస్తోంది. అయితే, ఈ రెండు ప్రాజెక్టుల్లో అవినీతిపైన ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు మాత్రం అన్నీఇన్నీ కావు.

కేసీఆర్ మాటలే కొంప ముంచాయి…

వాస్తవానికి, రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజలకు మేలు చేయడం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే, ఇందులో కొన్ని దీర్ఘకాలంలో, కొన్ని వెంటనే ఫలితాలను అందించేవి ఉన్నాయి. ఇక ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత ప్రభుత్వాధినేత కేసీఆర్ చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలే ఇప్పుడు ప్రభుత్వానికి సమస్యలు తెచ్చేవిగా ఉన్నాయి. ఈ మాటలతో ఆశలు పెంచుకున్న ప్రజలు అవి నెరవేరకపోయే సరికి ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు. ట్యాంక్ బండ్ చుట్టూ ఆకాశహార్మ్యాలు, కొత్త సచివాలయం, ఉస్మానియా ఆసుపత్రి, అసెంబ్లీ నిర్మిస్తామనడం, హైదరాబాద్, కరీంనగర్ వంటి పట్టణాలను డల్లాస్, ఇస్తాంబుల్ చేస్తామనడం ప్రభుత్వం పట్ల కొంత వ్యతిరేక భావన కలిగించాయి.

కేసీఆర్ పై వ్యక్తిగత విమర్శలు….

గతంలో ఎన్నడూ లేనంతగా ముఖ్యమంత్రిపై వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు ప్రతిపక్షాల నాయకులు. ముఖ్యంగా బంగారు తెలంగాణ, రాజకీయ పునరేకీకరణ పేరుతో తెలంగాన ఉద్యమంలో పాల్గొనని వారిని, వ్యతిరేకించిన వారిని టీఆర్ఎస్ లో చేర్చుకోవడం, మంత్రి పదవులు ఇవ్వడాన్ని ప్రతిపక్షాలతో పాటు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఉద్యమంలో కీలకంగా పనిచేసిన కోదండరాం ని దూషించడం, నిర్భందంగా వ్యవహరించడం కూడా మైనస్ గా మారింది. కుటుంబపాలనపై కూడా టీఆర్ఎస్ పై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజ్యసభ సభ్యుడిగా కేసీఆర్ బంధువు సంతోష్ ను నియమించాక ఇవి మరింత పెరిగాయి. ఇక, ప్రజలను కలవడం లేదని, ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదని, నిరంకుశం వ్యవహరిస్తున్నారనేది ప్రతిపక్షాల ఆరోపణ. అయితే, ఈ ఆరోపణలు ఎవరు అధికారంలో ఉన్నా సహజమే. ఏదేమైనా, తెలంగాణ అభివృద్ధి విషయంలో కేసీఆర్ దూరదృష్టి, అవగాహన శక్తి మాత్రం ఎవరూ శంకించలేనిదే. అయితే, ఆయన ఆలోచనలు అమలు కావడంలో మాత్రం నాలుగేళ్లుగా ఆశించిన వేగం కొరవడింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*