టీఎస్ మోడల్ ఠీక్ హై…నా..?

telangana model in andhrapradesh

తెలంగాణ రాష్ట్రసమితి అసెంబ్లీ ఎన్నికల్లో తాజాగా సాధించిన ఫలితం రాజకీయ పార్టీలకు ఆదర్శంగా మారింది. 46 శాతం ఓట్లతో నాలుగింట మూడొంతుల సీట్లతో అసాధారణ విజయాన్ని నమోదు చేసుకుంది. నాలుగు పార్టీలు కలిసి కూటమి కట్టినా కకావికలమైపోయాయి. పార్టీ నిర్మాణం సైతం పూర్తిగా లేకుండానే టీఆర్ఎస్ అనూహ్యమైన విజయాలు సొంతం చేసుకుంది. అదెలా సాధ్యమైందనే ప్రశ్నలకు సమాధానాలు సులభంగానే దొరుకుతున్నాయి. ముఖ్యంగా వ్యక్తిగత సంక్షేమ పథకాలు, తగుమోతాదులో సెంటిమెంటు రంగరించిన రాజకీయం టీఆర్ఎస్ కు అప్రతిహత విజయం అందించింది. నిజానికి అన్ని పార్టీలు సంక్షేమ మంత్రాన్నే పఠిస్తున్నాయి. సంక్షేమ పథకాలనూ అమలు చేస్తున్నాయి. అయినప్పటికీ ఈ స్థాయి విజయాలు సాధ్యం కావడం లేదు. దీనికి ప్రధాన కారణం ప్రజల నాడిపట్టుకోవడంలో వైఫల్యం. దీనికి సరైన పరిష్కారమార్గంగా టీఆర్ఎస్ చూపిన బాటను ఫాలో అయితే సరిపోతుందనే యోచన చేస్తున్నాయి పార్టీలు. ప్రధానంగా పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ ఈవిషయంలో మల్లగుల్లాలు పడుతోంది.

పాతవాళ్లైతే ఫలిస్తుందా..?

తెలంగాణ రాష్ట్రసమితి అధినేత కేసీఆర్ రాజకీయ సాహసాలకు పెట్టింది పేరు. ఈ విషయంలో ఎన్టీరామారావునే ఆదర్శంగా తీసుకున్నారనవచ్చు. మంత్రివర్గాన్ని మొత్తం ఒకే ఒక దెబ్బతో రద్దు చేసి ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారు. అదేవిధంగా పలు దఫాలు రాజీనామాలు సమర్పించి ఎన్నికలను ఎదుర్కొన్నారు కేసీఆర్. తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక ఎమ్మెల్యేలపై తీవ్రమైన వ్యతిరేకత ఉందని తెలిసి కూడా వారినే అభ్యర్థులుగా నిలబెట్టారు. ఓటర్లు తనను చూసి ఓటేయాలి తప్పితే స్థానికంగా అభ్యర్థిని చూసి కాదనే స్థిరనిర్ణయానికి వచ్చేశారు. ఎంతో ఆత్మస్థైర్యం ఉంటే తప్ప నాయకుడు అటువంటి నిర్ణయం తీసుకోలేరు. మాస్ ఇమేజ్ ఉన్న నాయకుడు మాత్రమే ఆవిధంగా చేయగలరు. దానిని చేసి చూపించారు కేసీఆర్. ప్రజలు ఆయన నమ్మకాన్ని వమ్ము చేయలేదు. తెలంగాణలో కనీవినీ ఎరుగని బలాన్ని కట్టబెట్టారు. ముందుగా అభ్యర్థులను ప్రకటించడం వల్ల వారంతా ప్రచారంలో ముందంజలో ఉండటానికి వీలైంది. ఇదే మోడల్ ను తమకూ వర్తింప చేయమని కోరుతున్నారు ఆంధ్రప్రదేశ్ లో అధికారపార్టీ ఎమ్మెల్యేలు. ఏపీలో సైతం సంక్షేమ పథకాలు బాగున్నాయి . అందువల్ల తమనే అభ్యర్థులుగా ప్రకటిస్తే ఇప్పట్నుంచే ప్రచారం చేసుకుంటామంటున్నారు. టీఆర్ఎస్ కు లభించిన ఫలితాలు టీడీపీకి కూడా వస్తాయనే సెంటిమెంటును పైకి తెస్తున్నారు.

కూటమి ..మైనస్సే…

తెలంగాణలో కాంగ్రెసుతో కలిసి టీడీపీ కట్టిన కూటమి మేలు చేకూర్చలేదు. ఎంతోకొంత కాంగ్రెసు అవకాశాలను దెబ్బతీసిందనే భావన వ్యక్తమయ్యింది. ప్రధానంగా ఏపీలో అధికారపార్టీ తెలంగాణలో అధికారానికి తహతహలాడటాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోయారు. దీనివల్ల తమ రాష్ట్రప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని అనుమానించారు. ఈవిషయంలో టీఆర్ఎస్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. చంద్రబాబు నాయుడి చాణక్యాన్ని వెలికి తెచ్చి అధిష్టానంతో సంబంధాలు పెట్టుకుని టీపీసీసీని డమ్మీని చేసేస్తారనే ప్రచారం నిర్వహించింది. దీంతో కూటమి కుప్పకూలిపోయింది. టీఆర్ఎస్ సెంటిమెంటు స్వేచ్ఛగా గెలుపు సాధించింది. ఈ అనుభవంతో ఏపీలో కూటమి కట్టకూడదనే నిర్ణయానికి తెలుగుదేశం నాయకులు మొగ్గు చూపుతున్నారు. కాంగ్రెసు పట్ల ఇంకా ఏపీ ప్రజల్లో సానుకూలత ఏర్పడలేదు. అంతేకాకుండా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడానికి కాంగ్రెసు ఎంతోకొంత ఉపకరిస్తుంది. పైపెచ్చు ఎస్సీ,ఎస్టీల్లో ఎంతోకొంత ఆదరణ కాంగ్రెసు పార్టీకి ఉంది. వైసీపీ సైతం ఆయా వర్గాల ఓట్లను అధికంగా ఆకర్షించగలుగుతోంది. ఈ ఓటు బ్యాంకుకు చిల్లు పెట్టాలంటే కాంగ్రెసు విడిగా పోటీ చేస్తేనే టీడీపీకి ప్రయోజనం. ఈ దిశలోనే పార్టీ నడవాలని మెజార్టీ నాయకులు కోరుకుంటున్నారు.

బాబు మిక్స్ డ్ బ్యాగ్…

చంద్రబాబు నాయుడు సీజన్ డ్ పొలిటీషియన్. రాజకీయగాలిని పసిగట్టి దానికనుగుణంగా తన సైన్యాన్ని సమీకరించడంలో నేర్పరి. 1999 నుంచి కూటములను కడుతూ విజయానికి అవసరమైన సమీకరణలు చేసుకుంటూ వస్తున్నారు. 2004, 2009లలో కూటములు కట్టినప్పటికీ టీడీపీ విజయం సాధించలేకపోయింది. 1999, 2014లో కూటమి కలిసి వచ్చింది. విడిగా టీడీపీ బలం సరిపోదని భావించిన ప్రతిసందర్భంలోనూ ఏదో ఒక చిన్నపార్టీని తనతో కలుపుకోవడమే చాణక్యం. ఇప్పుడు కూడా ఎన్టీయార్, కేసీఆర్ తరహా సాహసాలు చేసేందుకు చంద్రబాబు సిద్ధంగా లేరు. గంపగుత్తగా అభ్యర్థులను ప్రకటించేందుకు ఆయన తయారుగా లేరు. అందులోనూ పాత అభ్యర్థులందరికీ టిక్కెట్లు ఇవ్వడానికీ ఆయన సుముఖత చూపడం లేదు. ప్రజల్లో వారిపట్ల ఉన్న వ్యతిరేకత, బలం, ఆర్థిక సంపన్నత వంటి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతనే అభ్యర్థులుగా నిర్ణయిస్తారు. సామాజిక సమీకరణలూ ఇందులో కీలకమే. అందువల్ల ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న పాత అభ్యర్థులు, వారికంటే బలంగా ఉన్న కొత్త అభ్యర్థులను బేరీజు వేసిన తర్వాతనే టిక్కెట్లను ఖరారు చేయవచ్చునంటున్నారు. ఏతావాతా టీఎస్ మోడల్ ను ఏపీలో అధికార పార్టీ అమలు చేయదని రాజకీయ పరిశీలకులు తేల్చేస్తున్నారు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*