కూటమి.. కుంపట్లు

తెలంగాణలో కొత్తగా పుట్టుకు వస్తున్న కూటములు రాజకీయ ముఖచిత్రాన్ని విచిత్రంగా మారుస్తున్నాయి. ఎవరు ఎవరికి పోటీగా మారతారో తెలియని సందిగ్ధ పరిస్థితికి తావు ఇస్తున్నాయి. మహాకూటమి పేరుతో అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా పోటీ ఇవ్వాలనుకుంటున్న ప్రధాన పక్షానికి పక్కలో బల్లెంగా రూపుదాల్చబోతున్నాయి మరో రెండు కూటములు. ఇవన్నీ కలిసి అధికార టీఆర్ఎస్ తలపై పాలు పోస్తాయేమోననే అనుమానాన్ని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ ను బలమైన పార్టీగా అందరూ గుర్తిస్తున్నారు. అందులోనూ నాలుగన్నరేళ్లుగా ప్రతి ఉపఎన్నికలోనూ విజయం సాధించింది. సైకలాజికల్ గా ప్రత్యర్థి పార్టీలపై పైచేయి సాధించగలిగింది. దీనిని రివర్స్ చేయాలంటే అన్ని పార్టీలు చేతులు కలపాల్సిందే. విడిగా పోటీచేస్తే కారు వేగాన్ని తట్టుకోవడం కష్టం. ఈ ఉద్దేశంతోనే తమ మధ్య సైద్ధాంతిక విభేదాలను పక్కనపెట్టి సీపీఐ, తెలంగాణ జనసమితి, కాంగ్రెస్, టీడీపీలు ఒకే తాటిమీదకు వచ్చాయి. పార్టీలు ఒకే ప్లాట్ ఫామ్ మీదకు వచ్చినప్పటికీ కింది స్థాయిలోని నాయకత్వం మాత్రం ఇంకా ఏకాభిప్రాయానికి రాలేదు. ప్రత్యేకించి నియోజకవర్గాల్లో తామే పోటీ చేయాలనుకుంటున్న ద్వితీయశ్రేణి నాయకులు సర్దుకోలేకపోతున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నారు. ఫలితంగా కూటమి ఓటు బ్యాంకుకు చిల్లు పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

మహాకూటమి…

మహాకూటమి సింగిల్ పాయింట్ అజెండా టీఆర్ఎస్ ను ఓడించడం. అధికార పార్టీ వ్యతిరేకతే ఏకసూత్రంగా పార్టీలు జట్టు కడుతున్నాయి. అయితే సీట్ల పంపకాల్లో అందరికీ న్యాయం చేయడం సాధ్యం కావడం లేదు. కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ నాయకులు తమకు అన్యాయం జరిగిందని వాపోతున్నారు. సీపీఐ కొంతమేరకు సర్దుకుపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. నిజానికి కూటమిలో తమకు అన్యాయం జరుగుతోందని మొదటగా సీపీఐ ధ్వజమెత్తింది. అయితే ఢిల్లీ స్థాయిలో సూచనలు రావడంతో.. వచ్చిన సీట్లపైనే కాన్సంట్రేషన్ పెడుతున్నారు. టీజేఎస్ మాత్రం తమకు దక్కిన స్థానాలకు అదనంగా మరికొన్ని సీట్లలో పోటీ చేయాలని భావిస్తున్నారు. పార్టీలోని కొందరు రెబల్ అభ్యర్థులుగా బరిలో దిగేందుకు సిద్దమవుతున్నారు. స్నేహపూర్వక పోటీ పేరిట రంగంలోకి దిగేందుకు టీజేఎస్ ఏర్పాట్లు చేసుకుంటోంది. అలాగే కాంగ్రెస్ సైతం కొన్ని టీజేఎస్ సీట్లలో తమ అభ్యర్థులను రంగంలోకి దింపాలని చూస్తోంది. ఆయా పార్టీల కదలికలను పరిశీలించిన తర్వాత టీడీపీ కూడా బలమున్న ప్రాంతాల్లో రెబల్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే సూచనలున్నాయి. ఈ ఫ్రెండ్లీ కాంటెస్టులు కూటమి మౌలిక లక్ష్యానికే గండి కొట్టే వాతావరణం ఏర్పడుతోంది. వాళ్లు సీట్లు పంచుకునేటప్పటికే మేం స్వీట్లు పంచుకుంటామంటూ టీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు కూటమిలోని పరిస్థితికి దర్పణం పడుతున్నాయి. దీంతో కూటమి ఐక్యత మూడడుగులు ముందుకు ఆరడుగులు వెనక్కి అన్నట్లుగా మారింది.

వామపక్ష కూటమి…

‘రండి …రండి..రండి’ మేము రెడీ.. మీ సీటు రెడీ అన్నట్లుగా తయారైంది సీపీఎం నేతృత్వంలోని బహుజన లెఫ్ట్ ఫ్రంట్ పరిస్థితి. కులాలన్నిటినీ ఏకం చేసి తెలంగాణపై బహుజనుల జెండా ఎగరవేయాలనేది ఈ కూటమి ఆశయం. సీపీఎం పార్టీ మినహా మిగిలిన పెద్ద పార్టీలేమీ దీంతో చేతులు కలపలేదు. కుల సంఘాలు సైతం పెద్దగా కలిసి రాలేదు. అక్కడక్కడా చిన్నాచితక నేతలే దీంతో చేతులు కలిపారు. పైపెచ్చు టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా అన్నిపార్టీలు ఏకమవుతుంటే బీఎల్ఎఫ్ కూటమి కట్టడమంటే పరోక్షంగా అధికారపార్టీకి సహకరించడమనే విమర్శలున్నాయి. దీంతో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ పై అనుమాన మేఘాలు కమ్ముకున్నాయి. ఎవరూ దీనిని పెద్దగా విశ్వసించడం లేదు. అయినా ఏదో ఆశ, మిణుక్కుమిణుక్కు మంటున్న స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఈ కూటమి తరఫున పోటీ పడేందుకు స్థాయి కలిగిన అభ్యర్థులు కనిపించడం లేదు. అందుకే కాంగ్రెస్, టీడీపీల్లో టిక్కెట్లు రాని పెద్ద నాయకులను తమతో కలుపుకుని ముందుకు వెళ్లాలనే యోచనతో ఉంది. బీజేపీ సైతం సరైన అభ్యర్థులు లేక ఇబ్బందులు పడుతోంది. ఈ పార్టీ కూడా ఇతర పార్టీల అసమ్మతి వాదులనే నమ్ముకుంటోంది. ఏదో రకంగా తాము సైతం పోటీలో ఉన్నామని నిరూపించుకోవాలనుకుంటున్నారు. గెలుపోటముల సంగతి తర్వాత, కనీసం డిపాజిట్లు తెచ్చుకోగలిగితే పరువు దక్కుతుందని భావిస్తున్నారు.

అసమ్మతి కూటమి..

తాజాగా చర్చల్లోకి వచ్చి చేరిన ప్రత్యర్థుల సమూహం మరో కూటమి. ఈ కూటమికి జెండా, అజెండా అంటూ లేవు. ప్రధాన పార్టీల్లో టిక్కెట్లు రాకపోతే చాలు. తమకు అంగబలం, అర్థబలం ఉందని భావించే నేతలు ఒక జట్టు కట్టాలని భావిస్తున్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ప్రవేశించిన సందర్భంగా ఒక మోస్తరు నాయకులు హస్తం తీర్థం స్వీకరించారు. వారందరికీ టిక్కెట్లు ఇప్పిస్తానని ఆయన భరోసానిచ్చారు. కానీ ఇప్పుడు పరిస్థితులు తిరగబడ్డాయి. కాంగ్రెసులో రేవంత్ వర్గంగా వ్యవహరించిన వారి నేత్రుత్వంలో ఈ కూటమి రూపుదిద్దుకుంటోంది. ఒకే ఎన్నికల గుర్తు తెచ్చుకోగలిగితే నియోజకవర్గాల్లో ప్రభావం చూపవచ్చనేది ఈ వర్గం నేతల ఆలోచన. అందుకుగాను ఏదో ఒక పేరుతో సింగిల్ ప్లాట్ ఫామ్ మీదకు రావాలని భావిస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే 30 మంది వరకూ ద్వితీయ శ్రేణి నాయకులు సమాలోచనలు జరిపినట్లు సమాచారం. ప్రధాన పార్టీకి ప్రత్యామ్నాయం కాకపోయినా తమకు టిక్కెట్టు ఇవ్వడానికి నిరాకరించిన తమ పేరెంట్ పార్టీకి చుక్కలు చూపించాలనేది ఈ కూటమి లక్ష్యం. మొత్తమ్మీద మూడు కూటములు, ఆరు అసంతృప్త స్వరాలుగా సాగుతోంది తెలంగాణలో ప్రతిపక్ష రాజకీయం.

Sandeep
About Sandeep 6914 Articles
Sandeep Reddy started his work in journalism at the age of 19 as a local reporter in leading telugu news paper. Later he worked as staff reporter. He has 9 years of experience in print and social media.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*